రాష్ట్ర విభజనకు కట్టుబడుతూనే సీమాంధ్ర సమస్యల పరిష్కారానికి పార్టీ కేంద్ర నాయకత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆ ప్రాంత బీజేపీ నేతలు నిర్ణయించారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు కట్టుబడుతూనే సీమాంధ్ర సమస్యల పరిష్కారానికి పార్టీ కేంద్ర నాయకత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆ ప్రాంత బీజేపీ నేతలు నిర్ణయించారు. పార్టీ పదాధికారుల సమావేశం మంగళవారం గుంటూరులో జరి గింది. కె.హరిబాబు సమావేశాన్ని ప్రారంభిస్తూ ఇటీవలి తమ ఢిల్లీ పర్యటన వివరాలను, పార్టీ కేంద్రనాయకులు చెప్పిన విషయాలను వివరించారు. సీమాంధ్రుల సమస్యలకు పరిష్కారం చూపిన తర్వాతే బిల్లుకు మద్దతు ఇచ్చేలా పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరాలని సమావేశంలో అత్యధికులు అభిప్రాయపడ్డారు. పోలవరం ప్రాజెక్టుకు తొలిప్రాధాన్యం ఇవ్వకపోతే భావితరాలు నష్టపోయే ప్రమాదం ఉందని, అందువల్ల చట్టపరమైన రక్షణ కల్పిం చేలా బిల్లులోనే ప్రతిపాదనలు ఉండేలా చూడాలని నిర్ణయానికొచ్చారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఇబ్బందులు రాకుండా ముంపునకు గురయ్యే ప్రాంతాలన్నింటినీ ఆంధ్రాలోనే కల పాలని.. నీటివనరుల పంపిణీ పర్యవేక్షణకు ఒక సంఘాన్ని నియమించాలంటూ పార్టీ నాయకత్వాన్ని కోరాలని నిర్ణయించారు.
మరోసారి ఢిల్లీ వెళ్లాలని నిర్ణయానికొచ్చారు. పార్టీ జాతీయ నేతలను కలిసేందుకు హరి బాబును బుధవారం ఢిల్లీకి పంపాలని సమావేశం తీర్మానించింది. సీనియర్ నేత బి.రంగమోహనరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి నేతలు, సోము వీర్రాజు, శాంతారెడ్డి, సురేష్‌రెడ్డి, జె.శ్యాంకిషోర్, వై.రఘునాధ్‌బాబు, శ్రీని వాసరాజుతో పాటు 13జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు హాజరయ్యారు. సమావేశంలో ప్రొఫెసర్ శేషగిరిరావు పోలవరం ప్రాజెక్టు అవశ్యకతను వివరిస్తూ పవర్‌పాయింట్ ప్రెజంటేషన్ ఇచ్చారు. కాగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డిని సమావేశానికి ఆహ్వానించలేదు.