బంద్ సంపూర్ణం
బంద్ సంపూర్ణం
పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ ఆర్డినెన్స్ ఆమోదించడంపై జిల్లావ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. టీజేఏసీ పిలుపు మేరకు శనివారం జిల్లా బంద్ విజయవంతమైంది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ పార్టీలతో పాటు టీజేఏసీ, ప్రజాసంఘాల నాయకులు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
కరీంనగర్: పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ లోక్‌సభలో ఆర్డినెన్స్‌ను ఆమోదించడాన్ని నిరసిస్తూ టీజేఏసీ, సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ, ప్రజా సంఘాలు తలపెట్టిన తెలంగాణ బంద్ జిల్లాలో సంపూర్ణంగా జరిగింది. బంద్‌కు అధికార టీఆర్‌ఎస్ పార్టీతోపాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, కులసంఘాల నేతలు సంపూర్ణమద్దతు తెలిపాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు బస్సులు నడవలేదు. పెట్రోలు బంకులు, సినిమాహాళ్లు, వ్యాపార వాణిజ్యసంస్థలు స్వచ్ఛందంగా మూసివేశాయి. మంథని, సిరిసిల్ల, కోహెడ, బెజ్జంకి సెంటర్‌లలో ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. తిమ్మాపూర్ మండలంలో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఎల్కతుర్తిలో కరీంనగర్-వరంగల్ ప్రధానరహదారిపై సీపీఐ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. వెల్గటూరు, కోరుట్ల, ఎన్టీపీసీ సెంటర్‌లో బైక్‌ర్యాలీ తీసి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
హుస్నాబాద్‌లో ఆర్టీసీ బస్సులను జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. జిల్లా కేంద్రంలో ఉదయం ఐదు గంటల నుంచే డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే బొడిగే శోభ, సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ, టీజేఏసీ జిల్లా నాయకులు ఎం.నారాయణ, గీట్ల ముకుందరెడ్డి, తాళ్లపల్లి శ్రీనివాస్, పైడిపల్లి రాజు, జూపాక శ్రీనివాస్, ముత్యంరావు తదితరులు అడ్డుకున్నారు. నగరంలో ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి టవర్‌సర్కిల్ వరకు ఊరేగింపుగా వెళ్లారు.
న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో...
పోలవరం బిల్లును పార్లమెంట్‌లో మూజవాణి ఓటుతో ఆమోదించడం తెలంగాణ ప్రజలను ఆవమానించడమేనని, తక్షణ బిల్లును వెనక్కి తీసుకోవాలని న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్, జూపాక శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివాసీ ముంపు గ్రామాలను తెలంగాణలోనే ఉం చే వరకూ పోరాటం ఆపేది లేదని హెచ్చరించారు. బంద్ సందర్భంగా బస్టాండ్ సెంటర్‌లో ధర్నా నిర్వహించి నగరంలో దుకాణాలు మూసివేయించారు. పీడీఎస్‌యూ, ఐఎఫ్‌టీయూ నాయకులు రత్నం రమేశ్, కి శోర్, భాస్కర్, ఎస్.రామయ్య, శ్రావణ్, మహేశ్, వెంకటేశ్, రాకేశ్ పాల్గొన్నారు.
టీజేఏసీ..
పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రలో కలపడం కేంద్ర ప్రభుత్వ అనాగిరిక చర్య అని టీజేఏసీ జిల్లా కన్వీనర్ జే.రవీందర్, కో ఆర్డినేటర్ జక్కోజి వెంకటేశ్వర్లు అన్నారు. బంద్ సందర్భంగా జేఏసీ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్‌లో బైఠాయించి రాస్తారోకో నిర్వహించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 220 గ్రామాలు, 3 లక్షల మంది గిరిజనుల బతుకులను చిన్నాభిన్నం చేసే పోలవరం ప్రాజెక్టు డిజైన్‌ను మార్చి నిర్మించుకోవాలని డిమాండ్ చేశారు. జేఏసీ నాయకులు మర్రి శ్రీనివాస్ యాదవ్, ఆంజనేయరావు, సుమిత్ర, పుష్పలత, మల్లిక, రాములునాయక్, లలిత, బన్సీలాల్, కోటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
అప్రజాస్వామిక చర్య: సీపీఐ
పోలవరం బిల్లును పార్లమెంటులో ఆమోదించడం అప్రజాస్వామిక చర్య అని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.నారాయణ అన్నారు. ముంపు ప్రాంతాల ప్రజల మనోభావాలను పరిశీలనకు తీసుకోకుండా శాసనసభ అభిప్రాయాన్ని సైతం తీసుకోకుండా ఏకపక్షంగా పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడం అనాగరిక చర్య అని అభివర్ణించారు. సీపీఐ ఆధ్వర్యంలో నగరంలో జరిగిన బంద్ కార్యక్రమంలో నాయకులు బోయిని అశోక్, పైడిపల్లి రాజు, కూన శోభరాణి, కాల్వ నర్సయ్యయాదవ్, పంజాల శ్రీనివాస్, బి.మహేందర్, సూరి, సమ్మయ్య, సదానందం, రాయమల్లు, రమేశ్, శశి, రాకేశ్, కొమురయ్య, రాజు, రోహిత్, రాజు, మణికంఠరెడ్డి, వివేక్, సంతోష్, సీహెచ్.రాజేశం, గోపి పాల్గొన్నారు.
ఎంసీపీఐ(యూ) ఆధ్వర్యంలో...
ఎన్డీఏ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలు ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఎన్‌సీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పోలవరం ఆర్డినెన్స్ తేవడానికి కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీ ఆర్‌ఎస్ పార్టీలే కారణమని విమర్శించారు. పోలవరం అర్డినెన్స్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని హెచ్చరించారు. టి.కృష్ణారెడ్డి, అజయ్, లింగయ్య, హేమలత, వేణుగోపాల్, బాబు, కిశోర్ తదితరులు పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో...
టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే బోడిగె శోభ ఆధ్వర్యంలో బంద్ సందర్భంగా బస్టాండ్ ముందు బైఠాయించారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. టీఆర్‌ఎస్ నాయకులు బోడిగె గాలన్న, జంగపల్లి కుమార్, సుదగోని శ్రీనివాస్, బి.తిరుపతినాయక్, పెండ్యాల మహేశ్, ప్రిన్స్ రాజు, మాజిద్ తదితరులు పాల్గొన్నారు.
దిష్టిబొమ్మకు శవయాత్ర
పోలవరం బిల్లు ఆమోదించడం గిరిజన బతుకులను కాలరాయడమేనని సీపీఎం జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి అన్నారు. బంద్ సందర్భంగా సీపీఎం ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి టవర్‌సర్కిల్‌లో దహనం చేశారు. నాయకులు ముత్యంరావు, సత్యం, రవికుమార్, సంపత్, శేఖర్, రాజునాయక్, ఎస్.మోహన్, ఎల్లయ్య, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.