- ఆంధ్రాబ్యాంక్ డీజీఎం రవికుమార్
వత్సవాయి : ఈ ఏడాది పదివేల కోట్ల రూపాయల వ్యాపారాన్ని లక్ష్యంగా నిర్ణయించుకున్నామని ఆంధ్రాబ్యాంక్ డీజీఎం జి.రవి కుమార్ తెలిపారు. వత్సవాయిలో బుధవారం జరిగిన ఆంధ్రాబ్యాంక్ శాఖ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 103ఆంధ్రాబ్యాంక్ శాఖలు, 87 ఏటీఎం సెంటర్లు ఉన్నాయని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం రూ.8,200 కోట్ల వ్యాపారం జరి గిందన్నారు. ఈ ఏడాది రూ.10 వేల కోట్ల వ్యాపారం చేయాలన్నది లక్ష్యమని పేర్కొన్నారు.
2013-14 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో 30 ఏటీఎం సెంటర్లు, 10 శాఖలను ప్రారంభించామని, ఈ ఏడాది జిల్లాలో మరో 30 ఏటీఎంలు, 10 శాఖలు ప్రారంభిస్తామని వెల్లడించారు. మరో ఐదు శాఖలకు అనుమతులు లభించాయని తెలి పారు. రైతులకు వ్యవసాయ రుణాలతో పాటు చేతి వృత్తుల వారికి తక్కువ వడ్డీకి అప్పులు ఇస్తామని ప్రకటించారు.
వడ్డీ వ్యాపారుల బారిన పడి నష్టపోకుండా చిరువ్యాపారులు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రుణాలు అందజేస్తామని చెప్పారు. గత ఏడాది జిల్లాలో 1500 మంది చిరువ్యాపారులకు రుణాలు ఇచ్చామని తెలిపారు. రాష్ట్ర విభజన జరిగిన నేపత్యంలో జిల్లాలో జగ్గయ్యపేట, నందిగామ నిమోజకవర్గాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. అందుకనుగుణంగా పారిశ్రామికవేత్తలకు రుణాలు ఇచ్చేందుకు తమ బ్యాంక్ ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు.