మండపేట : రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు వారాలకు పైగా కార్యకలాపాలేవీ జరగకపోవడంతో ఖజానాలు ఖాళీ అయ్యాయి. దాంతో అభివృద్ధి పనులకు ఆటంకంగా మారింది. కార్యకలాపాలను పునరుద్ధరించే దిశగా ఇంకా ఏ విధమైన ప్రభుత్వ ఉత్తర్వులు రాలేదని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఒక ప్రధాన ఖజానా కార్యాలయంతో పాటు 18 సబ్ ట్రెజరీ కార్యాలయాలు ఉన్నాయి. వీటి ద్వారా రోజూ కోట్లాది రూపాయల లావాదేవీలు జరుగుతుంటాయి.
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆస్తులతో పాటు ఖజనా శాఖను ప్రభుత్వం రెండుగా విభజించింది. రెండు రాష్ట్రాలకు ఇబ్బంది లేకుండా లెక్కలు తేల్చేందుకు రాష్ట్ర విభజనకు ముందుగానే ఖజానాల కార్యకలాపాలను స్తంభింపజేశారు. ప్రభుత్వోద్యోగులకు గత నెల 24వ తేదీనే జీతాలు చెల్లించేశారు. 27వ తేదీ నాటికి చెల్లింపుల ప్రక్రియను పూర్తి చేసి ట్రెజరీ కార్యాలయాల్లో కార్యకలాపాలను నిలిపివేశారు. సర్వర్లను నిలిపివేసి ఖాతాల్లో నిధులు లేకుండా చేశారు.
కొత్త రాష్ట్రం ఏర్పడిన అనంతరం ఈనెల 2వ తేదీ నుంచి కొత్త ఖాతాలు తెరిచి లావాదేవీలు ప్రారంభిస్తామని చెప్పారు. కానీ నేటికీ అది కార్యరూపం దాల్చలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఇప్పటి వరకు ఖజనాల్లో ఏ విధమైన నిధులు జమకాలేదు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నిధులను ట్రెజరీల ద్వారానే పొందాల్సి ఉంటుంది. అలాగే చేసిన అభివృద్ధి పనులకు బిల్లుల సొమ్ములను అక్కడి నుంచే డ్రా చేయాలి. ఖాతాల్లో నిధులు లేకపోవడం, బిల్లుల చెల్లింపునకు అనుమతులు రాకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోతున్నాయి.
కొందరికి జీతాల్లేవ్
ఖజానాను మూసివేసే క్రమంలో గత నెలలో 24వ తేదీ నాటికే ఉద్యోగులకు జీతాలు చెల్లించేశారు. అయితే ఎన్నికల విధులు, విభజనకు సంబంధించిన నివేదికలు సిద్ధం చేయడం తదితర పనుల్లో బిజీగా ఉన్న కొందరు ఉద్యోగులు జీతాల బిల్లులు పెట్టలేదు. జూన్ 2న ఖజానా కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాక బిల్లులు పెట్టి జీతాలు తీసుకోవచ్చని వారు భావించారు. కాగా నేటికీ ఖజానా కార్యకలాపాలు ప్రారంభం కాకపోవడం వారు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే పలువురు పింఛన్‌దారులు కూడా బిల్లులు పెట్టలేదని తెలుస్తోంది. త్వరితగతిన ఖజనాల్లో కార్యకలాపాలు పునరుద్ధరించాలని వివిధ వర్గాల వారు కోరుతున్నారు.
ఖజానా ఖాళీ
Published Sun, Jun 15 2014 1:23 AM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM
Advertisement