Treasures
-
వేదమంత్రాల సాక్షిగా అర్చకుడి ఆత్మార్పణం
రాజమహేంద్రవరం క్రైం: గుప్తనిధుల కోసం ఆలయంలో తవ్వకాలు జరపాలంటూ ధర్మకర్తల మండలి ఒత్తిడి చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అర్చకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం, కణుపురు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలోని శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జునస్వామి దేవాలయంలో కొత్తలంక మల్లికార్జున శర్మ (30)అర్చకుడు. అతని తండ్రి సత్యనారాయణ శర్మ 40 ఏళ్లుగా ఇక్కడే అర్చకుడిగా విధులు నిర్వహించేవారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో నివాసం ఉంటుండడంతో మల్లికార్జున శర్మ ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. అయితే దేవాలయంలో గుప్త నిధులున్నాయనే వదంతులు రావడంతో దేవాలయం ధర్మకర్తల మండలి సభ్యులు మల్లికార్జునశర్మపై తవ్వకాలకోసం ఒత్తిడి తీసుకొచ్చారు. దీనికి అతను అంగీకరించకపోవడంతో ఆయన స్థానంలో మరో పూజారిని నియమించారు.ఈ నేపథ్యంలో మల్లికార్జున శర్మ మంగళవారం పురుగుల మందు తాగాడు. స్థానికులు ఆస్పత్రిలో చేర్చగా అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందాడు. తనపై జరిగిన వేధింపుల విషయాన్ని సెల్ఫోన్లో వీడియో రికార్డు చేశాడు. ఆలయంలో గుప్తనిధులు తవ్వేందుకు సహకరించాలని ధర్మకర్తల మండలి సభ్యులు తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారని, కాగా తాను వేదమంత్రాలు వల్లెవేస్తూ మృతి చెందడం పలువురిని కంటతడి పెట్టించింది.దీనిపై అర్చక సమాఖ్య ఆందోళన వ్యక్తంచేసింది. మల్లికార్జున శర్మ మృతదేహంతో తమ నిరసనను తెలిపింది. అర్చకులకు రక్షణ కల్పించాలని కోరింది. -
70 ఏళ్ల తర్వాత బయటపడిన గుప్తనిధి!
70 ఏళ్ల కిందటి ఓ పాత్ర (మగ్గు)లో దాచిన గుప్తనిధి ఇన్నాళ్లకు బయటపడింది. జర్మనీలో నాజీల దురాగతాల కాలంనాటి ఓ మగ్గులో అతి జాగ్రత్తగా, రహస్యంగా ఎవరికీ కనపడకుండా ఓ బంగారు ఉంగరాన్ని, నగ (నెక్లెస్)ను దాచారు. మగ్గు అడుగున బంగారాన్ని ఉంచి దానిపై ఓ పొర లాంటిది ఏర్పాటుచేసి.. అదే అడుగుభాగమన్న భ్రమను కల్పించారు. జర్మనీలోని ఆష్విట్జ్ మ్యూజియంలో ఉన్న ఈ మగ్గులో లోపల గుప్తబంగారం ఉన్న విషయాన్ని తాజాగా సిబ్బంది కనుగొన్నారు. రెండోప్రపంచ యుద్ధకాలంలో జర్మనీలో నాజీలు కాన్సెంట్రేషన్ క్యాంపులు ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. ఈ కాన్సెంట్రేషన్ క్యాంపుల్లో ఐదో అతిపెద్దదైన ఆష్విట్జ్-బర్కెనౌలోని స్థావరంలో ఈ పాత్ర దొరికింది. ఈ క్యాంపునకు తరలించిబడిన ఓ వ్యక్తి ఈ మగ్గును తనవెంట తీసుకొచ్చాడని భావిస్తున్నారు. ఈ క్యాంపులో దొరికిన అలనాటి అవశేషాలను, వస్తువులను ప్రస్తుతం ఆష్విట్జ్ మ్యూజియంలో భద్రపరిచారు. రెండో ప్రపంచయుద్ధ కాలంలో జర్మనీలోని యూదులను నాజీ సైనికులు కాన్సెంట్రేషన్ క్యాంపులకు తరలించిన సంగతి తెలిసిందే. యూదుల వద్ద ఉన్న సమస్త సంపదను కొల్లగొట్టి కట్టుబట్టలతో మాత్రమే వారిని క్యాంపులకు తరలించేవారు సైనికులు. ఈ నేపథ్యంలో సైనికుల కంటపడకుండా ఓ యూదు వ్యక్తి తన వద్ద ఉన్న బంగారాన్ని ఈ మగ్గులో దాచి.. తన వెంట తెచ్చుకొని ఉంటాడని, భవిష్యత్తులో కాన్సెంట్రేషన్ క్యాంపు నుంచి బయటపడితే.. అది తమ కుటుంబానికి ఉపయోగపడుతుందన్న ఆశతో ఇలా చేసి ఉంటాడని పరిశీలకులు భావిస్తున్నారు. -
గుప్తనిధుల కోసం.. బాలుడి దారుణహత్య
నెల్లూరు: మూఢ నమ్మకాల పేరిట ఓ పసిబాలుడిని బలి చేశారు. ఈ ఘటన నెల్లూరు రూరల్ మండలం నరిసింహకొండలో ఆదివారం వెలుగుచూసింది. గుప్తనిధుల కోసం బాలుడిని దారుణంగా హత్య చేసినట్టు తెలుస్తోంది. అయితే గుప్తనిధుల కోసమే బాలుడిని బలి ఇచ్చారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం బాలుడు అదృశ్యమైనట్టు తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
వేలానికి మైకేల్ జాక్సన్ వస్తువులు!
లాస్ ఏంజెలిస్: పాప్ సంగీత రారాజు మైకేల్ జాక్సన్, ఆయన కుటుంబానికి చెందిన వ్యక్తిగత వస్తువులు ఆన్లైన్లో వేలానికి ఉంచారు. వీటిలో అనేక స్మారక వస్తువులతో పాటు జాక్సన్‌కు చెందిన సాక్స్, అండర్వియర్ వంటి వస్తువులూ ఉన్నాయి. జాక్సన్ కుటుంబానికి చెందిన ఫొటో ఆల్బమ్‌లు, ఆయన పెంపుడు చింపాంజీ బబుల్స్ ధరించిన జాకెట్, రికార్డింగులు ఉన్న 56 టేపులు కూడా వేలం వేయనున్నారు. ఇవన్నీ అందరి ఇళ్లలోనూ ఉండే సాధారణ వస్తువులే కానీ.. జాక్సన్‌కు చెందినవి కాబట్టి ఇవి చరిత్రాత్మకమయ్యాయని ‘గాట్టా హ్యావ్ ఇట్ కలెక్టిబుల్స్’ వేలం సంస్థ పేర్కొంది. జాక్సన్ వస్తువులను ఈ నెల 19 వరకూ వేలానికి ఉంచుతామని, ప్రస్తుతం అన్ని వస్తువులకూ కనిష్టంగా 100 డాలర్ల నుంచి బిడ్లు దాఖలు కాగా, మాస్టర్ టేపులకు మాత్రం కనిష్టంగా వెయ్యి డాలర్ల నుంచి బిడ్లు వేశారని తెలిపింది. -
ఖజానా ఖాళీ
మండపేట : రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు వారాలకు పైగా కార్యకలాపాలేవీ జరగకపోవడంతో ఖజానాలు ఖాళీ అయ్యాయి. దాంతో అభివృద్ధి పనులకు ఆటంకంగా మారింది. కార్యకలాపాలను పునరుద్ధరించే దిశగా ఇంకా ఏ విధమైన ప్రభుత్వ ఉత్తర్వులు రాలేదని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఒక ప్రధాన ఖజానా కార్యాలయంతో పాటు 18 సబ్ ట్రెజరీ కార్యాలయాలు ఉన్నాయి. వీటి ద్వారా రోజూ కోట్లాది రూపాయల లావాదేవీలు జరుగుతుంటాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆస్తులతో పాటు ఖజనా శాఖను ప్రభుత్వం రెండుగా విభజించింది. రెండు రాష్ట్రాలకు ఇబ్బంది లేకుండా లెక్కలు తేల్చేందుకు రాష్ట్ర విభజనకు ముందుగానే ఖజానాల కార్యకలాపాలను స్తంభింపజేశారు. ప్రభుత్వోద్యోగులకు గత నెల 24వ తేదీనే జీతాలు చెల్లించేశారు. 27వ తేదీ నాటికి చెల్లింపుల ప్రక్రియను పూర్తి చేసి ట్రెజరీ కార్యాలయాల్లో కార్యకలాపాలను నిలిపివేశారు. సర్వర్లను నిలిపివేసి ఖాతాల్లో నిధులు లేకుండా చేశారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన అనంతరం ఈనెల 2వ తేదీ నుంచి కొత్త ఖాతాలు తెరిచి లావాదేవీలు ప్రారంభిస్తామని చెప్పారు. కానీ నేటికీ అది కార్యరూపం దాల్చలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఇప్పటి వరకు ఖజనాల్లో ఏ విధమైన నిధులు జమకాలేదు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నిధులను ట్రెజరీల ద్వారానే పొందాల్సి ఉంటుంది. అలాగే చేసిన అభివృద్ధి పనులకు బిల్లుల సొమ్ములను అక్కడి నుంచే డ్రా చేయాలి. ఖాతాల్లో నిధులు లేకపోవడం, బిల్లుల చెల్లింపునకు అనుమతులు రాకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోతున్నాయి. కొందరికి జీతాల్లేవ్ ఖజానాను మూసివేసే క్రమంలో గత నెలలో 24వ తేదీ నాటికే ఉద్యోగులకు జీతాలు చెల్లించేశారు. అయితే ఎన్నికల విధులు, విభజనకు సంబంధించిన నివేదికలు సిద్ధం చేయడం తదితర పనుల్లో బిజీగా ఉన్న కొందరు ఉద్యోగులు జీతాల బిల్లులు పెట్టలేదు. జూన్ 2న ఖజానా కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాక బిల్లులు పెట్టి జీతాలు తీసుకోవచ్చని వారు భావించారు. కాగా నేటికీ ఖజానా కార్యకలాపాలు ప్రారంభం కాకపోవడం వారు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే పలువురు పింఛన్‌దారులు కూడా బిల్లులు పెట్టలేదని తెలుస్తోంది. త్వరితగతిన ఖజనాల్లో కార్యకలాపాలు పునరుద్ధరించాలని వివిధ వర్గాల వారు కోరుతున్నారు.