70 ఏళ్ల తర్వాత బయటపడిన గుప్తనిధి!
70 ఏళ్ల కిందటి ఓ పాత్ర (మగ్గు)లో దాచిన గుప్తనిధి ఇన్నాళ్లకు బయటపడింది. జర్మనీలో నాజీల దురాగతాల కాలంనాటి ఓ మగ్గులో అతి జాగ్రత్తగా, రహస్యంగా ఎవరికీ కనపడకుండా ఓ బంగారు ఉంగరాన్ని, నగ (నెక్లెస్)ను దాచారు. మగ్గు అడుగున బంగారాన్ని ఉంచి దానిపై ఓ పొర లాంటిది ఏర్పాటుచేసి.. అదే అడుగుభాగమన్న భ్రమను కల్పించారు. జర్మనీలోని ఆష్‌విట్జ్ మ్యూజియంలో ఉన్న ఈ మగ్గులో లోపల గుప్తబంగారం ఉన్న విషయాన్ని తాజాగా సిబ్బంది కనుగొన్నారు.
రెండోప్రపంచ యుద్ధకాలంలో జర్మనీలో నాజీలు కాన్‌సెంట్రేషన్ క్యాంపులు ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. ఈ కాన్‌సెంట్రేషన్ క్యాంపుల్లో ఐదో అతిపెద్దదైన ఆష్‌విట్జ్-బర్కెనౌలోని స్థావరంలో ఈ పాత్ర దొరికింది. ఈ క్యాంపునకు తరలించిబడిన ఓ వ్యక్తి ఈ మగ్గును తనవెంట తీసుకొచ్చాడని భావిస్తున్నారు. ఈ క్యాంపులో దొరికిన అలనాటి అవశేషాలను, వస్తువులను ప్రస్తుతం ఆష్‌విట్జ్ మ్యూజియంలో భద్రపరిచారు.
రెండో ప్రపంచయుద్ధ కాలంలో జర్మనీలోని యూదులను నాజీ సైనికులు కాన్‌సెంట్రేషన్ క్యాంపులకు తరలించిన సంగతి తెలిసిందే. యూదుల వద్ద ఉన్న సమస్త సంపదను కొల్లగొట్టి కట్టుబట్టలతో మాత్రమే వారిని క్యాంపులకు తరలించేవారు సైనికులు. ఈ నేపథ్యంలో సైనికుల కంటపడకుండా ఓ యూదు వ్యక్తి తన వద్ద ఉన్న బంగారాన్ని ఈ మగ్గులో దాచి.. తన వెంట తెచ్చుకొని ఉంటాడని, భవిష్యత్తులో కాన్‌సెంట్రేషన్ క్యాంపు నుంచి బయటపడితే.. అది తమ కుటుంబానికి ఉపయోగపడుతుందన్న ఆశతో ఇలా చేసి ఉంటాడని పరిశీలకులు భావిస్తున్నారు.