nazis
-
Russia-Ukraine war: రష్యా విక్టరీ డే: మే 9న ఏం జరగబోతోంది?
మే 9.. రష్యా చరిత్రలో ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనది. అది వారికి విజయోత్సవ దినోత్సవం. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీలో నాజీలపై సోవియెట్ యూనియన్ విజయం సాధించిన రోజు. సోవియెట్ యూనియన్ అధినేత జోసెఫ్ స్టాలిన్ ముందు 1945 సంవత్సరం, మే9న నాజీలు లొంగిపోయిన రోజు. ప్రతీ ఏడాది అదే రోజు విజయోత్సవ వేడుకలు అంబరాన్ని తాకుతాయి. రష్యా తన మిలటరీ సత్తా ప్రపంచానికి చాటి చెప్పేలా మాస్కోలోని రెడ్ స్క్వేర్ వద్ద సైనిక పెరేడ్ నిర్వహిస్తుంది. కానీ ఈ సారి ఉక్రెయిన్‌పై దండయాత్ర కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ తేదీకి మరింత ప్రాధాన్యం ఏర్పడింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ తేదీన ఉక్రెయిన్ యుద్ధాన్ని ఒక మలుపు తిప్పుతారని, అధికారంగా యుద్ధాన్ని ప్రకటించి ఆ దేశాన్ని దశల వారీగా స్వాధీనం చేసుకుంటారా అన్న చర్చ జరుగుతోంది. యుద్ధం కీలక మలుపు తిరుగుతుందా? రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విజయోత్సవ వేడుకల్ని గత కొద్ది ఏళ్లుగా కొత్త దేశాలపై యుద్ధ ప్రకటనలు చేయడానికే ఉపయోగిస్తున్నారు. గత ఏడాది మే 9న పుతిన్ చేసిన ప్రసంగంలో రష్యా శత్రువులందరూ తమ దేశాన్ని చుట్టుముట్టేస్తున్నారని, పశ్చిమ సిద్ధాంతాలను తమపై రుద్దే ప్రయత్నం జరుగుతోందని వాపోయారు. ఈ ఏడాది కూడా విక్టరీ డే నాడు పుతిన్ సంచలన ప్రకటన చేస్తారన్న అంచనాలున్నాయి. మారియుపోల్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్టుగా ప్రకటనతో పాటుగా పూర్తి స్థాయిలో యుద్ధాన్ని ప్రకటించి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి అణ్వాయుధాలను ప్రయోగిస్తారని మరి కొందరు ప్రచారం చేస్తున్నారు. విజయోత్సవ దిన వేడుకల్ని ఉక్రెయిన్ నగరాల్లో కూడా నిర్వహించడానికి రష్యా సన్నాహాలు చేస్తున్నట్టు ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. మారియుపోల్ సహా శిథిలావస్థకు చేరుకున్న పలు నగరాలను రష్యా సైన్యం పరిశుభ్రం చేస్తూ ఉండడమే దీనికి తార్కాణమని పేర్కొంటోంది. పశ్చిమ దేశాల ఆందోళనలు ఎందుకు ? ఈ ఏడాది విక్టరీ డే రోజు పుతిన్ ప్రజల్ని రెచ్చగొట్టేలా ప్రసంగించి వారందరితో ఆయుధాలు పట్టించే ప్రమాదం ఉందని పశ్చిమాది దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉక్రెయిన్ దండయాత్రపై రష్యన్లలో నెలకొన్న అసమ్మతిని చల్లార్చి వారిలో దేశభక్తి రేగేలా పుతిన్ ప్రసంగించడానికి సిద్ధమయ్యారని డ్యూక్ యూనివర్సిటీ ప్రొఫెసర్, రష్యా వ్యవహారాల్లో నిపుణుడు సైమన్ మిల్స్ అభిప్రాయపడ్డారు. ‘‘ఇన్నాళ్లూ ఉక్రెయిన్‌పై మిలటరీ ఆపరేషన్ అని చెబుతూ వస్తున్న పుతిన్ ఆ దేశంపై యుద్ధాన్ని ప్రకటించి సాధారణ రష్యన్లని కూడా యుద్ధోన్ముఖుల్ని చేయడమే ఆయన ముందున్న లక్ష్యం’’ అని మిల్స్ అంచనా వేస్తున్నారు. యూదుడైన జెలెన్స్కీని ఉక్రెయిన్ గద్దె దింపి ‘‘నాజీరహితం’’ చేయడమే రష్యా లక్ష్యమన్న సందేశాన్ని కూడా ఇచ్చే అవకాశాలున్నాయి. మార్షల్ లా అమలు చేస్తారా ? ఈ ఏడాది విక్టరీ డే ప్రసంగంలో పుతిన్ మార్షల్ చట్టాన్ని ప్రకటిస్తారన్న ఊహాగానాలున్నాయి. ఈ చట్టాన్ని అమలు చేస్తే ఎన్నికల నిర్వహణ రద్దవుతుంది. అధికారాలన్నీ పుతిన్ చేతిలోనే ఉంటాయి. 18 ఏళ్ల వయసు నిండిన యువకులందరూ అవసరమైతే కదనరంగానికి వెళ్లాల్సి వస్తుంది. వారు దేశం విడిచి పెట్టి వెళ్లడానికి వీల్లేదు. అయితే ఇలాంటి కఠినమైన చట్టాన్ని తీసుకువస్తే రాజకీయంగా పుతిన్‌కు వ్యతిరేకత ఎదురవుతుందన్న చర్చ కూడా జరుగుతోంది. శిథిల ఉక్రెయిన్ ► ఉక్రెయిన్‌పై రష్యా నిర్విరామంగా దాడులు చేస్తూ 75 రోజులు గడుస్తూ ఉన్న నేపథ్యంలో ఆ చిన్న దేశంలో జరిగే నష్టం అపారంగా ఉంది. కీవ్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్ చేసిన అధ్యయనం ప్రకారం ఇప్పటివరకు 60 వేల కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం జరిగింది. ► మౌలిక సదుపాయాలు ధ్వంసం కావడంతో జరిగిన ఆర్థిక నష్టం 9,200 కోట్ల డాలర్లకు పైగా ఉంటుందని ఒక అంచనా. ► వ్యాపారాలు దెబ్బ తినడంతో వెయ్యి కోట్ల డాలర్ల నష్టం సంభవించింది. ► 195 ఫ్యాక్టరీలు, 230 ఆరోగ్య కేంద్రాలు, 940 విద్యా సంస్థలు, అయిదు రైల్వేస్టేషన్లు, 95 ప్రార్థనాలయాలు, 140 వారసత్వ, సాంస్కృతిక భవంతులు రష్యన్ దాడుల్లో ధ్వంసమయ్యాయి ► 23,800 కిలోమీటర్ల రహదారులు నాశనమయ్యాయి. వీటి విలువే 6 వేల కోట్ల డాలర్లు ఉంటుందని అంచనా ► నెలకి 700 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం లభిస్తే తప్ప ఉక్రెయిన్ కోలుకునే పరిస్థితి లేదు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
3,518 మంది హత్యలకు సహకారం.. 75 ఏళ్ల తర్వాత విచారణ
బెర్లిన్: అడాల్ఫ్ హిట్లర్ పేరు చేబితే ఇప్పటికి జర్మనీలో కొందరు వణికిపోతారు. అవును మరి అతడు చేసిన దురాగతాలకు లెక్కే లేదు. జర్మనీ నియంతగా మారిన తర్వాత హిట్లర్ యూదులను తీవ్రంగా ద్వేషించాడు. దేశం మొత్తం జల్లెడ పట్టి.. యూదులను ఊచకోత కోశాడు. ఏకంగా కాన్సెంట్రేషన్ క్యాంపులు ఏర్పాటు చేసి.. యూదులను అత్యంత దారుణంగా హత్య చేశాడు. దాదాపు ఏడున్నర లక్షల మంది యూదులు నాజీ శిబిరాలలో రాక్షసంగా మరణించారు అంటే ఎంత దారుణంగా ప్రవర్తించాడో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నియంత పేరు ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే.. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన డెబ్భైఐదు సంవత్సరాల తర్వాత జర్మనీ కోర్టు.. మాజీ నాజీ కాన్సంట్రేషన్ గార్డు ఒకరిని విచారిస్తుంది. జర్మనీ చట్టాల ప్రకారం నిందితుడి పేరు వెల్లడించలేదు. సదరు గార్డు 1942 నుంచి 1945 వరకు సచ్సెన్హాసన్ కాన్సంట్రేషన్ క్యాంప్‌లో క్యాంప్ గార్డ్‌గా పనిచేశాడు. సదరు గార్డు 3,518 మంది హత్యలకు సహకరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు విచారణ అక్టోబర్‌లో ప్రారంభమవుతుందని, సెషన్ రోజుకు రెండున్నర గంటలకు పరిమితం చేస్తామని అధికారులు తెలిపారు. ప్రాసిక్యూటర్ల ప్రకారం, ప్రస్తుతం 100 ఏళ్ల వయసు ఉన్న ఆ వ్యక్తి 75 ఏళ్ల క్రితం నిర్బంధ శిబిరం వద్ద గార్డుగా పని చేశాడు. ఆ సమయంలో అతడు 3,518 హత్యలకు సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితుడైన క్యాంప్ గార్డుపై 1942 లో మాజీ సోవియట్ యుద్ధ ఖైదీలను కాల్చడం, విషపూరిత వాయువు జైక్లాన్ బీని ఉపయోగించడంతో సహా ఉరితీయడానికి సహకరించినట్లు అభియోగాలు ఉన్నాయి. సచ్సెన్హాసన్ కాన్సంట్రేషన్ క్యాంప్‌లో కనీసం 2,00,000 మందిని ఖైదు చేయగా.. 20,000 మందిని హత్య చేశారు. ఈ ఆరోపణల విచారణల నేపథ్యంలో ప్రాసిక్యూటర్ నిందితుడికి వైద్య పరీక్షలు నిర్వహించాడు, ఆ తర్వాత అతను విచారణకు ఫిట్‌గా ఉన్నాడని ప్రకటించారు. గత నెలలో జర్మనీ కోర్టు 95 ఏళ్ల నాజీ గార్డుని విచారించినట్లు తెలియజేసింది. అక్టోబర్ 1943 నుంచి ఏప్రిల్ 1945 వరకు స్టాలగ్ 6సీ బాథోర్న్ కాన్సంట్రేషన్ క్యాంప్‌లో సదరు వ్యక్తి గార్డుగా పని చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. అనేక మంది మాజీ సోవియట్ సైనికులు స్టాలగ్ 6సీ బాథోర్న్ శిబిరంలో పెద్ద సంఖ్యలో మరణించినట్లు నివేదిక తెలిపింది. తరువాత దీనిని పోలిష్ దళాలు విముక్తి చేశాయి. ఇక ఈ ఏడాది మార్చిలో, ప్రాసిక్యూటర్లు అమెరికా నుంచి బహిష్కరించబడిన 95 ఏళ్ల మాజీ నాజీ డెత్ క్యాంప్ గార్డ్ ఫ్రెడరిక్ కార్ల్ బెర్గర్‌పై కేసును కొట్టేశారు. బెర్గర్‌ను విచారించడానికి తగిన సాక్ష్యాలు లేనందున ఈ కేసును కొట్టేస్తేన్నట్లు కోర్టు తెలిపింది. -
‘ఆ కోట కింద రూ. 11,617 కోట్ల సంపద’
సాక్షి, న్యూఢిల్లీ : రెండవ ప్రపంచ యుద్ధం సందర్భంగా యూరప్ వ్యాప్తంగా నాజీలు దోచుకున్న 28 టన్నుల బంగారం, ఇతర సంపదను 16వ శతాబ్ధానికి చెందిన జర్మన్ కోటలో పాతిపెట్టినట్టు పరిశోధకులు గుర్తించారు. ఈ నిధి విలువ 1.25 బిలియన్ యుకె పౌండ్ల(రూ.11,617 కోట్లకు పైగా)ని అంచనా వేశారు. నాజీ ఆర్మీ అధికారి ఎస్ఎస్ స్టాండార్టెన్‌ఫ్యూరర్ ఎగాన్ ఒల్లెన్‌హౌర్ డైరీలో పేర్కొన్న 11 ప్రదేశాలలో ఆధునిక పోలాండ్‌లో ఉన్న హోచ్బర్గ్ ప్యాలెస్ ఈ నిక్షేపాలను దాచిన వాటిలో కీలకమని వెల్లడైంది. ఈ డైరీని గత ఏడాదే పరిశోధకులు గుర్తించినట్టు స్పుత్నిక్ న్యూస్ వెల్లడించింది. జర్మన్ నగరం బ్రెలూ నుంచి కొల్లగొట్టిన రూ. 7,000 కోట్లకు పైగా విలువైన రిచెస్‌బ్యాంక్ గోల్డ్ బార్లు, ఇతర సంపదను ఈ కోట కింద దాచిఉంచవచ్చని ఈ డైరీని స్వాధీనం చేసుకున్న సిలెసియన్ బ్రిడ్జి ఫౌండేషన్ పేర్కొంది. కాగా ఈ డైరీని గత ఏడాది పోలాండ్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు అందచేశామని, ప్రభుత్వం ఇంకా దాన్ని పరిశీలించలేదని ఫౌండేషన్ చీఫ్ రోమన్ ఫర్మనియక్ వెల్లడించారు. నిధుల వ్యవహారాన్ని నిగ్గుతేల్చేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే క్రమంలో ఈ అంశాలను ఫౌండేషన్ ప్రజల ముందుంచుతోంది. ప్రభుత్వ అనుమతి లేకుండా నిధి కోసం తవ్వకాలు చేపట్టడం, వెలికితీత సాధ్యమయ్యే పనికాదు. ఈ కోట ప్రస్తుత యజమాని నిధుల వెలికితీతకు అనుమతించారని, దోపిడీ దొంగల కన్నుపడకుండా కోట చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి సీసీటీవీ కెమెరాలను అమర్చారని ఫౌండేషన్ వెల్లడించింది. నిధుల్లో బంగారమే కాకుండా మత చిహ్నాలు, పోలండ్, సోవియట్ యూనియన్, ఫ్రాన్స్, బెల్జియం దేశాల నుంచి నాజీలు లూటీ చేసిన విలువైన వస్తువులను దాదాపు 11 ప్రాంతాల్లో దాచినట్టు ఈ డైరీలో వెల్లడైంది. చదవండి : సంక్షోభంలోనూ పెట్టుబడులకు చాన్స్ -
అచ్చం హిట్లర్‌లాగే ఉన్నాడు.. అరెస్టు చేశారు
ఆస్ట్రియా: అచ్చం హిట్లర్‌లాగే ఉండటమే కాకుండా అలాంటి ప్రవర్తనే చూపిస్తున్న ఓ వ్యక్తిని ఆస్ట్రియా పోలీసులు అరెస్టు చేశారు. హిట్లర్ జన్మించిన బ్రౌనౌ నివాసం ముందు ఫొటోకు పోజివ్వడమే కాకుండా నాటి నాజీ పోకడలు గొప్పవని పొగిడినట్లుగా తన ప్రవర్తనను చూపించడంతో అతడిని అదుపులోకి తీసుకొని జైలులో వేశారు. మరో విశేషమేమిటంటే అతడి పేరు కూడా హిట్లరే కావడం. అవును అతడి పేరు హరాల్డ్ హిట్లర్. అంతేకాదు.. అతడు ఇటీవలె జర్మనీ సరిహద్దు వరకు వెళ్లి తిరిగొచ్చాడట. అప్పట్లో అడాల్ఫ్ హిట్లర్ కూడా ఆస్ట్రియా నుంచి జర్మనీలోకి 1913లో అడుగుపెట్టారు. హరాల్డ్ హిట్లర్ అరెస్టుపై ఫర్ట్నర్ అనే పోలీసు అధికారి దీనిపై వివరణ ఇస్తూ అతడు ఉద్దేశపూర్వకంగా హిట్లర్‌లాగా ప్రవర్తించడం వల్లే తాము అరెస్టు చేశామని చెప్పారు. అతడు ఏం చేస్తున్నాడనే విషయంపై పట్ల పూర్తి అవగాహనతో ఉన్నాడని, కావాలని నాజీతత్వంతో తన్మయత్వం పొందినట్లు ప్రవర్తిస్తున్నాడని, ఇది జనాల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆస్ట్రియాలో నాజీల కాలంలో ఊచకోతలు జరిగాయి. వారు చేయని దారుణమంటూ లేదు. దీంతో నాజీ లక్షణాలు కనిపించేవారిని ఆస్ట్రియా పోలీసులు అస్సలు వదిలిపెట్టరు. బ్రౌనౌ నివాసంలో 1889లో హిట్లర్ జన్మించారు. ఈ నివాసాన్ని నియో నాజీలు గొప్పగా భావిస్తున్న నేపథ్యంలో గత ఏడాది ధ్వంసం చేయాలని ఆస్ట్రియా అధికారులు భావించారు. -
70 ఏళ్ల తర్వాత బయటపడిన గుప్తనిధి!
70 ఏళ్ల కిందటి ఓ పాత్ర (మగ్గు)లో దాచిన గుప్తనిధి ఇన్నాళ్లకు బయటపడింది. జర్మనీలో నాజీల దురాగతాల కాలంనాటి ఓ మగ్గులో అతి జాగ్రత్తగా, రహస్యంగా ఎవరికీ కనపడకుండా ఓ బంగారు ఉంగరాన్ని, నగ (నెక్లెస్)ను దాచారు. మగ్గు అడుగున బంగారాన్ని ఉంచి దానిపై ఓ పొర లాంటిది ఏర్పాటుచేసి.. అదే అడుగుభాగమన్న భ్రమను కల్పించారు. జర్మనీలోని ఆష్విట్జ్ మ్యూజియంలో ఉన్న ఈ మగ్గులో లోపల గుప్తబంగారం ఉన్న విషయాన్ని తాజాగా సిబ్బంది కనుగొన్నారు. రెండోప్రపంచ యుద్ధకాలంలో జర్మనీలో నాజీలు కాన్సెంట్రేషన్ క్యాంపులు ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. ఈ కాన్సెంట్రేషన్ క్యాంపుల్లో ఐదో అతిపెద్దదైన ఆష్విట్జ్-బర్కెనౌలోని స్థావరంలో ఈ పాత్ర దొరికింది. ఈ క్యాంపునకు తరలించిబడిన ఓ వ్యక్తి ఈ మగ్గును తనవెంట తీసుకొచ్చాడని భావిస్తున్నారు. ఈ క్యాంపులో దొరికిన అలనాటి అవశేషాలను, వస్తువులను ప్రస్తుతం ఆష్విట్జ్ మ్యూజియంలో భద్రపరిచారు. రెండో ప్రపంచయుద్ధ కాలంలో జర్మనీలోని యూదులను నాజీ సైనికులు కాన్సెంట్రేషన్ క్యాంపులకు తరలించిన సంగతి తెలిసిందే. యూదుల వద్ద ఉన్న సమస్త సంపదను కొల్లగొట్టి కట్టుబట్టలతో మాత్రమే వారిని క్యాంపులకు తరలించేవారు సైనికులు. ఈ నేపథ్యంలో సైనికుల కంటపడకుండా ఓ యూదు వ్యక్తి తన వద్ద ఉన్న బంగారాన్ని ఈ మగ్గులో దాచి.. తన వెంట తెచ్చుకొని ఉంటాడని, భవిష్యత్తులో కాన్సెంట్రేషన్ క్యాంపు నుంచి బయటపడితే.. అది తమ కుటుంబానికి ఉపయోగపడుతుందన్న ఆశతో ఇలా చేసి ఉంటాడని పరిశీలకులు భావిస్తున్నారు.