ఏపీకి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ | AP special development package | Sakshi
Sakshi News home page

ఏపీకి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ

Published Thu, Feb 5 2015 1:47 AM | Last Updated on Sat, Sep 2 2017 8:47 PM

ఏపీకి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ

ఏపీకి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ

  • కేంద్ర ప్రభుత్వ ప్రకటన
  • సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 46 (2), సెక్షన్ 46 (3) ప్రకారం  ఏపీకి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని.. దానిలో భాగంగా ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ప్రకటించామని కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం వెల్లడించింది. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ఈ ప్యాకేజీని ప్రకటించింది.

    2014-15వ ఆర్థిక సంవత్సరానికి మొత్తం 7 జిల్లాలకు గాను ఒక్కో జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున మొత్తం రూ.350 కోట్ల మేర ప్యాకేజీ ప్రకటించింది. ఇది కాకుండా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ లోటును పూడ్చడంలో భాగంగా మరో రూ.500 కోట్ల సహాయాన్ని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ లోటుపై అధ్యయనం చేసేందుకు హోం శాఖ ఏర్పాటు చేసిన సంయుక్త కమిటీ సిఫారసుల మేరకు రూ.500 కోట్లను ఈ ఆర్థిక సంవత్సరంలోనే తాత్కాలిక సాయం కింద అందజేస్తున్నట్టు కేంద్రం పేర్కొంది.

    అయితే 2014-15 బడ్జెట్‌లోనే రాజధాని అవసరాలకు, రెవెన్యూ లోటు భర్తీకి కేంద్రం రూ.1,180 కోట్లు కేటాయించింది. రాష్ట్ర విభజన దరిమిలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.15,594 కోట్ల రెవెన్యూ లోటు ఉందని తేలగా, ఆ లోటును భరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి రెండు నెలల కాలాన్ని వదిలేసి మిగిలిన 10 నెలలకు సంబంధించిన ప్రతిపాదనలు మాత్రమే పంపాలని కేంద్రం కోరింది.

    దాంతో రూ.12 వేల కోట్ల రెవెన్యూ లోటుతో పాటు సీఎస్టీ కారణంగా నష్టపోతున్న మరో రూ.1,500 కోట్లు కలిపి మొత్తంగా రూ.13,500 కోట్లు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో రెండు నెలల్లో ముగుస్తుందనగా.. కేంద్రం రూ.500 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. ఒడిశాలోని వెనుకబడిన జిల్లాలైన కలహండి-బొలంగీర్-కోరాపుట్ (కేబీకే) ప్రాంతాలకు అమలుచేసిన ప్యాకేజీని, బుందేల్‌ఖండ్‌లో అమలుచేసిన ప్యాకేజీని ఆధారంగా చేసుకుని అవే మార్గదర్శకాలకు అనుకూలంగా రాష్ట్రానికి కూడా కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాల్సి ఉంది.

    రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఈ అంశం స్పష్టంగా లేకపోగా, దానికి అనుగుణంగా ఆరోజు ప్రధానమంత్రి రాజ్యసభలో ఆర్థిక లోటు భర్తీపై ప్రకటన చేశారు. అయితే ఆర్థిక లోటును భర్తీ చేయడంతో పాటు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడానికి మిగతా రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి అనుసరిస్తున్న విధానంలో కేంద్రం ప్రస్తుత ప్యాకేజీ ప్రకటించిందని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. రానున్న ఐదేళ్లలో ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.24,350 కోట్లు ఇవ్వాలని ఏపీ ప్రతిపాదించగా.. కేంద్రం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ప్యాకేజీలో భాగంగా 7 జిల్లాలకు రూ. 350 కోట్లు మాత్రమే విదిల్చింది.

    అదీ రాష్ట్ర విభజన జరిగిన ఇంతకాలం తర్వాత ప్రకటించడం గమనార్హం. కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును వెంటబెట్టుకుని వెళ్లి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వద్ద ఈ అంశాలన్నింటిపై కూలంకషంగా చర్చించారు. తక్షణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని విడతల వారీగా నిధులు మంజూరు చేయాలని, ఇందుకు ఒక కార్యాచరణ రూపొందించాలని కోరారు. మరో మూడురోజుల్లో నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీకి వస్తున్న సమయంలో ఎట్టకేలకు ఈ ప్యాకేజీ ప్రకటించారు.
     
    రెండు రాష్ట్రాలకు పన్ను ప్రోత్సాహకాలు..


    ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 94 (1) ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలల్లో పారిశ్రామికీకరణను ప్రోత్సహించేందుకు, అవి ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ఇవ్వాల్సిన పన్ను ప్రోత్సాహకాలను ఆర్థిక శాఖ ప్రకటించింది.
     
    కేంద్రం నోటిఫై చేసిన వెనుకబడిన ప్రాంతాల్లో తయారీ రంగ పరిశ్రమలు నెలకొల్పితే కొత్త ప్లాంటు, యంత్రాలపై 15 శాతం ఆదనపు డిప్రిసియేషన్‌ను అమలు చేస్తారు.
     
    అలాగే నోటిఫై చేసిన వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు నెలకొల్పితే అదనపు పెట్టుబడి భత్యం 15 శాతం ఇస్తారు. ఐదేళ్ల వరకు ఎప్పుడు కొత్త ప్లాంటు, యంత్రాలు నెలకొల్పినా ఈ భత్యం వర్తిస్తుంది. ఐదో సంవత్సరంలో పెట్టుబడి పెట్టినప్పటికీ ఇది అందుబాటులో ఉంటుంది.
     
    అదనపు డిప్రిసియేషన్ భత్యం, పెట్టుబడి భత్యం అందాలంటే పెట్టుబడులు రూ.25 కోట్లపైన ఉండాలన్న నిబంధన ఏమీ వర్తించదని ఆర్థిక శాఖ వెల్లడించింది. అలాగే డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ, ప్రమోషన్(డీఐపీపీ) తదితర ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నట్టు పేర్కొంది. కానీ ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement