Development package
-
ప్రాథమిక రంగ అభివృద్ధికి రూ.50 కోట్లు
కలెక్టర్ కేవీ రమణ కడప రూరల్: జిల్లాకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కింద ప్రభుత్వం విడుదల చేసిన రూ. 50 కోట్లను ప్రాథమిక రంగ అభివృద్ధికి ఖర్చు చేయాల్సి ఉందని జిల్లా కలెక్టర్ కేవీ రమణ తెలిపారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద విడుదలైన నిధులతో ప్రాథమిక రంగంలో నిర్మాణాత్మక పనులు చేపట్టేందుకు సంబంధిత శాఖల అధికారులు ప్రణాళికలు రూపొందించి సమర్పించాలన్నారు. ప్రాథమిక రంగంలోని వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రణాళికలు రూపొందించి సమర్పించాల్సి ఉందన్నారు. వివిధ శాఖల నుంచి అందిన ప్రణాళికలను క్రోడీకరించి ప్రభుత్వ ప్రత్యేక చీఫ్ సెక్రటరీ వారికి సమర్పించి ఆమోదం పొందాల్సి ఉందన్నారు. అధికారులు తమతమ శాఖలకు సంబంధించి హేతుబద్ధమైన ప్రణాళికలు రూపొందించి వెంటనే సమర్పించాలని కోరారు. కార్యక్రమంలో జేసీ-2 చంద్రశేఖర్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ రజియాబేగం, సీపీఓ తిప్పేస్వామి, డీఆర్డీఏ, డ్వామా పీడీలు అనిల్‌కుమార్‌రెడ్డి, బాలసుబ్రమణ్యం, వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు టాగూర్ నాయక్, జిల్లా పరిశ్రమలశాఖ జీఎం గోపాల్, డీపీఓ అపూర్వసుందరి, ఆర్‌డబ్ల్యుఎస్, పంచాయతీరాజ్ పర్యవేక్షక ఇంజనీరు శ్రీనివాసులు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజా వినతులకు సత్వర పరిష్కారం కలెక్టర్ కేవీ రమణ కడప సెవెన్‌రోడ్స్: ప్రజా వినతులను సత్వరమే ప రిష్కరించాలని కలెక్టర్ కేవీ రమణ జిల్లా అధికారుల ను ఆదేశించారు. సోమవారం సభా భవనంలో నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో ఆయన వినతులు స్వీకరించి పరిశీలించారు. వినతులు పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జేసీ రామారావు, జేసీ-2 చంద్రశేఖర్‌రెడ్డి, డీఆర్వో సులోచన, డీఆర్డీఏ, డ్వామా పీడీలు అనిల్‌కుమార్‌రెడ్డి, బాలసుబ్రమణ్యం, జిల్లా పరి శ్రమలశాఖ జీఎం గోపాల్, సెప్ట్ సీఈఓ మమత తదితరులు పాల్గొన్నారు. -
ఏపీకి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ
-
నిరాశే!
సాక్షి ప్రతినిధి, కర్నూలు : విభజన హామీ మేరకు జిల్లాకు భారీ ప్యాకేజీ వస్తుందని ఆశించిన ప్రజలకు నిరాశే ఎదురైంది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ప్యాకేజీ కింద జిల్లాకు కేవలం రూ.50 కోట్లు మాత్రమే కేంద్రం ప్రకటించింది. బుందేల్‌ఖండ్ ప్యాకేజీ తరహా ప్యాకేజీ వస్తుందని ఆశించిన ప్రజలను నిరాశపరిచింది. బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ వస్తే మూడేళ్ల పాటు ప్రతి ఏటా వెయ్యి కోట్లకు పైగా నిధులు వస్తాయని జిల్లా ప్రజలు ఆశించారు. అయితే కేంద్రం కేవలం రూ.50 కోట్లను మాత్రమే విదిల్చి చేతులు దులుపుకుంది. అది కూడా 2014-15 ఆర్థిక సంవత్సరంలోనే ఖర్చు చేయాలని పేర్కొనడం గమనార్హం. వెనుకబడిన కర్నూలు జిల్లాకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ తేవడంలో అధికార పార్టీ విఫలమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్యాకేజీని సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని రాజకీయ పార్టీలు విమర్శిస్తున్నాయి. అయితే కేంద్రం సానుకూలంగా స్పందించి మరిన్ని నిధులను విడుదల చేస్తుందని అధికార పార్టీ నేతలు అంటున్నారు. 55 రోజులు... రూ.50 కోట్లు.. రాష్ట్రంలోని వెనుకబడిన నాలుగు రాయలసీమ జిల్లాలతో పాటు మూడు ఉత్తరాంధ్ర జిల్లాలకు కలిపి మొత్తం ఏడు జిల్లాలకు రూ.350 కోట్లను కేటాయిస్తున్నట్లు కేంద్రం బుధవారం ప్రకటించింది. ఈ లెక్కన కర్నూలు జిల్లాకు రూ.50 కోట్లు వస్తాయి. అయితే ఈ నిధులను 2014-15 ఆర్థిక సంవత్సరంలోనే వినియోగించాలని కేంద్రం పేర్కొంది. వాస్తవానికి 2014-15 ఆర్థిక సంవత్సరం మరో 55 రోజుల్లో ముగియనుంది. అంటే 55 రోజుల్లోనే రూ.50 కోట్లను ఖర్చు చేయాలన్నమాట! ఒకవేళ ఖర్చు చేయకపోతే ఈ నిధులు తిరిగి కేంద్రానికే వెనక్కు వెళ్తాయి. వాస్తవానికి విభజన చట్టం హామీ మేరకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటినుంచి డిమాండ్ చేస్తోంది. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి పలుసార్లు ప్రధానితో పాటు కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేశారు. అయితే అధికార తెలుగుదేశం పార్టీ కేంద్రం మీద ఒత్తిడి తేవడంలో విఫలమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీని తేలేకపోయామని విమర్శలు ఉన్నాయి. చివరకు రూ.50 కోట్లను ఆర్థిక సంవత్సరం చివరలో విడుదల చేయడం ద్వారా అవి ఖర్చు చేయలేక తిరిగి కేంద్రానికి వెళ్తాయన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ అంటే... ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లోని ఏడు వెనుకబడిన జిల్లాలను కలిపి 2009-10లో అప్పటి ప్రభుత్వం బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ కింద ప్రతి ఏటా వరుసగా మూడేళ్ల పాటు రూ.7,260 కోట్లను కేంద్ర ప్రభుత్వం వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేసింది. అంటే జిల్లాకు ప్రతి ఏటా వెయ్యి కోట్లకు పైగానే కేంద్ర నిధులు వస్తాయన్నమాట! ఈ నిధులతో.. ప్రాజెక్టులు, చెరువులను నిర్మించడం ద్వారా తాగునీటి సౌకర్యాలను అభివృద్ధి చేస్తారు. భారీ స్థాయిలో అటవీ సంపదను పెంచడం ద్వారా ఈ ప్రాంతాల్లో సకాలంలో వర్షాలు కురిసే విధంగా ప్రణాళిక తయారు చేస్తారు. తాగునీటి ఎద్దడిని తీర్చేందుకు బోర్లను తవ్విస్తారు. వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచడం ద్వారా దిగుబడిని పెంచేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తారు. తద్వారా రైతుల ఆదాయాన్ని అభివృద్ధి చేస్తారు. వివిధ ఉపాధి పనులను చేపట్టడం ద్వారా వలసలను నిరోధిస్తారు. -
ఏపీకి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ
కేంద్ర ప్రభుత్వ ప్రకటన సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 46 (2), సెక్షన్ 46 (3) ప్రకారం ఏపీకి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని.. దానిలో భాగంగా ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ప్రకటించామని కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం వెల్లడించింది. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ఈ ప్యాకేజీని ప్రకటించింది. 2014-15వ ఆర్థిక సంవత్సరానికి మొత్తం 7 జిల్లాలకు గాను ఒక్కో జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున మొత్తం రూ.350 కోట్ల మేర ప్యాకేజీ ప్రకటించింది. ఇది కాకుండా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ లోటును పూడ్చడంలో భాగంగా మరో రూ.500 కోట్ల సహాయాన్ని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ లోటుపై అధ్యయనం చేసేందుకు హోం శాఖ ఏర్పాటు చేసిన సంయుక్త కమిటీ సిఫారసుల మేరకు రూ.500 కోట్లను ఈ ఆర్థిక సంవత్సరంలోనే తాత్కాలిక సాయం కింద అందజేస్తున్నట్టు కేంద్రం పేర్కొంది. అయితే 2014-15 బడ్జెట్లోనే రాజధాని అవసరాలకు, రెవెన్యూ లోటు భర్తీకి కేంద్రం రూ.1,180 కోట్లు కేటాయించింది. రాష్ట్ర విభజన దరిమిలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.15,594 కోట్ల రెవెన్యూ లోటు ఉందని తేలగా, ఆ లోటును భరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి రెండు నెలల కాలాన్ని వదిలేసి మిగిలిన 10 నెలలకు సంబంధించిన ప్రతిపాదనలు మాత్రమే పంపాలని కేంద్రం కోరింది. దాంతో రూ.12 వేల కోట్ల రెవెన్యూ లోటుతో పాటు సీఎస్టీ కారణంగా నష్టపోతున్న మరో రూ.1,500 కోట్లు కలిపి మొత్తంగా రూ.13,500 కోట్లు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో రెండు నెలల్లో ముగుస్తుందనగా.. కేంద్రం రూ.500 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. ఒడిశాలోని వెనుకబడిన జిల్లాలైన కలహండి-బొలంగీర్-కోరాపుట్ (కేబీకే) ప్రాంతాలకు అమలుచేసిన ప్యాకేజీని, బుందేల్‌ఖండ్‌లో అమలుచేసిన ప్యాకేజీని ఆధారంగా చేసుకుని అవే మార్గదర్శకాలకు అనుకూలంగా రాష్ట్రానికి కూడా కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాల్సి ఉంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఈ అంశం స్పష్టంగా లేకపోగా, దానికి అనుగుణంగా ఆరోజు ప్రధానమంత్రి రాజ్యసభలో ఆర్థిక లోటు భర్తీపై ప్రకటన చేశారు. అయితే ఆర్థిక లోటును భర్తీ చేయడంతో పాటు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడానికి మిగతా రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి అనుసరిస్తున్న విధానంలో కేంద్రం ప్రస్తుత ప్యాకేజీ ప్రకటించిందని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. రానున్న ఐదేళ్లలో ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.24,350 కోట్లు ఇవ్వాలని ఏపీ ప్రతిపాదించగా.. కేంద్రం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ప్యాకేజీలో భాగంగా 7 జిల్లాలకు రూ. 350 కోట్లు మాత్రమే విదిల్చింది. అదీ రాష్ట్ర విభజన జరిగిన ఇంతకాలం తర్వాత ప్రకటించడం గమనార్హం. కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును వెంటబెట్టుకుని వెళ్లి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వద్ద ఈ అంశాలన్నింటిపై కూలంకషంగా చర్చించారు. తక్షణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని విడతల వారీగా నిధులు మంజూరు చేయాలని, ఇందుకు ఒక కార్యాచరణ రూపొందించాలని కోరారు. మరో మూడురోజుల్లో నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీకి వస్తున్న సమయంలో ఎట్టకేలకు ఈ ప్యాకేజీ ప్రకటించారు. రెండు రాష్ట్రాలకు పన్ను ప్రోత్సాహకాలు.. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 94 (1) ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలల్లో పారిశ్రామికీకరణను ప్రోత్సహించేందుకు, అవి ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ఇవ్వాల్సిన పన్ను ప్రోత్సాహకాలను ఆర్థిక శాఖ ప్రకటించింది. కేంద్రం నోటిఫై చేసిన వెనుకబడిన ప్రాంతాల్లో తయారీ రంగ పరిశ్రమలు నెలకొల్పితే కొత్త ప్లాంటు, యంత్రాలపై 15 శాతం ఆదనపు డిప్రిసియేషన్‌ను అమలు చేస్తారు. అలాగే నోటిఫై చేసిన వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు నెలకొల్పితే అదనపు పెట్టుబడి భత్యం 15 శాతం ఇస్తారు. ఐదేళ్ల వరకు ఎప్పుడు కొత్త ప్లాంటు, యంత్రాలు నెలకొల్పినా ఈ భత్యం వర్తిస్తుంది. ఐదో సంవత్సరంలో పెట్టుబడి పెట్టినప్పటికీ ఇది అందుబాటులో ఉంటుంది. అదనపు డిప్రిసియేషన్ భత్యం, పెట్టుబడి భత్యం అందాలంటే పెట్టుబడులు రూ.25 కోట్లపైన ఉండాలన్న నిబంధన ఏమీ వర్తించదని ఆర్థిక శాఖ వెల్లడించింది. అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ, ప్రమోషన్(డీఐపీపీ) తదితర ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నట్టు పేర్కొంది. కానీ ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు.