నిరాశే! | Disappointed! | Sakshi
Sakshi News home page

నిరాశే!

Published Thu, Feb 5 2015 2:30 AM | Last Updated on Sat, Sep 2 2017 8:47 PM

Disappointed!

సాక్షి ప్రతినిధి, కర్నూలు : విభజన హామీ మేరకు జిల్లాకు భారీ ప్యాకేజీ వస్తుందని ఆశించిన ప్రజలకు నిరాశే ఎదురైంది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ప్యాకేజీ కింద జిల్లాకు కేవలం రూ.50 కోట్లు మాత్రమే కేంద్రం ప్రకటించింది. బుందేల్‌ఖండ్ ప్యాకేజీ తరహా ప్యాకేజీ వస్తుందని ఆశించిన ప్రజలను నిరాశపరిచింది. బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ వస్తే మూడేళ్ల పాటు ప్రతి ఏటా వెయ్యి కోట్లకు పైగా నిధులు వస్తాయని జిల్లా ప్రజలు ఆశించారు. అయితే కేంద్రం కేవలం రూ.50 కోట్లను మాత్రమే విదిల్చి చేతులు దులుపుకుంది.
 
 అది కూడా 2014-15 ఆర్థిక సంవత్సరంలోనే ఖర్చు చేయాలని పేర్కొనడం గమనార్హం. వెనుకబడిన కర్నూలు జిల్లాకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ తేవడంలో అధికార పార్టీ విఫలమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్యాకేజీని సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని రాజకీయ పార్టీలు విమర్శిస్తున్నాయి. అయితే కేంద్రం సానుకూలంగా స్పందించి మరిన్ని నిధులను విడుదల చేస్తుందని అధికార పార్టీ నేతలు అంటున్నారు.
 
 55 రోజులు... రూ.50 కోట్లు..
 రాష్ట్రంలోని వెనుకబడిన నాలుగు రాయలసీమ జిల్లాలతో పాటు మూడు ఉత్తరాంధ్ర జిల్లాలకు కలిపి మొత్తం ఏడు జిల్లాలకు రూ.350 కోట్లను కేటాయిస్తున్నట్లు కేంద్రం బుధవారం ప్రకటించింది. ఈ లెక్కన కర్నూలు జిల్లాకు రూ.50 కోట్లు వస్తాయి. అయితే ఈ నిధులను 2014-15 ఆర్థిక సంవత్సరంలోనే వినియోగించాలని కేంద్రం పేర్కొంది. వాస్తవానికి 2014-15 ఆర్థిక సంవత్సరం మరో 55 రోజుల్లో ముగియనుంది. అంటే 55 రోజుల్లోనే రూ.50 కోట్లను ఖర్చు చేయాలన్నమాట! ఒకవేళ ఖర్చు చేయకపోతే ఈ నిధులు తిరిగి కేంద్రానికే వెనక్కు వెళ్తాయి. వాస్తవానికి విభజన చట్టం హామీ మేరకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటినుంచి డిమాండ్ చేస్తోంది. పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పలుసార్లు ప్రధానితో పాటు కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేశారు. అయితే అధికార తెలుగుదేశం పార్టీ కేంద్రం మీద ఒత్తిడి తేవడంలో విఫలమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీని తేలేకపోయామని విమర్శలు ఉన్నాయి. చివరకు రూ.50 కోట్లను ఆర్థిక సంవత్సరం చివరలో విడుదల చేయడం ద్వారా అవి ఖర్చు చేయలేక తిరిగి కేంద్రానికి వెళ్తాయన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.
 
 బుందేల్‌ఖండ్  తరహా ప్యాకేజీ అంటే...
 ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లోని ఏడు వెనుకబడిన జిల్లాలను కలిపి 2009-10లో అప్పటి ప్రభుత్వం బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ కింద ప్రతి ఏటా వరుసగా మూడేళ్ల పాటు రూ.7,260 కోట్లను కేంద్ర ప్రభుత్వం వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేసింది. అంటే జిల్లాకు ప్రతి ఏటా వెయ్యి కోట్లకు పైగానే కేంద్ర నిధులు వస్తాయన్నమాట! ఈ నిధులతో..
 
  ప్రాజెక్టులు, చెరువులను నిర్మించడం ద్వారా తాగునీటి సౌకర్యాలను అభివృద్ధి చేస్తారు.
  భారీ స్థాయిలో అటవీ సంపదను పెంచడం ద్వారా ఈ ప్రాంతాల్లో సకాలంలో వర్షాలు కురిసే విధంగా ప్రణాళిక తయారు చేస్తారు. తాగునీటి ఎద్దడిని తీర్చేందుకు బోర్లను తవ్విస్తారు.
 వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచడం ద్వారా దిగుబడిని పెంచేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తారు. తద్వారా రైతుల ఆదాయాన్ని అభివృద్ధి చేస్తారు. వివిధ ఉపాధి పనులను చేపట్టడం ద్వారా వలసలను నిరోధిస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement