ఉడాకు సిబ్బంది కావలెను! | Uda staff wanted! | Sakshi
Sakshi News home page

ఉడాకు సిబ్బంది కావలెను!

Published Fri, May 23 2014 1:41 AM | Last Updated on Sat, Sep 2 2017 7:42 AM

ఉడాకు సిబ్బంది కావలెను!

ఉడాకు సిబ్బంది కావలెను!

  • 120 మందికిగాను 58 మందే విధుల్లో
  •  పదిహేనేళ్లుగా పోస్టులు ఖాళీ
  •  రెండున్నర రెట్లు పెరిగిన ఉడా పరిధి
  •  కేటాయించిన పోస్టుల భర్తీతోపాటు అదనంగా 300 మంది అవసరం
  •  ప్రభుత్వానికి నివేదించిన ఉడా చైర్మన్ వణుకూరి
  • సాక్షి, విజయవాడ : విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీజీటీఎం ఉడా)లో సిబ్బంది లేక ఇబ్బంది పడుతున్నారు. పదుల సంఖ్యలో పోస్టులు ఖాళీ ఉండడం, ఒకే ఉద్యోగి రెండు, మూడు రకాల విధులు నిర్వర్తించడం ఉడాలో కొన్నేళ్లుగా సాగుతోంది.

    ప్రభుత్వానికి జీతాలపరంగా ఖర్చు తగ్గినా.. సిబ్బంది లేకపోవడంతో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా నిర్వహించలేని దుస్థితి నెలకొంది. ఉడా ఆవిర్భావంలో కేటాయించిన సిబ్బందిలో దాదాపు 30 శాతం ఖాళీలను భర్తీచేయకపోవడం, మిగిలిన 30 శాతం మంది పదవీవిరమణ చేసినా వారి స్థానాల్ని భర్తీచేయలేకపోవడంతో సిబ్బంది కొరత సమస్య తీవ్రమయింది. దీనికితోడు ఇప్పుడు ఉడా పరిధి భారీగా పెరగడంతో కొత్త పోస్టుల అవసరం ఏర్పడింది.  
     
    రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతంలో వీజీటీఎం ఉడా నూతన రాష్ట్రంలో అతిపెద్దదిగా నిలుస్తుంది. విస్తీర్ణం దృష్ట్యా కూడా పెద్దదే. 1978లో అవిర్భవించిన ఉడా అప్పట్లో గుంటూరు, విజయవాడ, తెనాలి పట్టణాలకే పరిమితమైంది. కాలక్రమేణ  విజయవాడ, గుంటూరు నగరాలతోపాటు రెండు జిల్లాల్లోని తొమ్మిది మున్సిపాలిటీలు, 1400 గ్రామాల పరిధికి విస్తరించింది.

    2012 వరకు ఉడా పరిధి కేవలం 1945 చదరపు కిలోమీటర్లు మాత్రమే. అప్పట్లో ఉడా పరిధి, కార్యకలాపాలను ప్రామాణికంగా తీసుకుని మున్సిపల్ శాఖ 120 మంది సిబ్బంది నియామకాలకు వీలుగా పోస్టులు ఉడాకు కేటాయించింది. వారిలో 80 మందిని మాత్రమే తొలుత నియమించారు. ఆ తర్వాత నియామకాలు జరగకపోవడంతో  ఖాళీలు అలాగే ఉన్నాయి. గడిచిన పదేళ్లలో సుమారు 30 మంది వరకు పదవీవిరమణ చేయడంతో ప్రస్తుతం పనిచేసే సిబ్బంది సంఖ్య 58కు చేరింది.
     
    ఈ క్రమంలో కాంట్రాక్టు ఉద్యోగులే ఇక్కడ అధికంగా పనిచేస్తున్నారు. గతంలో వైస్ చైర్మన్‌లుగా పనిచేసిన అధికారులు ఉద్యోగుల భర్తీకి ప్రయత్నించకుండా కేవలం కాంట్రాక్టు ఉద్యోగులతోనే నడిపించారు. ప్రస్తుతం ఉడాలో సుమారు 175 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. 2012 వరకు కేవలం 1945 చదరపు కిలోమీటర్లకే పరిమితమైన ఉడా పరిధి ఒక్కసారిగా 5113 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. పెరిగిన విస్తీర్ణానికి అనుగుణంగా సిబ్బంది లేకపోవడంతో ఉడాకు ఆదాయం కూడా తగ్గిపోతోంది.
     
    ప్లానింగ్, ఇంజినీరింగ్, సిటిజన్ చార్టర్, ఎస్టేట్ విభాగం, ల్యాండ్ ఎక్విజేషన్  విభాగం, పరిపాలన విభాగాలు ఉన్నాయి.  ఉడా పరిధిలో దాదాపు మూడు వేలకుపైగా ప్రైవేట్ వెంచర్లు ఉన్నాయి. ఇవికాక అనధికారికంగా సుమారు ఐదు వేల ఎకరాల్లో ఉడా అనుమతిలేని వెంచర్లు ఉన్నాయి. ఉడా సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి అనధికార లేఅవుట్లపై చర్యలు తీసుకుని వారికి అపరాధరుసం విధించాల్సి ఉంటుంది.   సిబ్బంది లేకపోవడంతో ఆ పని జరగడం లేదు. నూతన ప్రాజెక్టులు కాని, రన్నింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు వేగవంతం చేయడానికి సిబ్బంది లేకపోవడంతో సమస్య ఉత్పన్నమవుతోంది.
     
    హుడాను పరిగణనలోకి తీసుకోండి..
     
    హైదరాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ (హుడా)ను పరిగణనలోకి తీసుకుని, దానికి సిబ్బందిని కేటాయించిన విధంగానే వీజీటీఎం ఉడాకు కేటాయించాలని ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి గతంలో ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసి సిబ్బంది పెంపు ఆవశ్యకతను వివరించి మున్సిపల్ శాఖకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరి వినతిపత్రం అందజేశారు. దీనిపై మున్సిపల్ శాఖ కొంత కసరత్తు ప్రారంభించిన తరుణంలో రాష్ట్ర విభజన జరగడం, ప్రభుత్వం మారడం జరుగుతోంది. దీంతో ఈ వ్యవహారానికి బ్రేక్ పడినట్లయింది.

    నూతన రాష్ట్ర రాజధాని కచ్చితంగా వీజీటీఎం ఉడా పరిధిలోని ప్రాంతంలోనే ఏర్పాటవుతుందని అందరు విశ్వసిస్తున్నారు. ఈ తరుణంలో సిబ్బంది కొరత తీరకపోతే రాజధాని నిర్మాణంలో ఉడా క్రియాశీలక పాత్ర పోషించలేని పరిస్థితి తలెత్తుతుంది. గతంలో కంటే విస్తీర్ణం రెండున్నర రెట్లు పెరిగినందున.. కేటాయించిన సిబ్బంది సంఖ్యను రెండు రెట్లు పెంచాలని చైర్మన్ ఇప్పటికే ప్రభుత్వాన్ని  కోరారు. అంటే ప్రస్తుతం ఉన్న సిబ్బందితో కలుపుకొని 420 వరకు పోస్టులు కావాలన్నమాట.
     
     నూతన సీఎంకు విన్నవిస్తాం
     నూతన రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి ఉడాకు పోస్టులు పెంచాలని కోరతాను. ముఖ్యమంత్రిగా పాలనపగ్గాలు చేపట్టిన తర్వాత సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళతాను. ఉడాను సీమాంధ్రలో అన్ని అంశాల్లో అగ్రగామిగా నిలపటమే నా ఎజెండా. ఆ దిశగా పనిచేస్తున్నాను.
     -వణుకూరి శ్రీనివాసరెడ్డి, చైర్మన్, వీజీటీఎం ఉడా
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement