‘సరిహద్దు’ చిచ్చు | Border dispute of Telangana-AP | Sakshi
Sakshi News home page

‘సరిహద్దు’ చిచ్చు

Published Fri, Oct 7 2016 3:27 AM | Last Updated on Mon, Sep 4 2017 4:25 PM

‘సరిహద్దు’ చిచ్చు

‘సరిహద్దు’ చిచ్చు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య మరోసారి సరిహద్దు వివాదం రాజుకుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే తెలంగాణ లారీలను చెక్‌పోస్టుల వద్ద అడ్డుకుని రోజుల తరబడి నిలిపేయటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రెండు రాష్ట్రాల మధ్య సింగిల్ పర్మిట్ విధానానికి ఒప్పందం కుదరకపోవటంతో ఇబ్బంది పడుతున్న తమను ఇప్పుడు ఏపీ అధికారులు కావాలనే వేధిస్తున్నారంటూ తెలంగాణ లారీ యజమానుల సంఘం భగ్గుమన్నది. రాష్ట్ర విభజన అనంతరం సరిహద్దు దాటాలంటే పన్ను కట్టాల్సిందేనంటూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ‘సరిహద్దు’ వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత రెండు రాష్ట్రాల అధికారుల చర్చల ఫలితంగా వివాదం సద్దుమణిగింది. నాలుగు రోజులుగా దాచేపల్లి, పొందుగుల, నాగార్జునసాగర్ తదితర చెక్‌పోస్టుల వద్ద వందల సంఖ్యలో తెలంగాణ లారీలను ఏపీ అధికారులు నిలిపేస్తున్నారు. ఇందులో ఎక్కువగా ఇసుక లారీలే ఉన్నాయి. సరైన వే బిల్స్ ఉన్నా స్థానికంగా కంప్యూటరీకరణ లేనందున వాటిని నర్సరావుపేట కార్యాలయానికి వెళ్లి సరిచూసుకోవాలనే కారణంతో లారీలను రెండు, మూడురోజులపాటు నిలిపేశారు. దీంతో తెలంగాణ లారీ యజమానులు ధర్నాలకు కూడా దిగారు. ఇది రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మారుతోందని గుర్తించిన ఏపీ అధికారులు గురువారం చాలా లారీలను వదిలేశారు.
 
‘తోక బిల్లు’ లేదని...
ఓ చెక్‌పోస్టులో లారీని తనిఖీ చేశాక పత్రాలన్నీ సరిగా ఉంటే ‘పత్రాలు సరిగానే ఉన్నాయి సరిహద్దు దాటేందుకు అభ్యంతరం లేదు’ అని పేర్కొంటూ ఓ పత్రం ఇస్తారు. దానిని లారీల డ్రైవర్లు తోక బిల్లుగా వ్యవహరిస్తారు. ఆ బిల్లు లేదనే సాకుతో అధికారులు లారీ డ్రైవర్లను వేధిస్తున్నారని తెలంగాణ లారీ యజమానుల సంఘం ఆరోపిస్తోంది. ఒక్కో లారీ నుంచి ఏపీ అధికారులు రూ.400 వరకు వసూలు చేస్తున్నారని, ఇప్పుడు అంతకంటే ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా రెండు ప్రభుత్వాలు చర్చించుకుని లారీలకు సింగిల్ పర్మిట్ విధానం ప్రారంభించాలని తెలంగాణ లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు.
 
ఎమ్మెల్యే ఇసుక దందా...
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఒకరు అక్రమంగా సిలికా ఇసుకను తెలంగాణకు సరఫరా చేస్తున్నట్టు బయటపడింది. తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల నుంచి ఇసుక సరఫరా బాగా తగ్గిపోయింది. దీంతో హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో ఇసుక కొరత ఏర్పడింది. దీన్ని ఆసరా చేసుకున్న ఆ ఎమ్మెల్యే చిలుకలూరిపేట, రేపల్లె తదితర ప్రాంతాల నుంచి సిలికా ఇసుక అక్రమ సరఫరాకు తెరలేపారు. దీనికి ఆ ఎమ్మెల్యే హైదరాబాద్‌కు చెందిన లారీలనే వినియోగించటం గమనార్హం. అధికారులు పట్టుకున్న లారీల్లో ఇవీ ఉండటంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement