‘ఉమ్మడి’ ఫీజు చెల్లింపులకు ఓకే!
- 2013–14 ఫీజు బకాయిలపై సానుకూలంగా స్పందించిన ఆర్థిక శాఖ
- సాంఘిక సంక్షేమ శాఖ చేసిన సిఫార్సుకు ఆమోదం!
- వారం రోజుల్లో ఉత్తర్వులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన సమయంలో నెలకొన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపులకు మార్గం సుగమవుతోంది. బకాయిలను చెల్లించాలంటూ సాంఘిక సంక్షేమ శాఖ చేసిన సిఫార్సులకు రాష్ట్ర ఆర్థిక శాఖ సానుకూలంగా స్పందించింది. త్వరలో ఈ బకాయిలకు మోక్షం కలగనుంది. 2013–14 విద్యా సంవత్సరపు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను 2014–15 వార్షికంలో విడతల వారీగా విడుదల చేయగా.. రూ.248.5 కోట్లు మిగిలిపోయాయి. ఇరు రాష్ట్రాల మధ్య చెల్లింపులపై నెలకొన్న అస్పష్టతతో రాష్ట్రం మిగిలిపోయిన నిధులను పెండింగ్‌లో పెట్టింది. ఆ తర్వాతి సంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేస్తున్నప్పటికీ 2013–14 బకాయిల ఊసెత్తకపోవడంతో వాటిపై గందరగోళం నెలకొంది. ఆయా విద్యార్థులు కోర్సు పూర్తి చేసినప్పటికీ యాజమాన్యాలకు ఫీజులు చెల్లించని కారణంతో సర్టిఫికెట్లను కాలేజీల్లోనే వదిలేశారు.
భారం తగ్గే అవకాశం
వాస్తవానికి 2013–14 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.248.5 కోట్లు ఉన్నాయి. లక్ష మంది విద్యార్థులు కాలేజీలకు బకాయి పడ్డారు. ఈ క్రమంలో ప్రభుత్వం విడుదల చేసే బకాయిల చెల్లింపుల్లో సాంఘిక సంక్షేమ శాఖ సరికొత్త వ్యూహాన్ని అనుసరిస్తోంది. నాలుగేళ్ల నాటి బకాయిలు కావడంతో వీరిలో సగం మంది విద్యార్థులు వ్యక్తిగతంగా ఫీజులు చెల్లించుకోగా.. కొందరు కార్యాలయానికి వచ్చి ఫీజు నిధులు విడుదల చేయాలని వినతులు సమర్పిస్తున్నారు ప్రస్తుతం బకాయిలున్న వారిలో 20 శాతం విద్యార్థులు పొరుగు రాష్ట్రానికి చెందిన వారున్నారు.
ఈ క్రమంలో బకాయిలను పూర్తి స్థాయిలో కాకుండా సగం ఇస్తే సరిపోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రాధాన్యత క్రమంలో ఫీజులు చెల్లించాలని సాంఘిక సంక్షేమ శాఖ భావిస్తోంది. తొలి విడతలో రూ.150 కోట్లు విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ అంగీకరించినట్లు సమాచారం. డిమాండ్‌ను బట్టి మిగిలిన మొత్తాన్ని విడుదల చేస్తే సరిపోతుందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నట్లు తెలిసింది. ఈ మేరకు వారం రోజుల్లో నిధుల విడుదల ఉత్తర్వులు రావొచ్చని సంక్షేమ శాఖ వర్గాలు చెబుతున్నాయి.