ఒక్క నెలలోనే రూ.10 వేల కోట్లు! | one month in rs.10thousend crores! | Sakshi
Sakshi News home page

ఒక్క నెలలోనే రూ.10 వేల కోట్లు!

Published Thu, May 22 2014 2:28 AM | Last Updated on Sat, Sep 2 2017 7:39 AM

one month in rs.10thousend crores!

- విభజన నేపథ్యంలో ఉద్యోగులు, పింఛనుదారులకు చెల్లింపు
- ఒక నెలలోనే రెండు జీతాలు

 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో మే ఒక్క నెలలోనే ఉద్యోగులు, పింఛనుదారులకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 వేల కోట్లను చెల్లిస్తోంది. విభజన నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక నెలలోనే ఉద్యోగులు రెండు జీతాలు తీసుకోనున్నారు. ఏప్రిల్ నెల వేతనాలను ఈ నెల 2వ తేదీన ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించింది. జూన్ 2వ తేదీన రాష్ట్రం రెండుగా విడిపోతున్న నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసిన ఉద్యోగులకు జూన్ 1వ తేదీ వరకు ఇవ్వాల్సిన వేతనాలను వారం ముందుగా ఇదే నెల 24న చెల్లించాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది.

దీంతో ఏప్రిల్, మే నెలల వేతనాలను ఉద్యోగులు ఒకే నెలలో తీసుకున్నట్లవుతోంది. పింఛనుదారులకు కూడా ఇదే రీతిన చెల్లించాలని నిర్ణయించారు. జీతాలతో పాటు ఉమ్మడి రాష్ట్రంలో అన్ని రకాల చెల్లింపులకు ఈ నెల 24 చివరి తేదీ కానుంది. ఆ తరువాత ఉమ్మడి రాష్ట్రంలో ఎటువంటి చెల్లింపులు చేయరు. జూన్ 2న రెండు రాష్ట్రా లు ఏర్పాటయ్యాక ఏ రాష్ట్రానికి చెందిన  బిల్లులను ఆ రాష్ట్రాలు చెల్లిస్తాయి.

రూ.5 వేల కోట్ల అప్పు
ఒకే నెలలో ఉద్యోగులకు రెండు జీతాలు చెల్లించాల్సి ఉన్నందున ఆర్థిక శాఖ ఈ నెలలో రూ. 5 వేల కోట్ల అప్పు చేయాలని నిర్ణయించింది. రెండు దఫాలుగా రూ.5 వేల కోట్లు అప్పు చేయనుంది. తొలి దశలో గురువారం మూడు వేల కోట్ల రూపాయల రుణ సమీకరణకు రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలను ఆర్‌బీఐ ద్వారా వేలం పాటలో విక్రయించనున్నారు. తిరిగి ఈ నెల 27న మరో రెండు వేల కోట్ల రూపాయల రుణ సమీకరణకు ప్రభుత్వ సెక్యూరిటీలను విక్రయించనున్నారు.

జూన్ 2న రెండు రాష్ట్రాలుగా విడిపోతున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల ఖజానాలలో కనీసం రెండు వేల కోట్ల రూపాయల చొప్పున అయినా నగదు నిల్వ ఉండేలాగ ఆర్థిక శాఖ జాగ్రత్తలు తీసుకుంటోంది. జూన్ 1వ తేదీ అర్ధరాత్రి రాష్ట్ర ఖజానాలో ఉన్న నగదు నిల్వలను ఆర్‌బీఐ జనాభా నిష్పత్తి ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పంపిణీ చేయనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో రూ. 29 వేల కోట్లు అప్పు చేయాలని ప్రతిపాదించారు. ఇప్పటి వరకు రూ. 2వేల కోట్లను అప్పు చేశారు. గురువారంతో పాటు 27న చేయనున్న అప్పుతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.7 వేల కోట్లు అప్పు చేసినట్లవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement