ప్రజలు మళ్లీ మావైపు చూస్తున్నారు
- ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి
- నందిగామ ఉప ఎన్నికే నిదర్శనం
- అధికారపార్టీ తప్పటడుగులను జనాలకు వివరించాలి
సాక్షి, విజయవాడ బ్యూరో : ‘మాకు మళ్లీ మంచి రోజులొచ్చాయి. ప్రజలంతా మా పార్టీ వైపే చూస్తున్నారు. ఇందుకు నందిగామ ఎన్నికలే ఉదాహరణ. సార్వత్రిక ఎన్నికల్లో 2000 ఓట్లతో సరిపుచ్చుకున్నాం. కానీ నందిగామ ఉప ఎన్నికల్లో 25వేల ఓట్లు రావడం సంతోషంగా ఉంది. ప్రజలంతా మళ్లీ మావైపే చూస్తున్నారు’ అని ఏపీ పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి పేర్కొన్నారు. విజయవాడలోని ఆంధ్రరత్నభవన్‌లో ఆదివారం కాంగ్రెస్ పార్టీ జిల్లా నేతల సమావేశం జరిగింది.
డీసీసీ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రఘువీరారెడ్డి కార్యకర్తలు, నేతలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెసే కారణమనీ, భవిష్యత్తులో ఆ పార్టీకి ఓట్లు పడవని ప్రచారం జరిగిన నేపథ్యంలో మూడు నెలల వ్యవధిలోనే ప్రజలు చక్కని తీర్పునివ్వడం సంతృప్తికరంగా ఉందన్నారు. నందిగామ ఉప ఎన్నికల్లో జిల్లా నేతలతో పాటు నంది గామ నియోజకవర్గ నేతలు, బూత్, మండల స్థాయి కార్యకర్తలను అభినందించారు.
ఇప్పుడిప్పుడే అధికార పార్టీ పరిపాలనా పరంగా తప్పటడుగులు వేస్తోందనీ, ఆయా పార్టీ నేతలు చేసే పొరపాట్లను, తీసుకునే ప్రజావ్యతిరేక నిర్ణయాలను ప్రజలకు చెప్పేందుకు పార్టీ కార్యకర్తలు, నేతలు కృషి చేయాలని రఘువీరా పిలుపునిచ్చారు. నరహరిశెట్టి నరసింహారావు పలువురు నాయకులు, మండల స్థాయి నేతలను రఘువీరాకు పరిచయం చేశారు. మాజీ మంత్రులు దేవినేని నెహ్రూ, కాసు కృష్ణారెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీజే సుధాకర్‌బాబు, పార్టీ జిల్లా ఇన్‌చార్జి షేక్ మస్తాన్‌వలి, దేవినేని అవినాష్, పీసీసీ సభ్యుడు కొలనుకొండ శివాజీ, అడపా నాగేంద్రం తదితరులు పాల్గొన్నారు.