సాక్షి, మడకశిర: ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో ఎలక్షన్ కమిషన్ విఫలమైందని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి విమర్శించారు. ఆయన తన స్వగ్రామమైన అనంతపురం జిల్లా నీలకంఠాపురంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. నిబంధనల ప్రకారం తొలుత ఎంపీ అభ్యర్థికి ఓటు వేయాల్సి ఉండగా.. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎమ్మెల్యే అభ్యర్థికి ఓటు వేయించారన్నారు. దీంతో పోటీలో ఉన్న అభ్యర్థుల తల రాతలు మారే పరిస్థితి ఏర్పడిందన్నారు. ముఖ్యంగా ఈవీఎంల పనితీరు చాలా అధ్వానంగా ఉందన్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో వెలుతురులేక ఓటర్లు ఇబ్బందులు పడ్డారని, చాలా పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీటి సౌకర్యం కూడా కల్పించలేదని మండిపడ్డారు.
సమస్యాత్మక గ్రామాల్లో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయకపోవడం వల్లే హింస చెలరేగి ముగ్గురు హత్యకు గురయ్యారన్నారు. అర్థరాత్రి దాటాక కూడా పోలింగ్ నిర్వహించడం ఈసీ వైఫల్యమేనన్నారు. ఓటర్లకు ఈసీ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రాణానికి ముప్పు ఉందని, కేంద్ర ప్రభుత్వం రాహుల్‌కు పూర్తి స్థాయిలో భద్రత కల్పించాలని కోరారు. రాహుల్‌కు ఏమైనా జరిగితే ప్రధాని మోదీ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment