
సాక్షి, అమరావతి/ఏడిద (మండపేట): సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి మిత్రపక్షంగానే ఉంటామని, అయితే ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో పొత్తుమాత్రం ఉండదని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తెలిపారు. పీసీసీ సభ్యుడు కామన ప్రభాకరరావు కుమారుడి వివాహ వేడుకలో పాల్గొనేందుకు గురువారం తూర్పు గోదావరి జిల్లా ఏడిద వచ్చిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలో ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న మోదీ సర్కారుకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో స్థానిక పార్టీలు కలుస్తున్నాయన్నారు.
కేంద్రం, రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని రఘువీరారెడ్డి అన్నారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జంప్ జిలానీల కోసం వేచి చూడకుండా శుక్రవారం రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు. అభ్యర్థుల ఖరారు చివరి దశకు చేరుకుందని, వీటిపై ఢిల్లీలో అధిష్టానంతో చర్చించి జాబితా విడుదల చేస్తామన్నారు.