సాక్షి, అమరావతి : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు వరకూ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం సర్కార్ పాలనలో విచ్చలవిడిగా సాగిన అవినీతిపై దుమ్మెత్తి పోసిన రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నా టీడీపీ నేతలను పల్లెత్తు మాట అనకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీపై చర్యలు తీసుకోవాలంటూ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఏకంగా రాష్ట్రపతి, గవర్నర్‌కు గతంలో లేఖలు రాశారు. 2014లో సీఎంగా చంద్రబాబు చేసిన మొదటి సంతకాలకే దిక్కులేకుండా పోయిందని, ముఖ్యంగా రైతు రుణమాఫీ విషయంలో బాగా మోసం చేశారని దుమ్మెత్తిపోసిన రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఇప్పుడా మాటలు ఎక్కడా మాట్లాడడంలేదు. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని భంగపడ్డ కాంగ్రెస్ అధిష్టానం ఆ తర్వాత ఏపీలో టీడీపీతో పొత్తు ఉండదని రాష్ట్ర నేతలకు చెప్పింది. అయినప్పటికీ అంతర్గతంగా పొత్తు ఉంటుందనే రీతిలో సంకేతాలు ఇవ్వడంవల్లే వీరు చంద్రబాబు సర్కార్‌పై విమర్శలు చేయడంలేదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇందుకు వారు చంద్రబాబు సర్కారుకు వ్యతిరేకంగా లేవనెత్తిన పలు సంఘటనలనూ ఉదహరిస్తున్నారు. అవి..
- విశాఖ మన్యం గుండెల్లో ‘బాబు’ బాక్సైట్ బాణం అంటూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. 2014లో తిరిగి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు దృష్టి ఒక్కసారిగా విశాఖ ఏజెన్సీపైనే పడిందని.. అందుకోసమే అరకు ప్రాంతాన్ని తాను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారంటూ ఆయా ప్రాంతాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీలు జరిగాయి. త్వరలో బాక్సైట్ మైనింగ్ ప్రారంభించబోతున్నట్లు ప్రపంచ గిరిజన దినోత్సవం 2014 ఆగస్టు 10న చంద్రబాబు ప్రకటించారు. ఇందుకోసం అటవీ భూముల బదిలీకి 2015 ఫిబ్రవరి 10, 23, జులై 21, ఆగస్టు 6 తేదీల్లో నాలుగుసార్లు కేంద్ర పర్యావరణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖలు రాసినట్లు.. ఆ వ్యవహారాలన్నీ అప్పట్లో కాంగ్రెస్ నేతలు బయటపెట్టారు. ఇప్పుడీ ప్రస్తావన ఎక్కడా లేదు.
- చంద్రబాబు పాలనపై ‘అదిరిందయ్య చంద్రం’ పేరిట ప్రభుత్వ తీరుపై ప్రశ్నల వర్షం కురిపించి ఓ పుస్తకాన్ని ప్రచురించి రాష్ట్రవ్యాప్తంగా అప్పట్లో పంపిణీ చేశారు.
- టీడీపీ నిర్వహించిన మహానాడుపై కూడా తీవ్ర విమర్శలు చేస్తూ మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేయొద్దంటూ మహానాడుకు బదులు దగానాడు జరుపుకోవాలంటూ రఘువీరారెడ్డి మూడు పేజీల లేఖ రాశారు. మోసం చేయడంలో, మాట తప్పడంలో మహా నేర్పరి, రాష్ట్ర ప్రజానీకాన్ని మరోమారు దగా చేయడంలో మిమ్మల్ని మించిన వారు లేనేలేరని పలుమార్లు రుజువు చేసుకున్నారంటూ ఆ లేఖలో చంద్రబాబుపై ఆయన విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఆయన ఎక్కడా చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడడంలేదు.
- హామీలో భాగంగా రుణమాఫీ అమలుచేస్తారనే ఆశతో రైతుల రుణాలు రెన్యూవల్ చేయలేదని, వాటి ఫలితంగా బీమా ప్రీమియం చెల్లించే అవకాశంలేక 2014–15లో రైతులు దాదాపు రూ.2 వేల కోట్లు నష్టపోయిన విషయాన్నీ పదేపదే ప్రశ్నించారు.
- అంతేకాక.. రాష్ట్రంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొనడంతో ‘మీరైనా జోక్యం చేసుకోండి’.. అంటూ పలుమార్లు కాంగ్రెస్ నేతలు గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళారు.
- అలాగే, బొగ్గు కొనుగోళ్లలో అక్రమాలు, ఇసుక మాఫియా, అధికారులపై దాడులు, డ్వాక్రా మహిళలు, చేనేత వర్గాలు పడుతున్న ఇక్కట్లు, పేదలు నిర్మించుకుంటున్న ఇళ్లకు పెండింగ్‌లో ఉన్న కోట్లాది రూపాయల బకాయిలను విడుదల చేయాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు.
ఇప్పుడు రూటు మార్చేశారు..
ఇలా చంద్రబాబునాయుడు సర్కారుపై పలు విధాలుగా ఆరోపణలు, విమర్శలు చేసిన రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఇప్పుడా ప్రస్తావనలే ఎక్కడా చేయకుండా సైలెంట్ అయిపోయారు. తెలంగాణలో టీడీపీతో పొత్తు వికటించడంతో ఏపీలో ఎలాంటి అవగాహన ఉండదని కాంగ్రెస్ అధిష్టానం ఇక్కడి నేతలకు స్పష్టం చేసింది. అయినప్పటికీ వారెవరూ టీడీపీని మాటవరసకు కూడా పల్లెత్తు మాట అనకపోవడంతో లోపాయికారిగా వారిరువురి మధ్య పొత్తు ఉండి ఉంటుందని.. అందుకే కాంగ్రెస్ నోటికి టీడీపీ తాళం పడిందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment