కృష్ణమూర్తిని గెంటేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు.. రఘువీరాతో కృష్ణమూర్తి వాగ్వాదం
సాక్షి, విజయవాడ: కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ల కుమ్ములాట వీధికెక్కింది. పోలీసు కేసుల వరకు వెళ్లింది. టీడీపీతో కుమ్మక్కయ్యారని ప్రశ్నించిన సొంత పార్టీ నాయకుడిపై కాంగ్రెస్ నేతలు దౌర్జన్యం చేశారు. తనపై పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి దాడి చేయించారంటూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సుంకర కృష్ణమూర్తి శుక్రవారం గవర్నర్ పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన సామాజిక వర్గానికి సీటు కేటాయించమని అడిగినందుకు తనపై దాడి చేయించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.
టిక్కెట్లు అమ్ముకుని పార్టీని నమ్ముకున్న వారికి రఘువీరారెడ్డి అన్యాయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. టీడీపీకి కొమ్ము కాస్తున్న రఘువీరారెడ్డిని పార్టీ నుంచి వెంటనే బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. లాలూచీ రాజకీయాలతో పార్టీని నాశం చేస్తున్నారని, పార్టీకి సేవ చేసేవారికి మొండి చేయి చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం పని చేసే వారికి గుర్తింపు లేదని, సీనియర్లకు గౌరవం ఇవ్వడం లేదని వాపోయారు.
అధికార పార్టీ కొమ్ముకాసే విధంగా సీట్లు కేటాయించారని ప్రశ్నించినందుకు తనను కార్యకర్తలతో కొట్టించి బలవంతంగా మెడపట్టి గెంటించారని కృష్ణమూర్తి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని హోల్‌సేల్‌గా రఘువీరారెడ్డి అమ్మేశారని విమర్శించారు. విజయవాడలో ఒక్క సీటు కూడా కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వలేదని తెలిపారు. ఈనెల 25లోగా తమ సామాజిక వర్గానికి సీటు కేటాయించకుంటే పార్టీ కార్యాలయం ఎదుట ఆత్మహత్య చేసుకునేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. రఘువీరారెడ్డి రాజీనామా చేస్తేనే కాంగ్రెస్ పార్టీ బతుకుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment