నర హంతకులను పార్టీలో చేర్చుకుంటున్నావ్.. : రఘువీరారెడ్డి
చంద్రబాబుపై రఘువీరారెడ్డి ధ్వజం
సాక్షి, అనంతపురం/కర్నూలు: కాంగ్రెస్ నాయకులను నర హంతకులతో పోల్చిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం అలాంటి వారినే పార్టీలో చేర్చుకుంటున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. బస్సు యాత్రలో భాగంగా గురువారం అనంతపురం, కర్నూలుల్లో నిర్వహించిన సభలు, కార్యకర్తల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌కు చెందిన కొందరు నాయకులు నర హంతకులని, టీడీపీ నేతల గొం తులు కోశారని ఆరోపిస్తూ తాము అధికారంలోకి వచ్చాక వాళ్ల అంతు చూస్తానంటూ అనంతపురంలో ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా చేసిన చంద్రబాబు.. ఇప్పుడు అవన్నీ మరచిపోయి ఆ నర హం తకులనే పార్టీలో చేర్చుకున్నారని విమర్శించారు.
పచ్చకండువాతో పవిత్రులయ్యారా..?
కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్, కేంద్ర మంత్రి చిరంజీవి మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే కాంగ్రెస్ నేతలు యలమంచిలి వెంకటరమణరాజు, వెంకటరమణ, శిల్పా మోహన్‌రెడ్డితో పాటు పరిటాల రవి హత్యతో సంబంధం ఉన్న వారిని వదలనని గొప్పలు చె ప్పిన చంద్రబాబు పదవీ వ్యామోహంతో అవన్నీ మరచిపోయి వారందరినీ పార్టీలో చేర్చుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ కండువా వేసుకున్నప్పుడు అపవిత్రులుగా ఉన్న వారు టీడీపీ కండువా వేసుకుంటే పవిత్రులయ్యారా అని బాబును ప్రశ్నించారు. సభలో కేంద్రమంత్రి జేడీ శీలం, ఎంపీ టి.సుబ్బిరామిరెడ్డి, మాజీ మంత్రులు బాలరాజు, కొండ్రు మురళి, డొక్కా మాణిక్యవరప్రసాద్ పాల్గొన్నారు.