సోనియా అవినీతి అనకొండ: చంద్రబాబు
* కాంగ్రెస్‌కు గోరీ కట్టాలి
* మహిళా గర్జనలో టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు
సాక్షి, విజయవాడ: సోనియాగాంధీ పెద్ద అవినీతి అనకొండని, కాంగ్రెస్ నేతలు వందల కోట్లు సంపాదించి స్విస్‌బ్యాంకుల్లో దాచారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. బ్యాంకుల్లో డబ్బు దాచిన వారి అకౌంట్స్ వివరాలు ఇవ్వడానికి స్విట్జర్లాండ్ ప్రభుత్వం ముందుకు వచ్చినా యూపీఏ ప్రభుత్వం వాటిని ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నిం చారు. విజయవాడ మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో గురువారం నిర్వహించిన మహిళా గర్జనలో మాట్లాడుతూ తల్లి, బిడ్డలు ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ‘పండంటి బిడ్డ’ అనే మరో పథకాన్ని ప్రకటిస్తున్నట్లు చెప్పారు.
టీఆర్‌ఎస్, వైఎస్సార్‌సీపీలను కలుపుకుని టీడీపీని దెబ్బతీయడానికి కాంగ్రెస్ కుట్ర పన్నిం దని, అయితే తాను తీసుకున్న గోతిలో తానే పడిందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ప్రతీ తెలుగువాడు దానిపై మట్టి పోసి, మళ్లీ లేవకుండా గోరీ కట్టాలన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తీరు ప్రతి ఒక్కరిని కలవరపరిచిందని, సమన్యాయం చేసేందుకు తాను ఢిల్లీలో అన్ని పార్టీల నేతల్ని కలిశానని చెప్పారు. మొత్తం రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లు పాలించిన తనకు ఇప్పుడు సగం రాష్ట్రాన్ని పరిపాలించాలన్న కోరిక లేదన్నారు. అయితే సీమాం ధ్రను స్వర్ణాంధ్రగా మార్చాలనే కసి తనలో ఉందన్నారు. శ్రీకాకుళం నుంచి చెన్నై వరకు కలిపే రహదారిని, సముద్ర తీరాన్ని ఉపయోగించి అభివృద్ధి సాధిస్తానన్నారు. సమావేశంలో తెలుగుదేశం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు హైమావతి, ప్రధాన కార్యదర్శి అనూరాధ, ఎంపీలు కొనకళ్ల నారాయణ, గరికపాటి మోహనరావు, జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు, కేశినేని శ్రీనివాస్(నాని), నటుడు వేణుమాధవ్, టీడీపీ నేతలు వర్లరామయ్య, గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు.