ప్రజాతీర్పుతో పరిహాసం! | Chandrababu attempts to put his failure on EVMs | Sakshi
Sakshi News home page

ప్రజాతీర్పుతో పరిహాసం!

Published Wed, May 22 2019 4:12 AM | Last Updated on Wed, May 22 2019 4:52 AM

Chandrababu attempts to put his failure on EVMs - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల (ఈవీఎంలు) పనితీరును వివాదాస్పదం చేయడం ద్వారా ఈ అంశాన్ని సజీవంగా ఉంచేందుకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. 2014లో ఇవే ఈవీఎంలతో గెలిచిన చంద్రబాబు ఈసారి పరాజయం ఖాయమనే నిర్థారణకు వచ్చి వీటిని సాకుగా చూపేందుకు ఇతర పార్టీలనూ ఇందులోకి లాగుతూ ఈ వివాదంలో భాగస్వాములుగా మార్చే యత్నం చేస్తున్నారు. ఐదు పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంల ఓట్లకు, వీవీప్యాట్‌ స్లిప్పులకు మధ్య వ్యత్యాసం ఉంటే ఆ నియోజకవర్గంలోని మిగతా కేంద్రాల్లోనూ వీవీ ప్యాట్‌ స్లిప్పులను లెక్కించాలన్న డిమాండ్‌తో మంగళవారం ఢిల్లీలో విపక్షాల సమావేశం జరిగింది. ఈ అంశంపై ఎన్నికల సంఘాన్ని కలసి వినతిపత్రం సమర్పించడానికి ముందు 22 పార్టీలు సమావేశమయ్యాయి. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడే ముందు జరిగిన ఈ భేటీకి చంద్రబాబు, ఒకరిద్దరు ప్రధాన నేతలు మినహా విపక్షాల అధినేతలెవరూ హాజరుకాకపోవడం గమనార్హం. 

తనకు తానే పెద్దన్నగా చెప్పుకుంటూ...
టీడీపీ పరాజయం అంచున ఉందని ఎన్నికల షెడ్యూలు కంటే ముందుగానే పలు సర్వే సంస్థలు ఒపీనియన్‌ పోల్స్‌ ద్వారా ప్రకటించినప్పటి నుంచి చంద్రబాబు తన వైఫల్యాలను ఈవీఎంలపై నెట్టివేసేందుకు మార్గాలను అన్వేషించారు. ఈవీఎంలు ట్యాంపరింగ్‌కు గురవుతాయంటూ అప్పటి నుంచే ప్రచారాన్ని ఉధృతం చేస్తూ వచ్చారు. మళ్లీ బ్యాలెట్‌ పద్ధతి తేవాలని ఈసీని డిమాండ్‌ చేశారు. 2018లో రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన తరువాత ఈ అంశాన్ని పట్టించుకోని కాంగ్రెస్‌ సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడడంతో ఈవీఎంలపై చంద్రబాబు డిమాండ్‌కు తలొగ్గింది. ఎన్డీయేతర విపక్షాలను ఏకం చేసే ఎజెండాలో ఇదొక భాగమైంది. కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాలు ఐక్య వేదికపైకి వచ్చేందుకు ఇది దోహదపడుతుండడంతో మిగిలిన పక్షాలూ జత కలిశాయి.

వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కించాలంటూ ఈ పార్టీలన్నీ సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఇప్పటివరకు నియోజకవర్గానికి ఒక పోలింగ్‌ స్టేషన్‌లో వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కిస్తున్న విధానాన్ని ఐదు పోలింగ్‌ స్టేషన్లకు వర్తింపజేస్తూ తీర్పు ఇచ్చారు. దీన్ని సమీక్షించాలని మరోసారి రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయగా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో చంద్రబాబు మరో కొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. చివరి రౌండ్‌లో కాకుండా ముందుగానే ఐదు కేంద్రాల్లో వీవీ ప్యాట్లను లెక్కించాలని, ఒకవేళ ఈవీఎం ఓట్లకు, వీవీప్యాట్‌ పత్రాలకు మధ్య వ్యత్యాసం ఉంటే ఆ నియోజకవర్గ పరిధిలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంలతోపాటు వీవీప్యాట్‌ పత్రాలను లెక్కించాలన్నది ఈ డిమాండ్‌. మే రెండో వారంలో దీనిపై ఈసీని కలిసినా స్పందించలేదు. ఆంధ్రప్రదేశ్‌లో పరాజయం అంచున ఉన్న చంద్రబాబు ఈ డిమాండ్‌ను తనకు అనుకూలంగా వాడుకుంటూ వారం రోజులుగా జాతీయ నేతలను కలుస్తున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నానంటూ తనకు తానే పెద్దన్నగా చెప్పుకుంటున్నారు.
ఈసీని కలిసిన అనంతరం బయటకు వస్తున్న చంద్రబాబు, గులాం నబీ ఆజాద్‌ తదితరులు   

అధినేతల నుంచి స్పందన కరువు
ఎగ్జిట్‌ పోల్స్‌ వెలువడ్డాక తీవ్ర నైరాశ్యంలో ఉన్న విపక్ష పార్టీలు చంద్రబాబు డిమాండ్లపై పెద్దగా స్పందించడం లేదు. ఎన్నికల సంఘంతో చర్చించాల్సిన అంశాలపై మాట్లాడేందుకు మంగళవారం మధ్యాహ్నం భేటీ కావాలంటూ చంద్రబాబు హడావుడి చేసినా కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్, ఎస్పీ, బీఎస్పీ అధినేతలు ఎవరూ హాజరు కాలేదు. ఆయా పార్టీల ప్రతినిధులు మాత్రమే వచ్చారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్‌ మాత్రమే హాజరయ్యారు. కాంగ్రెస్‌ నుంచి గులాం నబీ ఆజాద్, అహ్మద్‌ పటేల్, అశోక్‌ గెహ్లాట్, అభిషేక్‌ సింఘ్వీ, కొప్పుల రాజు, రాజ్‌బబ్బర్, ఎస్పీ నుంచి రాంగోపాల్‌ యాదవ్‌ ఎన్సీపీ నుంచి ప్రఫుల్‌పటేల్, మజీద్‌ మెమన్, డీఎంకే నుంచి కనిమొళి, తృణమూల్‌ నుంచి డెరెక్‌ ఒబ్రెయిన్, బీఎస్పీ నుంచి సతీష్‌చంద్ర, ఆర్జేడీ నుంచి మనోజ్‌ ఝా, ఎల్జేడీ నుంచి జావేద్, జేడీ(ఎస్‌) నుంచి కుపేంద్రరెడ్డి తదితరులు హాజరయ్యారు. 

ధర్నాపై భిన్నాభిప్రాయాలు..
తమ డిమాండ్లపై సరైన స్పందన రానిపక్షంలో ఈసీ కార్యాలయం ఎదుట ధర్నా ఉంటుందని టీడీపీ వర్గాలు, అనుకూల మీడియా ప్రచారం చేశాయి. అయితే ఈ ప్రతిపాదనపై సమావేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్టు సమాచారం.  రాజ్యాంగబద్ధమైన సంస్థ కార్యాలయం ముందు ధర్నా చేయడం సముచితం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమైనట్టు తెలిసింది. ఒకవేళ ఎన్నికల సంఘం ఈ సమస్యకు పరిష్కారం చూపించకుంటే బుధవారం ఈసీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగాలని నిర్ణయించినట్లు సమాచారం. 

నేడు చర్చిస్తామన్న ఈసీ
ఈసీతో భేటీ పూర్తయిన వెంటనే మంగళవారం మరోసారి కానిస్టిట్యూషన్‌ క్లబ్‌లో విపక్షాల ముఖ్యనేతలు సమావేశమయ్యారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం విపక్షాల కూటమి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. సమావేశం అనంతరం కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్‌ మీడియాతో మాట్లాడుతూ ‘ఈవీఎంలో పోలైన ఓట్లకు, వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కకు మధ్య వ్యత్యాసం ఉంటే ఆ నియోజకవర్గంలోని మొత్తం పోలింగ్‌ స్టేషన్లకు సంబంధించిన వీవీ ప్యాట్‌ స్లిప్పులను లెక్కించాలని కోరాం..’ అని వివరించారు. ‘మేం దీనిపై చాలా రోజులుగా అడుగుతున్నా ఈసీ స్పందించలేదు. ఎట్టకేలకు బుధవారం ఉదయం ఈ అంశంపై చర్చిస్తామని ఈసీ తెలిపింది’ అని కాంగ్రెస్‌ నేత అభిషేక్‌ మను సింఘ్వీ పేర్కొన్నారు. ‘ప్రజాతీర్పును మార్చడానికి వీల్లేకుండా చూడాలని ఈసీని కోరుతున్నాం..’ అని టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు చెప్పారు. 

బాబు హడావుడి వెనక అసలు కథ?
గురువారం వెలువడే ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు తీవ్ర ఆందోళనతో ఉన్నట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రజాతీర్పును హుందాగా గౌరవించకుండా పరాజయ భారాన్ని ఈవీఎంలపై నెట్టేయడానికి కారణాలను రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ‘ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ పరాజయం పాలైతే జాతీయ రాజకీయాల్లో తనకు ఒక పాత్ర దక్కాలన్నదే చంద్రబాబు ఆకాంక్ష. ఒకవేళ ఎన్డీయేతర పక్షాలు అధికారంలోకి రాకుంటే  విపక్షాల కూటమిని సజీవంగా ఉంచేందుకు వీలుగా కన్వీనర్‌ లేదా కో కన్వీనర్‌ లాంటి పదవిని ఆశిస్తున్నారు. ఆ ప్రయత్నాలను ఆయన ఇప్పటికే ముమ్మరం చేశారు. రేపు పరాజయం పాలైతే ఆ భారాన్ని ఈవీఎంలపై గెంటేసేందుకు ఈ ప్రయత్నాలు పనికొస్తాయి. విపక్షాలతో మితృత్వం చంద్రబాబుకు ఎంతో అవసరం. ఎన్డీయే మళ్లీ అధికారంలోకి వస్తే చంద్రబాబు పలు ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది ..’ అని రాజకీయ, మీడియా వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement