
నిర్లక్ష్యంతోనే కాంగ్రెస్ బలహీనం: రఘువీరా
విజయవాడ (గుణదల): పదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి పార్టీ నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశామని, రాష్ట్ర విభజన అనంతర పరిణామాలతో పార్టీ మరింత బలహీనపడిందని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ నష్టాన్ని పూడ్చుకునేందుకు క్షేత్రస్థాయిలో కార్యకర్తలను సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఆదివారం విజయవాడలోని ఎగ్జిక్యూటివ్ క్లబ్‌లో రాష్ట్రస్థాయిలో వివిధ జిల్లాల నుంచి ఎంపికచేసిన 70 మంది ముఖ్య కార్యకర్తలకు రెండు రోజుల శిక్షణ తరగతులను ప్రారంభించారు. రాష్ట్రంలో 15 వేల మందికి శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రజలను తిరిగి కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షించేవిధంగా కార్యకర్తలు వ్యూహరచన చేయాలని సూచించారు. ఏఐసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు మాట్లాడుతూ చేసిన తప్పులను సరిదిద్దుకొని పార్టీని నిర్మాణపరంగా బలోపేతం చేసేందుకు శిక్షణ ఉపకరిస్తుందన్నారు.