తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగ సంఘాల వాగ్వాదం
కార్యాలయం కేటాయింపుపై ఘర్షణ
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో సచివాలయ ఉద్యోగుల సంఘం కార్యాలయం విషయమై తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగుల మధ్య శుక్రవారం తోపులాట, వాగ్వాదం జరిగింది. ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం కార్యాలయం హెచ్ బ్లాక్‌లో ఉంది. తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం కార్యదర్శి పద్మాచారి అదే కార్యాలయాన్ని తమకూ కేటాయించాలని కేసీఆర్ ఫొటో పెట్టి సమావేశం నిర్వహించారు. దీనికి ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు. సాధారణ పరిపాలన శాఖ నుంచి అనుమతి తెచ్చుకోకుండా ఈ విధంగా సమావేశాలు నిర్వహించడం సరికాదన్నారు.
అయితే, రాష్ట్రం విడిపోతున్న నేపథ్యంలో తమకు కార్యాలయాన్ని కేటాయించడం తప్పనిసరని, అందుకే ఇక్కడ సమావేశం నిర్వహించుకున్నట్టు పద్మాచారి తెలిపారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని నచ్చజెప్పారు. దీనిపై టీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్‌రావు స్పందిస్తూ.. సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల మధ్య ఎలాంటి వివాదాలూ లేవని, ఇవన్నీ ఎవరో కావాలని సృష్టిస్తున్నారని చెప్పారు.