విభజనే కారణం
బుక్‌లెట్లు, కరపత్రాలు పంపిణీ చేయండి
పోరాటాల వీడియో చిత్రాలు ప్రదర్శించండి
రెండో తేదీన నవ నిర్మాణ దీక్షతో స్ఫూర్తి రగిలించండి
కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు
హైదరాబాద్: ఏడాది పాలనలో వైఫల్యాల నుంచి రాష్ట్ర ప్రజల దృష్టి మరల్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విభజన గాయాలను గుర్తుచేయనున్నారు. ఏడాదిలో ఏం సాధించామంటే చెప్పుకోవడానికి ఏమీ లేకపోవడంతో... విభజనవల్ల రాష్ట్రానికి నష్టం జరిగిందన్న అంశంపై ప్రజల్లో భావోద్వేగాలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాలపై జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా దిశానిర్దేశం చేశారు. శుక్రవారం సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు సుదీర్ఘ ప్రసంగం చేశారు.
విభజన కారణంగా ఏపీకి జరిగిన నష్టం వివరిస్తూ ఆ సమయంలో అయిన గాయాలు, పోరాటాలు, ఆందోళనలతో చిత్రీకరించిన వీడియోలను ప్రజల్లో విస్తృతంగా ప్రదర్శించాలని ఆదేశించారు. విభజన అంశాలు ప్రజలు మరిచిపోకుండా వారిలో భావోద్వేగాలను సజీవంగా ఉంచేలా వీడియో చిత్రాలు, బుక్‌లెట్లు, కరపత్రాలు వంటి అన్ని రకాలుగా ప్రజల్లో పంపిణీ చేయాలని చెప్పారు. ఎగ్జిక్యూటివ్‌లుగా తాము ఆ పని చేయవచ్చా? అని కొందరు సందేహం వ్యక్తం చేయగా... కచ్చితంగా చేయాల్సింది మీరేనని నొక్కి చెప్పారు. అయితే... రైతుల రుణ మాఫీ, డ్వాక్రా రుణాలతోపాటు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలేవీ అమలు చేయకపోవడం, ప్రత్యేక హోదా సాధించలేకపోవడం, రాజధానికి నిధులు రాబట్టలేకపోవడం వంటి అనేక వైఫల్యాలను కప్పిపుచ్చుతూ ప్రజల దృష్టిని మళ్లించడంకోసమే విభజన గాయాలను గుర్తుచేస్తూ సెంటిమెంట్‌ను తెరమీదకు తెచ్చారన్న అభిప్రాయం సమావేశంలో పాల్గొన్న అధికారుల్లో వ్యక్తమైంది.
రెండో తేదీన నవ నిర్మాణ దీక్ష
జూన్ రెండో తేదీన నవ నిర్మాణ దీక్ష నిర్వహించి ప్రజల్లో కసి, స్ఫూర్తి రగిలించి ఉత్తమ ఫలితాలు సాధించాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదని, 13 జిల్లాల ప్రజల కార్యక్రమమని తెలిపారు. ఇది ఉత్సవం కాదని, అన్యాయంగా విభజన చేసిన వారు సైతం అసూయపడేలా రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం అయ్యేందుకే ఈ దీక్ష చేపడుతున్నట్లు చెప్పారు. ఆరోతరగతి ఆపై చదివే విద్యార్థులందరినీ ఇందులో భాగస్వాములను చేయాలన్నారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ అనుసరించిన నియంతృత్వ వైఖరికి నిరసనగానే 125 ఏళ్ల చరిత్ర ఉన్న ఆ పార్టీని ప్రజలు చిత్తుగా ఓడించారని వ్యాఖ్యానించారు.
రాజధాని ఎంపిక పేరుతో శివరామకృష్ణన్ కమిటీ వేసి మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని చూశారని దుయ్యబట్టారు. రాజధాని విషయంలో తాము చెప్పిన మాటను ప్రజలు నమ్మారని ఉద్ఘాటించారు. ఇప్పటికీ రాష్ట్ర అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం సహకరించడంలేదని, భావోద్వేగాలు రెచ్చగొట్టే ధోరణితోనే ముందుకెళుతోందని విమర్శించారు. హైదరాబాద్ నుంచి ఉద్యోగులు ఏపీకి వెళ్లి దీక్షలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. నవనిర్మాణ దీక్ష నేపథ్యంలో అయిదు రోజులపాటు తమ పాలనపై ప్రగతి నివేదిక (ప్రోగ్రెస్ రిపోర్టు)ను ప్రజల్లో పెడతామన్నారు. మూడో తేదీ ‘జన్మభూమి - మాఊరు’ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఆర్థిక శాఖలో నిధులన్నీ ఇక ఆన్‌లైన్ ద్వారానే విడుదల చేస్తామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. పలువురు మంత్రులతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వడదెబ్బ మృతుల కుటుంబాలకు రూ.లక్ష పరిహారం
రాష్ట్రంలోని వడదెబ్బ మృతులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. వడదెబ్బ వల్ల మృతి చెందిన ప్రతి వ్యక్తి కుటుంబానికి రూ.లక్ష పరిహారం ప్రకటించనున్నట్టు సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు.