సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి నాలుగేళ్లు కావస్తోంది. కాని పోలీస్ శాఖలో విభజన మాత్రం సాగదీత ధోరణిలోనే ఉంది. రాష్ట్ర స్థాయి కేడర్‌గా ఉన్న డీఎస్పీ, అదనపు ఎస్పీ, నాన్ కేడర్ ఎస్పీ అధికారుల విభజన పెండింగ్‌లోనే ఉండిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో రూపొందించిన సీనియారిటీ జీవోలు 54, 108 కారణంగా తాము అన్యాయానికి గురయ్యామంటూ గ్రూప్–1 డీఎస్పీలు, ప్రమోటీ అధికారులు ఒకరిపై ఒకరు కోర్టుకెళ్లారు. సీనియారిటీ జాబితా సవరించి అధికారుల విభజన పూర్తి చేయాలని 2015లో హైకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే ఇప్పటి వరకు ఇరు రాష్ట్రాల పోలీస్ ఉన్నతాధికారుల్లో చలనం లేకుండా పోయింది. సీనియారిటీ సమీక్ష పేరుతో ఏళ్ల పాటు కాలయాపన చేస్తూ సమస్యను జటిలం చేస్తున్నారే తప్ప.. పరిష్కార మార్గాలు వెతకడం లేదు.
మూడేళ్లుగా ప్యానల్ పెండింగ్
సీనియారిటీ జాబితా సవరించి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఐపీఎస్ అధికారుల కొరత తీర్చేందుకు ఇరు రాష్ట్రాల పోలీస్ ఉన్నతాధికారులు ముందుకు కదలకపోవడంతో అధికారుల పదోన్నతులపై నీలినీడలు ఏర్పడ్డాయి. మూడేళ్లుగా (2015 నుంచి 2017 వరకు) కేంద్రానికి వెళ్లాల్సిన కన్ఫర్డ్ ఐపీఎస్ ప్యానల్ జాబితా పెండింగ్‌లోనే ఉండిపోయింది. ఇరు రాష్ట్రాల్లో ఐపీఎస్ అధికారుల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో.. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు సీనియారిటీ జాబితాను సవరించి ప్యానల్‌ను పంపించాల్సి ఉంది. కానీ ఇది జరగలేదు. 2007 గ్రూప్–1 అధికారులు కన్ఫర్డ్ ఐపీఎస్‌గా పదోన్నతి పొందాల్సి ఉంది. వీరు పదోన్నతి పొందితే పోలీస్ శాఖకు ఎస్పీ హోదా కలిగిన ఐపీఎస్ అధికారులు 24 మంది కీలకమవుతారు.
ఇద్దరు డీజీపీలు మారారు..
రెండు రాష్ట్రాల్లో ఇద్దరు డీజీపీలు మారిపోయారు. ఇక్కడ అనురాగ్ శర్మ, అక్కడ జేవీ రాముడు ఇద్దరు విభజన అంశాలను పూర్తి స్థాయిలో గట్టెక్కించలేకపోయారన్న ఆరోపణ ఉంది. అయితే ఇప్పుడున్న డీజీపీలు మహేందర్‌రెడ్డి, సాంబశివరావు అయినా సీనియారిటీ జాబితాను పరిష్కరించి కన్ఫర్డ్ ఐపీఎస్ ప్యానల్ ప్రతిపాదనలతోపాటు ప్రమోటీ అధికారులకు సరైన స్థానం కల్పించేందుకు కృషి చేయాల్సి ఉంది.
ఎన్నాళ్లీ అడ్‌హాక్ పదోన్నతులు
సీనియారిటీ జాబితా సవరించకుండా విచక్షణ అధికారాల పేరుతో రెండు రాష్ట్రాల్లో ఇష్టారాజ్యంగా అడ్‌హాక్ పదోన్నతులు కల్పించారు. ఏ అధికారి కూడా రెగ్యూలర్ పోస్టులో పదోన్నతి పొందింది లేదు. ఇటీవల తెలంగాణలో గ్రూప్–1 అధికారులు, ప్రమోటీలు మొత్తం అడ్‌హాక్ పద్ధతిలోనే ప్రమోషన్ పొందారు. అదే సీనియారిటీ జాబితా క్లియర్ అయితే వారందరికీ రెగ్యులర్ పదోన్నతి కింద సీనియారిటీ స్థానం నిర్ధారించాల్సి ఉంటుంది. దీని వల్ల ప్రమోషన్లు రావాల్సిన మిగతా అధికారులకు కూడా న్యాయం జరిగే అవకాశం ఉంది.
‘విభజన’ రభస ఇంకెన్నాళ్లు?
Published Mon, Dec 11 2017 4:00 AM | Last Updated on Mon, Dec 11 2017 4:20 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment