జిల్లా ఎస్పీలకు డీజీపీ సవాంగ్‌ దిశా నిర్దేశం  | Gautam Sawang Comments On Village Defense Squads | Sakshi
Sakshi News home page

ఆలయ ఘటనల్లో అలక్ష్యం వద్దు

Published Wed, Jan 20 2021 3:51 AM | Last Updated on Wed, Jan 20 2021 6:48 AM

Gautam Sawang Comments On Village Defense Squads - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న ఆలయ ఘటనల పట్ల ఏ మాత్రం అలక్ష్యం వహించవద్దని, అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తూ వాటిని ఛేదించి మత సామరస్యాన్ని కాపాడాలని డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌ రాష్ట్ర పోలీస్‌ యంత్రాంగాన్ని ఆదేశించారు. మంగళగిరి పోలీస్‌ ప్రధాన కార్యాలయం నుంచి మంగళవారం ఆయన జిల్లాల ఎస్పీలు, కమిషనర్‌లతో వెబినార్‌ నిర్వహించారు. రాష్ట్రంలో దేవాలయాలకు సంబంధించి ఇప్పటి వరకు జరిగిన ఘటనలపై కేసుల నమోదు, దర్యాప్తు, నిందితుల అరెస్టులతోపాటు గ్రామ రక్షణ దళాల (విలేజ్‌ డిఫెన్స్‌ స్క్వాడ్స్‌) ఏర్పాటుపై సమీక్షించారు.

శాంతిభద్రతల ఏడీజీ రవిశంకర్‌ అయ్యన్నార్, సిట్‌ చీఫ్‌ జీవీజీ అశోక్‌కుమార్‌ తదితర ఐపీఎస్‌ అధికారులతో కలిసి ఆలయాల భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో పథకం ప్రకారం జరిగే ఆలయ విధ్వంస ఘటనలకు అడ్డుకట్ట వేసేలా సమన్వయంతో పని చేయాలన్నారు. ఆలయాలపై దాడుల్లో రాజకీయ దురుద్ధేశాలు బయట పడుతున్నందున, ఆయా ఘటనల్లో రాజకీయ ప్రమేయాన్ని ఏ మాత్రం ఉపేక్షించవద్దన్నారు. సమాజంలో దేవుడి సెంటిమెంట్‌ను ఉపయోగించుకుని అలజడి రేపి, రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేసే వారిని ఆధారాలతో సహా గుర్తించి ప్రజలకు తెలియజెప్పాలని సూచించారు. ఈ సందర్భంగా డీజీపీ ఇంకా ఏమన్నారంటే.. 

కుట్రలను భగ్నం చేయాలి 
► రాజకీయ లబ్ధి కోసం మత సామరస్యాన్ని దెబ్బ తీసేలా జరిగే కుట్రలను ఛేదించి, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో వెనుకాడకూడదు.  
► సెప్టెంబర్‌ తర్వాత జరిగిన ఘటనల దర్యాప్తునకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటు చేసింది. 
► సిట్‌తోపాటు రెవెన్యూ, దేవదాయ శాఖలతో పోలీసు శాఖ సమన్వయంతో పని చేయాలి. గ్రామాల్లో దేవాలయాలు, మతపరమైన సంస్థల రక్షణకు ప్రజల సహకారం తీసుకోవాలి.  
► గత నాలుగు నెలల్లో 59,529 మత పరమైన సంస్థలను గుర్తించి జియో ట్యాగింగ్‌  చేశాం. ఇప్పటి వరకు 16,712 గ్రామ రక్షణ దళాలను ఏర్పాటు చేశాం. 212 కేసుల్లో 180 కేసులను ఛేదించి 337 మందిని అరెస్టు చేశాం. 
► ఆలయ ఘటనల్లో క్లూస్‌ ముఖ్యమని, నేరం జరిగిన వెంటనే క్లూస్‌పై దృష్టి పెట్టాలని సిట్‌ చీఫ్‌ జీవీజీ అశోక్‌కుమార్‌ సూచించారు.  

ధైర్యసాహసాలు ప్రదర్శించిన వారికి అభినందనలు 
గుంటూరులో కుసుమ హరనాథ్‌ దేవాలయంలో చొరబడిన దుండగులను పట్టుకునేందుకు ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించిన అర్చకుడి భార్య హైమావతి, శ్రీకాకుళం జిల్లాలో సరస్వతి దేవి, నంది విగ్రహాల విధ్వంసం విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ సోషల్‌ మీడియాలో జరిగిన దు్రష్పచారాన్ని గుర్తించి పోలీసులను అప్రమత్తం చేసిన రమణ, శ్రీనివాసులు, శ్రీరాములకు అభినందనలు తెలియజేస్తున్నాం. 

గ్రామ రక్షణ దళాల ఏర్పాటు అభినందనీయం  
రాష్ట్ర పోలీస్‌ శాఖ గ్రామ రక్షణ దళాలు (విలేజ్‌ డిఫెన్స్‌ స్క్వాడ్స్‌) ఏర్పాటు చేస్తుండటం అభినందనీయం. ఆలయాలను కాపాడుకునేందుకు మంచి వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ కమిటీల్లో పని చేయడానికి మహిళలు కూడా ముందుకు రావడం ఆదర్శనీయం. (ఈ మేరకు చిన్న జీయర్‌ ప్రసంగం వీడియోను వెబినార్‌లో ప్రదర్శించారు)  
– ఇటీవల కర్నూలు జిల్లా పర్యటనలో శ్రీ త్రిదండి చిన్న జీయర్‌ స్వామి   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement