ఇద్దరు సీఎంల కనుసన్నల్లోనే | both chief ministers have to take care of employees distribution | Sakshi
Sakshi News home page

ఇద్దరు సీఎంల కనుసన్నల్లోనే

Published Sun, Jun 1 2014 7:34 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

ఇద్దరు సీఎంల కనుసన్నల్లోనే - Sakshi

ఇద్దరు సీఎంల కనుసన్నల్లోనే

 శాశ్వత విభజన పంపిణీలన్నీ వారి ఆధ్వర్యంలోనే..
- పంపిణీ చేయాల్సిన మొత్తం రాష్ట్ర కేడర్ పోస్టులు 65 వేలు మాత్రమే
- ఇందులో ఖాళీలు 18,000 పోను ఉద్యోగుల పంపిణీ 47 వేలు మాత్రమే
- శాశ్వత పంపిణీ అయ్యే వరకు రెండు రాష్ట్రాల్లో రాష్ట్ర కేడర్ పోస్టుల పదోన్నతులు బంద్
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల శాశ్వత పంపిణీ దగ్గర నుంచి విభజనకు సంబంధించిన ఇతర పంపిణీలన్నీ ఇక రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కనుసన్నల్లోనే జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజనకు మూడు నెలల గడువు విధించగా రికార్డు సమయంలో విభజన లెక్కలు కొలిక్కితెచ్చారు. గతంలో రాష్ట్రాల విభజన జరిగినప్పుడు ప్రక్రియకు కేంద్రం ఏడాది పాటు సమయమిచ్చింది. ఇప్పుడు మూడు నెలలే గడువు ఇవ్వగా, విభజన తేదీ ఖరారైన తర్వాత ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు వచ్చిపడ్డాయి. ఆ ఎన్నికల నిర్వహణతో పాటు రాష్ట్ర విభజన అంశాలపై ఆర్థికశాఖతో పాటు ప్రభుత్వ యంత్రాంగమంతా సమాంతరంగా పనిచేసింది.
 
రాష్ట్ర విభజన నేపథ్యంలో అన్ని స్థాయిల్లో రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సిన రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగుల సంఖ్య 65 వేలుగా ఆర్థికశాఖ తేల్చింది. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి పి.వి.రమేశ్ ఉద్యోగుల స్థానికత, పోస్టుల మంజూరు, సీనియారిటీ లెక్కలను సేకరించడంలో కీలక పాత్ర నిర్వహించారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండటంతో తక్కువ సమయంలోనే లక్షల సంఖ్యలో ఉద్యోగుల వివరాలను సేకరించగలిగామని, ఈ విభజన పని కొత్త అనుభవాన్ని నేర్పిందని ఆయన సంతృప్తి వ్యక్తంచేశారు. రాష్ట్ర విభజన, ఉద్యోగుల తాత్కాలిక పంపిణీ ఒక కొలిక్కి వచ్చిన నేపథ్యంలో రమేశ్ శనివారం తనను కలిసిన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
 
మిగతా వారంతా ఆంధ్రా సర్కారులో పనిచేస్తున్నట్లే...
ప్రస్తుతం సచివాలయంతో పాటు రాజధానిలోని శాఖాధిపతుల కార్యాలయాల్లో తెలంగాణ ప్రభుత్వంలో పనిచేయడానికి ఉద్యోగులను తాత్కాలికంగా కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిందని రమేశ్ పేర్కొన్నారు. శాశ్వత పంపిణీ అయ్యేవరకు మిగతా ఉద్యోగులందరూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తారన్నారు. ఐఏఎస్ అధికారుల్లో 44 మందిని తెలంగాణలో పనిచేయడానికి తాత్కాలికంగా కేటాయించారని, శాశ్వత పంపణీ అయ్యేవరకు మిగతా ఐఏఎస్ అధికారులందరూ ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్నట్లేనని ఆయన వివరించారు.
 
ఉద్యోగుల స్థానికతకు రాష్ట్రపతి ఉత్తర్వులే ప్రామాణికంగా తీసుకున్నామని, సంబంధిత శాఖాధిపతుల నుంచి స్థానికత, సీనియారిటీలపై లిఖిత పూర్వకంగా సర్టిఫికేషన్ తీసుకున్నామని ఆయన తెలిపారు. సచివాలయంలో సింగిల్ యూనిట్ శాఖల్లో 193 మంది స్థానికతపై అభ్యంతరాలు వస్తే రికార్డులన్నింటినీ పరిశీలించామని.. అభ్యంతరాల్లో వాస్తవం లేదని తేలిందని వివరించారు. తాత్కాలిక కేటాయింపులపై కూడా అభ్యంతరాలుంటే రెండు రాష్ట్రాల సీఎస్‌ల నేతృత్వంలో సమస్యల పరిష్కార కమిటీకి దరఖాస్తు చేసుకోవచ్చునని.. వాటిపై కేంద్రం కూడా పక్షం రోజుల్లో పరిష్కారం చూపుతుందని ఆయన తెలిపారు.
 
శాశ్వత పంపిణీ పూర్తయ్యే వరకూ పదోతన్నతుల్లేవు...
పంపిణీ పరిధిలోకి వచ్చే రాష్ట్ర కేడర్ పోస్టుల్లోని ఉద్యోగులెవరికీ శాశ్వత పంపిణీ పూర్తయ్యే వరకు పదోన్నతులు ఇవ్వరాదని, అలాగే ఆ పోస్టుల స్థాయిని మార్చరాదని రమేశ్ స్పష్టంచేశారు. ఇది రెండు రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు, పోస్టులకు వర్తిస్తుందని తెలిపారు. ఉద్యోగుల శాశ్వత పంపిణీకి ఆరు నెలల నుంచి ఏడాది పాటు సమయం పట్టవచ్చునని అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల శాశ్వత పంపిణీకి మార్గదర్శకాలను త్వరలోనే కేంద్రం జారీ చేస్తుందని, దాని ప్రకారం కమలనాథన్ కమిటీ రెండు రాష్ట్రాల్లో ప్రతి విభాగంలో కేడర్ సంఖ్యను, సీనియారిటీ, రూల్ ఆఫ్ రిజర్వేషన్‌తో పాటు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఉద్యోగుల తుది పంపిణీ చేస్తుందని వివరించారు. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం కేవలం రాష్ట్ర కేడర్ పోస్టులను మాత్రమే విభజించాలని చెపుతోందని ఆయన పేర్కొన్నారు.
 
‘ఓపెన్’ నియామక ఉద్యోగులు ఎక్కడివారక్కడే...
ఇరు రాష్ట్రాల్లో ఓపెన్ కేటగిరిల్లో నియామకమైన ఉద్యోగుల పంపిణీ ఉండదని, ఎక్కడి వారు అక్కడే పనిచేయాల్సి ఉందని రమేశ్ తెలిపారు. ఒక వేళ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరస్పరం చర్చించుకుని ఓపెన్ కేటగిరిలో రిక్రూట్ అయిన ఉద్యోగులను ఎవరి ప్రాంతాలకు వారిని బదిలీ చేసుకోవాలనుకుంటే సాధ్యం అవుతుందని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. వివిధ కేంద్ర పథకాలు, ప్రాజెక్టుల్లో కాంట్రాక్టు, ఇతర విధానాల్లో నియామకమైన ఉద్యోగులపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
 
రాష్ట్రంలో ఉద్యోగుల వివరాలివీ...
- సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 12.49 లక్షల ప్రభుత్వ పోస్టులున్నాయి. ఇందులో 2.57 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం 9.92 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
- వీటిలో రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టులు 65,000
- మల్టీ జోనల్ పోస్టులు 6,600
- జోనల్ పోస్టులు 1.43 లక్షలు
- జిల్లా కేడర్ పోస్టులు 10.32 లక్షలు
- రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టులు 65 వేలల్లో 18,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన 47 వేల పోస్టులను మాత్రమే రాష్ట్ర విభజనలో పంపిణీ చేయనున్నారు.
- ఆర్థికశాఖ లెక్కల ప్రకారం రాజధానిలోని శాఖాధిపతుల్లో ఆంధ్రప్రదేశ్‌కు మంజూరైన పోస్టుల కన్నా 2,360 మంది ఉద్యోగులు తక్కువగా ఉన్నారు. అదే తెలంగాణకు మంజూరైన పోస్టుల కన్నా 3,731 మంది ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు.
- సచివాలయంలో ఆంధ్రప్రదేశ్‌కు మంజూరైన పోస్టుల కన్నా 499 మంది ఉద్యోగులు తక్కువగా ఉన్నారు. అదే తెలంగాణకు మంజూ రైన పోస్టుల కన్నా 548 మంది ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement