తాత్కాలిక కేటాయింపులే! | employees allotment temporary | Sakshi
Sakshi News home page

తాత్కాలిక కేటాయింపులే!

Published Sat, May 31 2014 1:59 AM | Last Updated on Sat, Sep 2 2017 8:05 AM

employees allotment temporary

 సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ జారీ చేసిన ఆదేశాల ప్రకారం తాము చేసే తాత్కాలిక కేటాయింపుల మేరకు ఇరు ప్రాంత ఉద్యోగులు పని చేయాల్సిందేనని పేర్కొంది. శుక్రవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆయన ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. ఆప్షన్లు ఇవ్వాలన్న సీమాంధ్ర ఉద్యోగ సంఘాలకు గానీ.., స్థానికత, మంజూరైన పోస్టుల ఆధారంగా విభజన చేపట్టాలన్న తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలకుగానీ ఎలాంటి హామీ ఇవ్వలేదు. స్థానికత ఆధారంగా చేస్తామని చెబుతున్నా.. రెండు రాష్ట్రాల్లో పరిపాలన అవసరాల దృష్ట్యా పని చేస్తున్న వారినే విభజించాల్సి వస్తోందని సీఎస్ పేర్కొన్నారు. అందరికీ న్యాయం చేసేందుకు కృషి చేశామని చెబుతూ సమావేశాన్ని ముగించడంతో ఉద్యోగ సంఘాలు ఆందోళనలో పడ్డాయి. సమావేశం నుంచి బయటకు వస్తూనే తెలంగాణ ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఎక్కడి వారు అక్కడే పనిచేసేలా చర్యలు చేపట్టాలంటూ ఉద్యోగ సంఘాల నేతలు నినాదాలు చేశారు.
 
 పని చేస్తున్న ఉద్యోగుల ఆధారంగానే: సచివాలయం, శాఖాధిపతి కార్యాలయాల్లో మంజూరైన పోస్టుల ఆధారంగా కాకుండా ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులను 58.32 : 41.68 నిష్పత్తిలో విభజించనున్నారు. ఈ మేరకు జూన్ 1న ఉత్తర్వులు జారీ కానున్నాయి. దీంతో కొందరు కొందరు తెలంగాణ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్‌లో, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు తెలంగాణలో పని చేయాల్సి ఉంటుంది. మరో మూడు నెలల్లో శాశ్వత కేటాయింపులు ఉంటాయని, అంతవరకు ఈ కేటాయింపులు వర్తిస్తాయని సీఎస్ స్పష్టంచేశారు. అయితే ఉద్యోగ సంఘాల నేతల విషయంలో ఎక్కడివారిని అక్కడే పనిచేసేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అయితే ఇది ఎంతవరకు ఆచరణకు నోచుకుంటుందోనని సంఘాల నేతలే చెబుతున్నారు. రెండు ప్రభుత్వాలు కొలువుదీరాక కేంద్రం ఏర్పాటు చేసే సమన్వయ కమిటీ ప్రత్యేకంగా గ్రీవెన్స్‌సెల్ ఏర్పాటు చేస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఈ సెల్ ఉద్యోగుల సమస్యలను పరిశీలించి న్యాయం చేస్తుందని హామీనిచ్చింది. కేటాయింపులపై అభ్యంతరాలు ఉంటే జూన్ 9లోపు తెలపాలని పేర్కొంది. కాగా, జూన్ 1 తేదీనే తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా అనురాగ్ శర్మ, హైదరాబాద్ నగర కమిషనర్‌గా ఎం.మహేందర్‌రెడ్డిని నియమిస్తూ ఆదేశాలు వెలువడనున్నాయని తెలిసింది. సీఎస్‌తో జరిగిన భేటీలో టీఎన్‌జీవో, టీజీవో, ఉపాధ్యాయ సంఘాల నేతలతోపాటు తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్, జూనియర్ లెక్చరర్ల సంఘం ప్రధాన కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 పారదర్శకత లేదు: దేవీప్రసాద్

 ఉద్యోగుల విభజనలో పారదర్శకత లేదని, ఎంతమంది ఉద్యోగులు ఎటు వెళ్తున్నారనే విషయంలో స్పష్టత లేకుండా పోయిందని టీఎన్‌జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ విమర్శించారు. కేంద్రం సరైన సమయంలో మార్గదర్శకాలను ఇవ్వలేదని, పనిచేస్తున్న వారి సంఖ్య ఆధారంగా విభజన చేయడం వల్ల ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొన్నారు. చాలా మంది సీమాంధ్ర ఉద్యోగులు నకిలీ సర్టిఫికెట్లతో తెలంగాణలో కొనసాగేందుకు ప్రయత్నిస్తున్నారని, కమలనాథన్ కమిటీకి ఈ వివరాలు అందజేశామని చెప్పారు. జూన్ 2 నుంచి 8 వరకు తెలంగాణ ఆవిర్భావ వేడుకలను గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు నిర్వహిస్తామని తెలిపారు.
 
 తెలంగాణకు ఒకటిన్నర రోజు వేతనం..
 
 తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తమ ఒకటిన్నర రోజు వేతనాన్ని (దాదాపు రూ.60 కోట్లు) విరాళంగా ఇవ్వాలని నిర్ణయించాయి. ఇందులో ఒకరోజు వేతనం తెలంగాణ ప్రభుత్వానికి (ముఖ్యమంత్రి సహాయ నిధికి), సగం రోజు వేతనాన్ని అమరవీరుల కుటుంబాలను ఆదుకునేందుకు ఇవ్వాలని నిర్ణయించినట్లు దేవీ ప్రసాద్ తెలిపారు.
 
 మళ్లీ తీసుకువస్తాం: శ్రీనివాస్‌గౌడ్
 
 తెలంగాణ ఉద్యోగులు తాత్కాలికంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేయాల్సి వచ్చినా వారిని మళ్లీ తెలంగాణకు తీసుకువస్తామని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం వ్యవస్థాక అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. సీమాంధ్రులు కూడా స్వచ్ఛందంగా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని, వారిని అక్కడికి పంపించాలని పేర్కొన్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి ఎన్‌టీఆర్ పేరు కాకుండా ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టాలన్నారు.
 
 ముందుగా ఇవ్వాల్సింది: విఠల్
 
 కేంద్ర మార్గదర్శకాలను ముందుగా ఇస్తే ఇంత గందరగోళం ఉండేది కాదని తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్ పేర్కొన్నారు. ఇప్పుడు చాలా మంది సీమాంధ్రులు ఇక్కడే ఉండే పరిస్థితి వచ్చిం దన్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రాలో పనిచేయడానికి సిద్ధంగా లేనని చెప్పారు.
 
 స్థానికేతరుల్లో వేల మంది టీచర్లు..
 
 హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సీమాంధ్రకు చెందిన వేల మంది టీచర్లు హైదరాబాద్, రంగారెడ్డి పరిసర జిల్లాల్లో ఉన్నారని పీఆర్‌టీయూ అధ్యక్షుడు పి.వెంకట్‌రెడ్డి, పీఆర్‌టీయూ-తెలంగాణ అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ రెండు జిల్లాల్లోనే స్థానికేతరులు 50 శాతానికిపైగా ఉన్నారన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement