ఢిల్లీలో పర్యటించి ఏం సాధించారు?
- సీఎం చంద్రబాబుపై ఎంపీ మిథున్‌రెడ్డి ధ్వజం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన చట్టంలో పొందుపర్చిన హామీలను అమలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవటంలో ఏపీ సీఎం చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని వైఎస్సార్‌సీపీ ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఢిల్లీలో పర్యటించి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులను కలిసిన సీఎం ఏం సాధించారో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
‘రాష్ట్రంలో రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉందని చంద్రబాబు గద్దె నెక్కినప్పటి నుంచీ పదేపదే చెబుతున్నారు. మరో నెలలో కేంద్రం కొత్త బడ్జెట్‌ను ప్రవేశ పెట్టబోతోంది. ప్రధాని, ఆర్థిక మంత్రిని కలిసినపుడు నిర్దిష్టమైన తేదీలోగా రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని ఏమైనా హామీ ఇచ్చారా? కొత్త బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న తరుణంలో ఈ రూ. 16 వేల కోట్లు తేగలరా? లేదా?’ అని మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీల విషయంలో ఎలాంటి పురోగతి లేదన్నారు.
చిత్తూరు జిల్లా మన్నవరం వద్ద మంజూరైన మన్నవరం బీహెచ్‌ఈఎల్ ప్రాజెక్టు నిర్మాణం ప్రహరీ గోడ ఏర్పాటుకే పరిమితమైందన్నారు. వైఎస్సార్ జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు అతీగతీ లేకుండా పోయిందన్నారు. చిత్తూరులో చక్కెర కార్మాగారాన్ని మూసి వేస్తున్నట్లు రైతులకు నోటీసులు ఇవ్వటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న హామీ మాట దేవుడెరుగు సీఎం సొంత జిల్లాలోనే ఫ్యాక్టరీ కాపాడుకోలేకపోవడం దారుణమని విమర్శించారు.
ఒక్క ప్రాజెక్టైనా సాధించారా?
‘విభజన చట్టంలో గ్రీన్‌ఫీల్డ్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీని నెలకొల్పుతామన్నారు. దానిపై ఎలాంటి పురోగతి లేదు. విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏమైందో తెలియదు. విశాఖపట్నం, తిరుపతి, విజయవాడలో అంతర్జాతీయ విమానాశ్రయాలను నిర్మిస్తామన్నారు. విమానయాన మంత్రి మన రాష్ట్రానికి చెందినవారైనా ఫలానా తేదీలోగా అంతర్జాతీయ హోదా కల్పిస్తామని చెప్పలేని దుస్థితిలో ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు కాగితాలకే పరిమతిమైంది. దీనికి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా నిధులివ్వలేదు’ అని మిథున్ విమర్శించారు. వెంకయ్యనాయుడు కేంద్రమంత్రిగా ఉన్నా చంద్రబాబు కేంద్రం నుంచి ఏమీ సాధించలేకపోయారని విమర్శించారు.