సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో అనేకమంది ఇంటర్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యకు ఇంటర్మీడియెట్ బోర్డు ‘ఫ్రీ ఫ్లో’ ద్వారా పరిష్కారాన్ని చూపింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ, ఏపీప్రాంతాల్లో ఇంటర్ ఫస్టియర్ చదివిన విద్యార్థులు రాష్ట్ర విభజనతో ఇబ్బందుల్లో పడ్డారు. ఫస్టియర్ ఎక్కడ చదివారో సెకండియర్ కూడా అదే రాష్ట్రం బోర్డు నుంచి రాయాలి. రాష్ట్ర విభజనతో మొదటి సంవత్సరం చదివిన ఏపీలోని విద్యార్థులు తెలంగాణకు, తెలంగాణలోని విద్యార్థులు ఏపీకి వెళ్లేందుకు ఆస్కారం లేకుండా పోయింది.
టెన్త్ వరకు ఒకచోట చదివి ఇంటర్ వేరే చోట చదివినప్పుడు స్థానికతతోపాటు మరిన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో సొంత రాష్ట్రంలో ఇంటర్ సెకండియర్ పరీక్ష రాయాలనుకున్న వారికి కష్టాలు తప్పలేదు. కొంతమంది హైదరాబాద్‌లోని కాలేజీల్లో ఫస్టియర్ చదివి సెకండియర్ ఏపీలోని కాలేజీల్లో చేరడానికి వెళ్లినా మళ్లీ ఫస్టియర్ పరీక్షలు రాయాల్సిందేనని అక్కడి కాలేజీలు స్పష్టం చేశాయి.
ఈ వ్యవహారంపై ఏపీ ఇంటర్‌బోర్డు కార్యదర్శి ఎంవీ సత్యనారాయణ, తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్‌తో చర్చించారు. ఒక రాష్ట్రం నుంచి వేరేగా కొత్త రాష్ట్ర ఏర్పాటు సమయంలో రెండు రాష్ట్రాల మధ్య ‘ఫ్రీ ఫ్లో’ విధానం అమలు చేయడానికి ఆస్కారమున్నందున దాన్ని అనుసరించాలని నిర్ణయించారు.
ఫ్రీ ఫ్లో అంటే?
ఒక రాష్ట్రంలో చదివిన విద్యార్థి తదుపరి తరగతులను కొత్త రాష్ట్రంలో కొనసాగించడానికి ‘ఫ్రీ ఫ్లో’ విధానం అవకాశమిస్తుంది. ఆయా విద్యార్థుల సమాచారాన్ని ఆయా రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకొని తదుపరి తరగతులు, పరీక్షలకు అనుమతించాలి. దీనికి సంబంధించి ఏపీ ఇంటర్ బోర్డు కార్యదర్శి సత్యనారాయణ ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం ఆమో దం తెలిపింది.
తెలంగాణ బోర్డు కార్యదర్శి కూడా సంబంధిత ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం. ఆ ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే ఇరు రాష్ట్రాల మధ్య మార్పును కోరుకునే ఇంటర్ విద్యార్థుల సమాచార మార్పిడికి అవకాశముంటుంది. ఏపీలో ఫ్రీ ఫ్లో విధానానికి వీలుగా ఏర్పాట్లు చేశామని ఇంటర్ బోర్డు కార్యదర్శి వెల్లడించారు.
ఇంటర్మీడియెట్‌లో ‘ఫ్రీ ఫ్లో’
Published Mon, Nov 30 2015 3:52 AM | Last Updated on Sun, Sep 3 2017 1:13 PM
Advertisement
Advertisement