ఇంటర్మీడియట్‌లో మరో 1,137 మంది పాస్‌ | 1137 Telangana Intermediate students passed after re-verification | Sakshi
Sakshi News home page

ఇంటర్మీడియట్‌లో మరో 1,137 మంది పాస్‌

Published Tue, May 28 2019 1:58 AM | Last Updated on Tue, May 28 2019 7:35 AM

1137 Telangana Intermediate students passed after re-verification - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ పరీక్ష పేపర్ల రీవెరిఫికేషన్‌లో 1,137 మంది విద్యార్థుల భవిత మారింది. తొలుత విడుదల చేసిన ఫలితాల్లో వారంతా ఫెయిల్‌ కాగా, రీవెరిఫికేషన్‌లో ఉత్తీర్ణులయ్యారు. ఈ విషయాన్ని ఇంటర్మీడియట్‌ బోర్డు సోమవారం రాత్రి ప్రకటించింది. ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో తప్పుల నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు పరీక్షల్లో ఫెయిలైన 3,82,116 మంది విద్యార్థులకు చెందిన 9,02,429 జవాబు పత్రాలను రీవెరిఫికేషన్‌ చేయడానికి బోర్డు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. వార్షిక పరీక్షల్లో ఫెయిలైన 1,137 మంది విద్యార్థులు రీవెరిఫికేషన్‌లో ఉత్తీర్ణులైనట్టు బోర్డు తెలిపింది. వీరిలో ప్రథమ సంవత్సర విద్యార్థులు 552 మంది ఉండగా, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 585 మంది ఉన్నట్లు వెల్లడించింది.

19,788 మంది విద్యార్థుల జవాబు పత్రాలను మినహా మిగతావారి జవాబు పత్రాలను స్కాన్‌ చేసి వెబ్‌సైట్‌లో (http://bie.telangana.gov.in/)అందుబాటులో ఉంచుతామని ప్రకటించింది. ఈ స్కానింగ్‌ కాపీలను మంగళవారం ఉదయంలోగా వెబ్‌సైట్‌లో పెట్టే అవకాశం ఉంది. మిగిలిన 19,788 మంది విద్యార్థుల జవాబు పత్రాలను స్కానింగ్‌ పూర్తయ్యాక అందుబాటులోకి తెస్తామని వెల్లడించింది. రీవెరిఫికేషన్‌లో భాగంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ పద్ధతిలోనూ జవాబుపత్రాల పరిశీలన జరిపినట్లు పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో 23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోగా, మరో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యాయత్నం చేసినట్లు బోర్డు వెల్లడించింది. ఆత్మహత్య చేసుకున్న 23 మందిలో 20 మంది విద్యార్థులు రీవెరిఫికేషన్‌లోనూ ఫెయిలైనట్టు తెలిపింది. మరో ఇద్దరు విద్యార్థులు అంతకుముందే ఉత్తీర్ణులయ్యారని పేర్కొంది. ఒక విద్యార్థి 3 పరీక్షల తర్వాత ఆత్మహత్య చేసుకుందని, ఆమె ఆ మూడు సబ్జెక్టుల్లోనూ పాస్‌ అయిందని వివరించింది.

జూన్‌ 12 తర్వాత ఫీజు వెనక్కి...
ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయి రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌ కోసం ఫీజు చెల్లించిన 21,537 విద్యార్థుల ఫీజులను వచ్చే నెల 12వ తేదీ తర్వాత తిరిగి ఇవ్వనున్నట్లు బోర్డు ప్రకటించింది. ఫెయిలైన విద్యార్థుల అందరి జవాబు పత్రాల రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌ను ఉచితంగానే చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో వారి ఫీజులను తిరిగి ఇస్తామని పేర్కొంది. మరోవైపు ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణులైనా.. తక్కువ మార్కులు వచ్చాయని రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకున్న వారి ఫలితాలను మూడు రోజుల్లో తమ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని బోర్డు వెల్లడించింది. కాగా, రీవెరిఫికేషన్‌లో మార్కులు పెరిగి పాస్‌ అయిన విద్యార్థులే కాకుండా మొదట్లో చాలా తక్కువ మార్కులు వచ్చి రీవెరిఫికేషన్‌లో మార్కులు పెరిగినా పాస్‌ కాని విద్యార్థులు వేలల్లో ఉంటారని తల్లిదండ్రులు అంటున్నారు. అలా ఎంతమందికి మార్కులు పెరిగాయో, వారి వివరాలను కూడా బోర్డు వెల్లడించాలని డిమాండ్‌ చేస్తున్నారు. తద్వారా ఎంతమంది విద్యార్థుల ఫలితాల్లో తప్పులు దొర్లాయో తెలుస్తుందని పేర్కొంటున్నారు. మరోవైపు తాజా ఫలితాల వెల్లడిలోనూ కొంచెం గందరగోళం చోటుచేసుకుంది. ఫలితాల్లో కొంతమంది విద్యార్థుల హాల్‌టికెట్‌ నంబర్లు రెండుమూడు సార్లు పునరావృతమయ్యాయి.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement