Telangana: Useful Tips To Prepare For Intermediate Exams - Sakshi
Sakshi News home page

Telangana Inter Exams: ఇష్టంతో రాస్తే ‘ఇంటర్‌’ యమ ఈజీ 

Published Mon, Oct 25 2021 11:56 AM | Last Updated on Mon, Oct 25 2021 2:41 PM

telangana:Useful Tips To Prepare For Intermediate Exams - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఫలితం గురించి పక్కనపెడితే.. ఇంటర్‌ పరీక్షల మానసిక ఒత్తిడిని తేలికగా జయించవచ్చని చెబుతున్నారు మానసిక నిపుణులు. ఫస్టియర్‌ పరీక్షలు మొదలవుతున్న వేళ... విద్యార్థులు మానసిక ఒత్తిడిని జయించేందుకు ప్రత్యేకంగా సైకియాట్రిస్ట్‌లను ఇంటర్‌ బోర్డు అందుబాటులోకి తెచ్చింది. ఫోన్ల ద్వారా వారిని సంప్రదించే ఏర్పాట్లు చేసింది. గత రెండు రోజులుగా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి పెద్ద సంఖ్యలో వారికి ఫోన్‌కాల్స్‌ వస్తున్నాయి.

ఇందులో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల నుంచే ఎక్కువగా ఉంటున్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా సరిగా వినలేకపోయామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్‌ కాలేజీల్లో చదివే విద్యార్థులు మాత్రం పోటీ పరీక్షల ఒత్తిడి నేపథ్యంలో ప్రస్తుత ఇంటర్‌ పరీక్షలపై ఆందోళన చెందుతున్నారు. వాళ్లు ఎదుర్కొంటున్న భయం, ఆందోళనను పారద్రోలేందుకు సైకియాట్రిస్ట్‌లు అనేక సూచనలు చేస్తున్నారు. 
చదవండి: కొనసాగుతున్న తెలంగాణ ఇంటర్‌ పరీక్షలు

గుర్తున్నది రాస్తే చాలు పాస్‌ గ్యారెంటీ 
‘కరోనా కారణంగా చాలా రోజులుగా మేం పల్లెటూళ్లోనే ఉన్నాం. ఆన్‌లైన్‌ క్లాసులు సరిగా వినలేదు. పరీక్షలు రాయగలమా? అనే ఆందోళన వెంటాడుతోంది’అని నిజామాబాద్‌ జిల్లా మారుమూల పల్లెకు చెందిన గోవింద్‌ కాల్‌ చేశాడు. అతని మానసిక స్థితి తెలుసుకునేందుకు సైకియాట్రిస్ట్‌ కొన్ని ప్రశ్నలు వేశాడు. తను చదివిన చాప్టర్స్‌లో అతను ఎంత పట్టు కలిగి ఉన్నాడో తెలిసిపోయింది. వాస్తవానికి ఇప్పుడా చాప్టర్లు మళ్లీ మననం చేసుకుంటే పాస్‌ గ్యారెంటీ. ఈ వాస్తవాన్ని చెప్పిన తర్వాత అతని మనసు కుదుటపడింది. తమకు వస్తున్న కాల్స్‌లో ఇలాంటివి చాలా ఉంటున్నాయని ఇంటర్‌ బోర్డ్‌ ఏర్పాటు చేసిన సైకియాట్రిస్టులు చెబుతున్నారు. నిజానికి విద్యార్థులు ఆన్‌లైన్‌లో నేర్చుకున్న చాప్టర్లనే రివిజన్‌ చేసుకుంటే పాస్‌ మార్కులొస్తాయని వారు అంటున్నారు. ఇలా కాకుండా చదువుకొని పాఠాల కోసం హైరానా పడొద్దని సూచిస్తున్నారు. 

తక్కువ సమయంలో ఎక్కువ స్కోరెలా? 
‘పరీక్షలే ఉండవనుకున్నాం. ఇప్పుడు రాయాల్సి వస్తోంది. ఇంత సమయంలో ఎలా?’అనేది సైకియాట్రిస్ట్‌లకు వచ్చే ఫోన్‌కాల్స్‌లో రెండో తరహా ప్రశ్న. ‘చదివిన చాప్టర్లలో ఎక్కువగా గుర్తుండిపోయే ప్రశ్నలపై ప్రధానంగా దృష్టి పెట్టాలి. ఆన్‌లైన్‌ క్లాసుల్లో బాగా అర్థమైన వాటిల్లోంచి ప్రశ్నలు ఎంచుకోవాలి. బోర్డు విడుదల చేసిన స్టడీ మెటీరియల్‌తో వీటిని పోల్చి చూసుకోవాలి. ఆ తర్వాత స్నేహితులు, లెక్చరర్లతో సాదాసీదా సంభాషణలో చర్చించిన చాప్టర్లను మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు నెమరు వేసుకోవాలి. సమయం ఉంటే స్నేహితులతో వీటిపై మళ్లీ చర్చించాలి’అని మానసిక నిపుణులు చెబుతున్నారు.

 

వెన్నుతడితే పరీక్షల్లో విజయం తేలికే.. 
ఇంటర్‌ పరీక్షను విద్యార్థి చాలా తేలికగా తీసుకునే వాతావరణం తల్లిదండ్రులే కలి్పంచాలన్నది మానసిక నిపుణుల అభిప్రాయం. రోజూ తల్లిదండ్రుల నుంచి 50 కాల్స్‌ వస్తున్నాయని ఓ సైకియాట్రిస్ట్‌ తెలిపారు. ఇందులో మధ్యతరగతి ఉద్యోగ వర్గాల వారివే ఎక్కువగా ఉంటున్నాయని చెబుతున్నారు. ‘అనివార్యంగానే ఇంటర్‌ పరీక్షలు పెడుతున్నట్లు అధికారులే చెప్పారు. దీన్ని జయించే మార్గాలనూ ఇంటర్‌ బోర్డు విద్యార్థుల ముందుంచింది. వీటిని అనుసరిస్తే చాలనే భావన తల్లిదండ్రులూ కల్పించాలి. పిల్లలు ఒత్తిడికి గురవుతుంటే.. సరైన రీతిలో దాన్ని దూరం చేసే బంధువులు, స్నేహితుల సలహా తీసుకుంటే సరి. ఎక్కువ మార్కులు టార్గెట్‌గా పెట్టకుండా, తెలిసినంత వరకూ రాయమని పిల్లలను ప్రోత్సహిస్తే... ఊహించినదానికన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకునే వీలుంటుంది’అని సైకియాట్రిస్టులు వెల్లడిస్తున్నారు. 

మానసిక నిపుణుల సూచనలు.. 
► ప్రతికూల భావజాలంతో పాటు.. సానుకూల వాతావరణాన్ని సమకూర్చుకోవాలి. దీనివల్ల మనిషిలోని గ్రంథుల ద్వారా పాజిటివ్‌ ఎనర్జీ అందుతుంది. పరీక్ష సమయంలో సులువగా రాసేందుకు వీలు కల్పింస్తుంది.  
►పరీక్ష రాసే విద్యారి్థపై ఆక్సిజన్‌ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రతీ గంటకు ఐదు నిమిషాలు బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌ చేయాలి. దీంతో సమృద్ధిగా మెదడుకు ఆక్సిజన్‌ అందుతుంది. మెదడు ఎప్పటికప్పుడు సరికొత్త శక్తి నింపుకుని పనిచేస్తుంది. చదివేది తేలికగా మెమొరీలోకి వెళ్లే అవకాశం ఉంటుంది.  

►రాత్రింబవళ్లు చదివే విధానం అనుసరించకూడదు. కనీసం రాత్రి పూట 6 గంటలకు తగ్గకుండా నిద్రపోవాలి. దీంతో మెదడు విశ్రాంతి తీసుకుంటుంది. మెదడులో ఉండే గదుల్లో వేడి తగ్గడమే కాకుండా, సమాచారం ఆయా గదుల్లో నిక్షిప్తమవుతుంది. మర్నాడు తేలికగా చదివింది గుర్తు చేసుకునే వీలుంటుంది.  
►రోజూ కనీసం 5 లీటర్లకు తగ్గకుండా మంచినీళ్లు తాగాలి. దీంతో శరీరం లవణాలను కోల్పోకుండా (డీ హైడ్రేషన్‌) చూసుకోవచ్చు. ఫలితంగా మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఒకేసారి కాకుండా ప్రతీ అరగంటకు కొన్ని నీళ్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది. 
►పరీక్షకు వెళ్లేప్పుడు అంతకు ముందు రాసిన పరీక్ష గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చించవద్దు. కొంత    గ్యాప్‌ ఇచ్చి.. మరుసటి పరీక్ష మీద దృష్టి పెట్టాలి.      దీంతో గతంలో చదివింది మెదడులో స్లీపింగ్‌ మోడ్‌లోకి వెళ్తుంది. రేపు రాయాల్సిన పరీక్షకు సమాచారం ఆన్‌ మోడ్‌లో ఉంటుంది. 

ఆత్మస్థైర్యమే విజయ రహస్యం 
ఇప్పటివరకూ వందల్లో ఫోన్‌కాల్స్‌ వచ్చాయి. సమస్య చెప్పేటప్పుడు వాళ్లల్లో ఆందోళన కన్పించేది. కౌన్సెలింగ్‌ తర్వాత ధైర్యం వచ్చేది. ఇంటర్‌ పరీక్షలను రాయగల శక్తి ప్రతీ ఒక్కరికీ ఉంది. ఫలితం ఏ విధంగా వస్తుందో.. అనే అనవసర సందేహాన్ని రానివ్వకుండా ఉంటే మంచి మార్కులు ఖాయం. ఇదే విషయాన్ని చెప్పాం. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో భయాన్ని దూరం చేస్తున్నాం. చాలామంది మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యే వాతావరణమే ఈసారి కని్పస్తోంది.  
 – డాక్టర్‌ అనుపమ (ఇంటర్‌ బోర్డ్‌ ఏర్పాటు చేసిన సైకియాట్రిస్ట్‌)   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement