మరో ఘటనలో బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
పోచారం/నిజాంపేట/ బీబీనగర్/ భానుపురి (సూర్యాపేట): వేర్వేరు కాలేజీల్లో ఇద్దరు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మరో ఘట నలో బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యా యత్నం చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.
అన్నోజిగూడ నారాయణ కళాశాలలో...
బీబీనగర్ మండలంలోని పెద్దపలుగు తండాకు చెందిన బానోతు తనుష్‌నాయక్ (16) తల్లిదండ్రులు నగరానికి వలస వచ్చి కుషాయిగూడలోని చక్రీపురంలో ఉంటున్నారు. అన్నోజిగూడలోని నారాయణ జూనియర్ కళాశాలలో తనుష్‌ను ఇంటర్ ఫస్టియర్(ఎంపీసీ)లో చేర్పించారు. సోమవారం సాయంత్రం హాస్టల్ బాత్‌రూమ్‌లోకి వెళ్లిన తనుష్ ఎంత సేపటికీ బయటకు రాలేదు. దీంతో తోటి విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది తలుపులు పగులగొట్టి చూడగా..తనుష్ ఉరేసుకొని వేలాడుతూ కనిపించాడు.
వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో నేరుగా గాంధీ ఆస్పత్రికి తరలించారు. తనుష్‌కు ఫిట్స్ వచ్చాయని కళాశాల నిర్వాహకులు చెబుతుండగా..అధ్యాపకుల ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని తల్లిదండ్రులు, బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు.
ఎన్‌ఎస్‌ఆర్ కళాశాలలో...
నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం చిన్నతడం గ్రామానికి చెందిన ప్రజ్ఞారెడ్డి ప్రగతినగర్‌లోని ఎన్‌ఎస్‌ఆర్ ఇంపల్స్ ఐఐటీ గల్స్ క్యాంపస్‌లో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతూ కళాశాలకు చెందిన హాస్టల్‌లో ఉంటోంది. సోమవారం ఉదయం 9.30 గంటల సమయంలో ప్రజ్ఞారెడ్డి తాను ఉంటున్న హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
అయితే విద్యార్థిని మృతి చెందిన విషయాన్ని దాచి పెట్టిన కళాశాల యాజమాన్యం హుటా హుటిన మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించింది. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుందా లేక ఇతరత్రా కారణాలేమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఎన్‌ఎస్‌ఆర్ ఇంపల్స్ ఐఐటీ క్యాంపస్‌కు ఇంటర్ బోర్డు అనుమతి లేదని సమాచారం.
ఫీజు చెల్లించాలని ఒత్తిడి చేయడంతో....
సూర్యాపేట జిల్లా కోదాడ స్నేహ నర్సింగ్ కళాశాలలో అసోం రాష్ట్రానికి చెందిన నర్గిస్ పర్వీన్ బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కొద్ది రోజులుగా ఫీజు చెల్లించాలని కాలేజీ యాజమాన్యం ఒత్తిడి చేయడంతో బుధవారం రాత్రి కాలేజీ హాస్టల్‌లో శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను సూర్యాపేట ఆస్పత్రిలో చేర్పించగా..కోలుకుంది.
మళ్లీ ఫీజు చెల్లించాలని కాలేజీ యాజమాన్యం డిమాండ్ చేయడంతో సోమవారం గ్రీవెన్స్‌డేలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు కాలేజీకి చెందిన పలువురు విద్యార్థులతో కలిసి ఆమె సూర్యాపేటలోని కలెక్టరేట్‌కు వచ్చింది. వారంతా కలిసి కలెక్టరేట్‌లో వినతిపత్రం అందించారు.
ఆ తర్వాత కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో బాధిత విద్యార్థిని తన వెంట తెచ్చుకున్న శానిటైజర్ తాగి మళ్లీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో వెంటనే కలెక్టరేట్‌లో విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ సిబ్బంది ఆమెను సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న నర్గిస్ పర్వీన్ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment