పురుగు మందు తాగుతున్న రైతు నర్సింలు
వర్గల్ (గజ్వేల్): రైతు వేదిక నిర్మాణం కోసం తన భూమి పోతుందని మనస్తాపం చెందిన ఓ దళిత రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘నా భూమి దక్కడం లేదు. ఇక నేను చనిపోతా’.. అంటూ క్రిమిసంహారక మందు తాగుతూ సెల్ఫీ దిగాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరులో జరిగిన ఈ ఘటనతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బేగరి నర్సింలు తల్లిదండ్రులకు సర్వే నంబర్ 370లో లావుని పట్టా భూమి ఉంది. తమకున్న ఎకరం మూడు గుంటల భూమిని నిబంధనలకు విరుద్ధంగా వేరే వ్యక్తులకు విక్రయించారు. దీంతో ఆ భూమిని 2013లో రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోగా.. అక్కడ సబ్‌స్టేషన్ నిర్మించారు. తాజాగా దాని పక్కనే ఉన్న 13 గుంటల స్థలం రైతు వేదిక కోసం కేటాయించారు. అయితే.. ఈ స్థలం తన తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా సంక్రమించిందని, అందులో ఎలాంటి నిర్మాణాలు చేయొద్దని నర్సింలు కోరాడు.
రెవెన్యూ అధికారులు, సర్పంచ్ అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. రెండు రోజుల క్రితం అధికారులు జేసీబీతో వేదిక నిర్మాణ పనులు చేపడుతుండగా నర్సింలు అడ్డుకున్నాడు. దీంతో బుధవారం పోలీసు బందోబస్తు మధ్య నిర్మాణ పనులు చేపట్టడం చూసి చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇక భూమి తనకు దక్కడం లేదని తీవ్ర మనస్తాపం చెందిన నర్సింలు క్రిమిసంహారక మందు తాగుతూ సెల్ఫీ దిగాడు. ‘వారసత్వంగా వచ్చిన భూమి నాకు దక్కడం లేదు. ఇక నేను చనిపోతున్నా.. నా ఆత్మహత్యకు సర్పంచ్, పట్వారీ, ఎమ్మార్వో బాధ్యులు’అని ఆడియో రికార్డు కూడా పెట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు నర్సింలును గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి సిద్దిపేటకు తరలించారు. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు.
వేలూరులో ఉద్రిక్తత
రైతు నర్సింలు మృతి చెందిన సమాచారం తెలియడంతో గురువారం ఉదయం నుంచే గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నర్సింలు మృతికి సర్పంచ్, రెవెన్యూ అధికారులే కారణమని ఆరోపిస్తూ మృతుని కుటుంబీకులు, బంధువులు సర్పంచ్ పాపిరెడ్డి ఇంటి ఎదుట బైఠాయించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు బలగాలను మోహరించారు. గజ్వేల్ ఏసీపీ నారాయణ, ట్రాఫిక్ ఏసీపీ బాలాజీలు పరిస్థితిని సమీక్షించారు. మృతుని కుటుంబ సభ్యులను రైతుబంధు సమితి కన్వీనర్ రవీందర్ ఓదార్చారు. వారితో మంత్రి హరీశ్‌రావును ఫోన్ ద్వారా మాట్లాడించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హరీశ్ భరోసా ఇవ్వడంతో వారు శాంతించారు. కాగా, గురువారం రాత్రి పోలీసు బందోబస్తు మధ్య నర్సింలు అంత్యక్రియలు పూర్తయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment