Telangana Intermediate
-
తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు గురువారం వెల్లడించింది. ఫిబ్రవరి 1నుంచి 15వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు తెలిపింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ షెడ్యూల్ ► ఫిబ్రవరి 28న సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1. ►మార్చి 1న ఇంగ్లీష్ పేపర్ 1. ►మార్చి 4న మాథ్స్ పేపర్ 1A/ బోటనీ పేపర్ 1/ పొలిటికల్ సైన్స్ పేపర్ 1. ►మార్చి 6న మాథ్స్ పేపర్ 1b/ జువాలజి పేపర్ 1/ హిస్టరీ పేపర్ 1. ►మార్చి 11న ఫిజిక్స్ పేపర్ 1/ ఎకనామిక్స్ పేపర్1. ►మార్చి 13న కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1. ఇంటర్ సెకండ్ ఇయర్ షెడ్యూల్ ►ఫిబ్రవరి 29న సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2 ►మార్చి 2న ఇంగ్లీష్ పేపర్ 2 ►మార్చి 5న మాథ్స్ పేపర్ 2A/ బాటనీ పేపర్ 2/ పొలిటికల్ సైన్స్ 2. ►మార్చి 7న మాథ్స్ పేపర్ 2B/ జువాలాజీ పేపర్ 2/ హిస్టరీ పేపర్ 2 ►మార్చి 12న ఫిజిక్స్ పేపర్2/ఎకనామిక్స్ పేపర్ 2. మార్చి 14న కెమిస్ట్రీ పేపర్ 2/ కామర్స్ పేపర్ 2. -
TS Inter Results 2023: ఇంటర్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ను ఇలా చెక్ చేసుకోండి..
సాక్షి, హైదరాబాద్: కాసేపట్లో తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. మంగళరం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డ్ కార్యాలయంలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి లాంఛనంగా విడుదల చేశారు. ఇంటర్ ఫలితాలను https://tsbie.cgg.gov.in, http://results.cgg.gov.in వెబ్సైట్లలో విద్యార్థులు చూసుకోవచ్చు. అదే విధంగా ‘ఇంటర్ ఫలితాలు తెలుసుకునేందుకు ‘సాక్షి’ఏర్పాట్లు చేసింది. www.sakshieducation.com వెబ్సైట్లో ఫలితాలను పొందవచ్చు. కాగా మార్చి, ఏప్రిల్ నెలలో తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగిన ఈ పరీక్షను 9.47 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. గతేడాది ఫలితాలు జూన్‌లో విడుదల కాగా.. ఈ ఏడాది ఒక నెల ముందుగానే విడుదల అయ్యాయి. ఇంటర్ ఫస్టియర్‌లో 63.85 శాతం ఉత్తీర్ణత సాధించగా, సెకండియర్‌లో 67. 26 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఫస్టియర్‌లో 2 లక్షల 72వేల 208 మంది పాసవ్వగా, సెకండియర్‌లో 2 లక్షల 56వేల 241 మంది పాసైనట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో 75. 27 శాతంలో మేడ్చల్ జిల్లా తొలి స్థానంలో నిలవగా, ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో 85.05 శాతంలో ములుగు జిల్లా అగ్రస్థానం సాధించింది. జూన్ 4వ తేదీ నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు మంత్రి సబిత తెలిపారు. అదే సమయంలో ఫెయిలైన విద్యార్థులు ఎవరూ కూడా ఆందోళన చెందొద్దన్నారు మంత్రి. చదవండి: ఎంసెట్‌కు బయోమెట్రిక్ తప్పనిసరి.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ.. -
TS Inter Result 2023: రేపే ఇంటర్మీడియట్ ఫలితాలు.. డైరెక్ట్ లింక్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలు మంగళవారం (మే 9వ తేదీ) విడుదల కానున్నాయి. ఫలితాల వెల్లడిపై బోర్డు అధికారులు ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి సబిత ఫలితాలు వెల్లడించాల్సి ఉన్నందున ఆమె వెసులుబాటును పరిగణనలోకి తీసుకున్న అనంతరం ఫలితాల విడుదల తేదీని ప్రకటించారు. ఫలితాల వెల్లడికి సంబంధించి సాఫ్ట్‌వేర్‌ను కూడా సిద్ధం చేశారు. విద్యార్థులు మంగళవారం ఇంటర్ బోర్డు వెబ్సైట్లు tsbie.cgg.gov.in ద్వారా, www. sakshieducation.com ద్వారా వేగంగా ఫలితాలు పొందవచ్చు. కాగా, తొలుత ఇంటర్‌బోర్డు పరీక్ష పత్రాల ఆన్లైన్ మూల్యాంకనం చేపట్టాలని నిర్ణయించినా, వీలు కాకపోవడంతో ఆఫ్‌లైన్ ద్వారా మూల్యాంకనం చేపట్టింది. పలు దఫాలుగా ట్రయల్‌రన్ చేసిన అనంతరం సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండటంతో జీరో సాంకేతిక సమస్యలు నిర్ధారౖణెందని, దీంతో ఫలితాల వెల్లడికి ఎలాంటి ఆటంకాల్లేవని అధికారులు నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలోనే మంగళవారం ఫలితాలు వెలువరించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకూ జరిగాయి. మొదటి సంవత్సరం పరీక్షలకు 4,82,501 మంది, రెండో సంవత్సరం పరీక్షలకు 4,23, 901 మంది హాజరయ్యారు. దాదాపు 9.06 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన సమాధాన పత్రాల మూల్యంకన ప్రక్రియ ఏప్రిల్ రెండో వారంలోనే పూర్తయింది. చదవండి: మృత్యు ఘంటికలు!.. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 గంటల వరకు -
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు.. ప్రిన్సిపల్ సంతకం లేకున్నా..
సాక్షి, నిజామాబాద్: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు డీఐఈవో ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లా వ్యాప్తంగా 50 కేంద్రాల్లో 35,522 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఫీజు చెల్లిస్తేనే హాల్‌టికెట్ ఇస్తామంటున్న కళాశాలలపై కఠిన చర్యలు ఉంటాయని, విద్యార్థులు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకుని ప్రిన్సిపాల్ సంతకం లేకుండానే పరీక్షకు హాజరుకావచ్చని ఇంటర్ విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. కోవిడ్ నిబంధనలతో పాటు నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ నిబంధన అమల్లో ఉంది. ఆర్టీసీ, విద్యుత్, పోలీస్, విద్యాశాఖ, పోస్టల్, ఇతరశాఖల కో–ఆర్డినేషన్‌తో పరీక్షలు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. మే 6 నుంచి ఇంటర్మీడియేట్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డీఐఈవో రఘురాజ్ ‘సాక్షి’ ఇంటర్వ్యూ చేసింది. సాక్షి: ఆరో తేదీ నుంచి ప్రారంభం కానున్న వార్షిక పరీక్షలకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? డీఐఈవో: ఇంటర్ బోర్డు ఆదేశాలు, జిల్లా ఉన్నతాధికారుల సలహాల, సూచనలతో పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. జిల్లా వ్యాప్తంగా 50 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నాం. మొత్తం 35,522 మంది పరీక్షలు రాయనున్నారు. కేంద్రాల్లో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ►నిమిషం ఆలస్యం నిబంధన అమలులో ఉందా గతంలో మాదిరిగానే నిమిషం నిబంధన అమ ల్లో ఉంటుంది. విద్యార్థులు నిర్ణీత సమయంలోగా కేంద్రాలకు చేరుకోవాలి. ఉదయం 8 గంటల నుంచే పరిశీలించి కేంద్రంలోకి అనుమతిస్తారు. ఉద యం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ముందుగానే కేంద్రాలకు రావాలి. టీఎస్‌బీఐఈ ఎగ్జామ్ సెంటర్ లోకేటర్ అనే మొబైల్ యాప్ ద్వారా పరీక్షాకేంద్రం ఎక్కడుందో తెలుసుకోవచ్చు. ►మాస్‌కాపీయింగ్‌పై పర్యవేక్షణ ఎలా ఉండనుంది పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల నీడలో పరీక్ష పత్రాలను తెరవాలి. మాస్‌కాపీయింగ్, అవకతవకలు జరగకుండా చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారి అందుబాటులో ఉంటారు. వీరితో పాటు జిల్లాలో డిపార్ట్మెంట్ అధికారి, డిప్యూటీ తహసీల్దార్ హోదాలోని రెవెన్యూ అధికారి, ఏఎస్సై హోదా కలిగిన ఒక పోలీసు అధికారితో కూడిన ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, నాలు గు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటుచేశాం. రాష్ట్ర స్థాయి తనిఖీ బృందాలూ తనిఖీలు చేపడతాయి. ►ఎండల తీవ్రత దృష్ట్యా తీసుకుంటున్న చర్యలు పరీక్ష ముగిసేసరికి మధ్యాహ్నం అవుతుంది. ప్రతి కేంద్రం వద్ద టెంట్ వేయాలని చెప్పాం. తాగునీరు, మరుగుదొడ్లు, తదితర మౌలిక సదుపాయా లు అందుబాటులో ఉంటాయి. ఓఆర్ఎస్ ప్యాకెట్లతో ఏఎన్ఎం అందుబాటులో ఉంటుంది. ఫ్యాన్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించాం. ►విద్యార్థులు మానసిక ఒత్తిడి అధిగమించాలంటే.. పరీక్షల సమయంలో చాలామంది విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. వారి కోసం ఇంటర్ బోర్డు కమిషనర్ సైక్రియార్టిస్ట్ను నియమించారు. 18005999333 నంబర్‌ను ఏర్పాటు చేశారు. పరీక్షలంటే భయం ఉన్న విద్యార్థులు ఈ నంబర్‌కు ఫోన్‌చేసి ఒత్తిడిని జయించవచ్చు. ►హాల్‌టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులు హాల్‌టికెట్లు ఇవ్వని కళాశాలల యాజమా న్యాలపై ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు ఉంటాయి. నోటీసులు కూడా జారీ చేస్తాం. కళాశాలలో హాల్‌టికెట్లు ఇవ్వకుంటే ఇంటర్‌బోర్డు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని నేరుగా పరీక్షకు హాజరుకావచ్చు. ఈవిషయంలో విద్యార్థులు భయాందోళనకు గురికావొద్దు. ►పరీక్షలు సజావుగా సాగేందుకు చర్యలు పరీక్షలు సజావుగా జరిగేలా కలెక్టర్ సూచనల మేరకు అడిషనల్ కలెక్టర్ చిత్రామిశ్రా కో–ఆర్డినేషన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించాం. పరీక్ష సమయానికి బస్సులు నడిచేలా చూడాలని ఆర్టీసీకి, విద్యుత్ అంతరాయం కలగకుండా ఉండేందుకు ఎస్ఈని, పోలీస్, డీఎంహెచ్‌వో, ఇతర జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించాం. -
ఈ మెలుకువలు పాటిస్తే ‘ఇంటర్’ యమ ఈజీ
సాక్షి, హైదరాబాద్: ఫలితం గురించి పక్కనపెడితే.. ఇంటర్ పరీక్షల మానసిక ఒత్తిడిని తేలికగా జయించవచ్చని చెబుతున్నారు మానసిక నిపుణులు. ఫస్టియర్ పరీక్షలు మొదలవుతున్న వేళ... విద్యార్థులు మానసిక ఒత్తిడిని జయించేందుకు ప్రత్యేకంగా సైకియాట్రిస్ట్‌లను ఇంటర్ బోర్డు అందుబాటులోకి తెచ్చింది. ఫోన్ల ద్వారా వారిని సంప్రదించే ఏర్పాట్లు చేసింది. గత రెండు రోజులుగా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి పెద్ద సంఖ్యలో వారికి ఫోన్‌కాల్స్ వస్తున్నాయి. ఇందులో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల నుంచే ఎక్కువగా ఉంటున్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఆన్లైన్ ద్వారా సరిగా వినలేకపోయామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ కాలేజీల్లో చదివే విద్యార్థులు మాత్రం పోటీ పరీక్షల ఒత్తిడి నేపథ్యంలో ప్రస్తుత ఇంటర్ పరీక్షలపై ఆందోళన చెందుతున్నారు. వాళ్లు ఎదుర్కొంటున్న భయం, ఆందోళనను పారద్రోలేందుకు సైకియాట్రిస్ట్‌లు అనేక సూచనలు చేస్తున్నారు. చదవండి: కొనసాగుతున్న తెలంగాణ ఇంటర్ పరీక్షలు గుర్తున్నది రాస్తే చాలు పాస్ గ్యారెంటీ ‘కరోనా కారణంగా చాలా రోజులుగా మేం పల్లెటూళ్లోనే ఉన్నాం. ఆన్లైన్ క్లాసులు సరిగా వినలేదు. పరీక్షలు రాయగలమా? అనే ఆందోళన వెంటాడుతోంది’అని నిజామాబాద్ జిల్లా మారుమూల పల్లెకు చెందిన గోవింద్ కాల్ చేశాడు. అతని మానసిక స్థితి తెలుసుకునేందుకు సైకియాట్రిస్ట్ కొన్ని ప్రశ్నలు వేశాడు. తను చదివిన చాప్టర్స్‌లో అతను ఎంత పట్టు కలిగి ఉన్నాడో తెలిసిపోయింది. వాస్తవానికి ఇప్పుడా చాప్టర్లు మళ్లీ మననం చేసుకుంటే పాస్ గ్యారెంటీ. ఈ వాస్తవాన్ని చెప్పిన తర్వాత అతని మనసు కుదుటపడింది. తమకు వస్తున్న కాల్స్‌లో ఇలాంటివి చాలా ఉంటున్నాయని ఇంటర్ బోర్డ్ ఏర్పాటు చేసిన సైకియాట్రిస్టులు చెబుతున్నారు. నిజానికి విద్యార్థులు ఆన్లైన్లో నేర్చుకున్న చాప్టర్లనే రివిజన్ చేసుకుంటే పాస్ మార్కులొస్తాయని వారు అంటున్నారు. ఇలా కాకుండా చదువుకొని పాఠాల కోసం హైరానా పడొద్దని సూచిస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ స్కోరెలా? ‘పరీక్షలే ఉండవనుకున్నాం. ఇప్పుడు రాయాల్సి వస్తోంది. ఇంత సమయంలో ఎలా?’అనేది సైకియాట్రిస్ట్‌లకు వచ్చే ఫోన్‌కాల్స్‌లో రెండో తరహా ప్రశ్న. ‘చదివిన చాప్టర్లలో ఎక్కువగా గుర్తుండిపోయే ప్రశ్నలపై ప్రధానంగా దృష్టి పెట్టాలి. ఆన్లైన్ క్లాసుల్లో బాగా అర్థమైన వాటిల్లోంచి ప్రశ్నలు ఎంచుకోవాలి. బోర్డు విడుదల చేసిన స్టడీ మెటీరియల్‌తో వీటిని పోల్చి చూసుకోవాలి. ఆ తర్వాత స్నేహితులు, లెక్చరర్లతో సాదాసీదా సంభాషణలో చర్చించిన చాప్టర్లను మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు నెమరు వేసుకోవాలి. సమయం ఉంటే స్నేహితులతో వీటిపై మళ్లీ చర్చించాలి’అని మానసిక నిపుణులు చెబుతున్నారు. వెన్నుతడితే పరీక్షల్లో విజయం తేలికే.. ఇంటర్ పరీక్షను విద్యార్థి చాలా తేలికగా తీసుకునే వాతావరణం తల్లిదండ్రులే కలి్పంచాలన్నది మానసిక నిపుణుల అభిప్రాయం. రోజూ తల్లిదండ్రుల నుంచి 50 కాల్స్ వస్తున్నాయని ఓ సైకియాట్రిస్ట్ తెలిపారు. ఇందులో మధ్యతరగతి ఉద్యోగ వర్గాల వారివే ఎక్కువగా ఉంటున్నాయని చెబుతున్నారు. ‘అనివార్యంగానే ఇంటర్ పరీక్షలు పెడుతున్నట్లు అధికారులే చెప్పారు. దీన్ని జయించే మార్గాలనూ ఇంటర్ బోర్డు విద్యార్థుల ముందుంచింది. వీటిని అనుసరిస్తే చాలనే భావన తల్లిదండ్రులూ కల్పించాలి. పిల్లలు ఒత్తిడికి గురవుతుంటే.. సరైన రీతిలో దాన్ని దూరం చేసే బంధువులు, స్నేహితుల సలహా తీసుకుంటే సరి. ఎక్కువ మార్కులు టార్గెట్‌గా పెట్టకుండా, తెలిసినంత వరకూ రాయమని పిల్లలను ప్రోత్సహిస్తే... ఊహించినదానికన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకునే వీలుంటుంది’అని సైకియాట్రిస్టులు వెల్లడిస్తున్నారు. మానసిక నిపుణుల సూచనలు.. ► ప్రతికూల భావజాలంతో పాటు.. సానుకూల వాతావరణాన్ని సమకూర్చుకోవాలి. దీనివల్ల మనిషిలోని గ్రంథుల ద్వారా పాజిటివ్ ఎనర్జీ అందుతుంది. పరీక్ష సమయంలో సులువగా రాసేందుకు వీలు కల్పింస్తుంది. ►పరీక్ష రాసే విద్యారి్థపై ఆక్సిజన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రతీ గంటకు ఐదు నిమిషాలు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. దీంతో సమృద్ధిగా మెదడుకు ఆక్సిజన్ అందుతుంది. మెదడు ఎప్పటికప్పుడు సరికొత్త శక్తి నింపుకుని పనిచేస్తుంది. చదివేది తేలికగా మెమొరీలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ►రాత్రింబవళ్లు చదివే విధానం అనుసరించకూడదు. కనీసం రాత్రి పూట 6 గంటలకు తగ్గకుండా నిద్రపోవాలి. దీంతో మెదడు విశ్రాంతి తీసుకుంటుంది. మెదడులో ఉండే గదుల్లో వేడి తగ్గడమే కాకుండా, సమాచారం ఆయా గదుల్లో నిక్షిప్తమవుతుంది. మర్నాడు తేలికగా చదివింది గుర్తు చేసుకునే వీలుంటుంది. ►రోజూ కనీసం 5 లీటర్లకు తగ్గకుండా మంచినీళ్లు తాగాలి. దీంతో శరీరం లవణాలను కోల్పోకుండా (డీ హైడ్రేషన్) చూసుకోవచ్చు. ఫలితంగా మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఒకేసారి కాకుండా ప్రతీ అరగంటకు కొన్ని నీళ్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది. ►పరీక్షకు వెళ్లేప్పుడు అంతకు ముందు రాసిన పరీక్ష గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చించవద్దు. కొంత గ్యాప్ ఇచ్చి.. మరుసటి పరీక్ష మీద దృష్టి పెట్టాలి. దీంతో గతంలో చదివింది మెదడులో స్లీపింగ్ మోడ్‌లోకి వెళ్తుంది. రేపు రాయాల్సిన పరీక్షకు సమాచారం ఆన్ మోడ్‌లో ఉంటుంది. ఆత్మస్థైర్యమే విజయ రహస్యం ఇప్పటివరకూ వందల్లో ఫోన్‌కాల్స్ వచ్చాయి. సమస్య చెప్పేటప్పుడు వాళ్లల్లో ఆందోళన కన్పించేది. కౌన్సెలింగ్ తర్వాత ధైర్యం వచ్చేది. ఇంటర్ పరీక్షలను రాయగల శక్తి ప్రతీ ఒక్కరికీ ఉంది. ఫలితం ఏ విధంగా వస్తుందో.. అనే అనవసర సందేహాన్ని రానివ్వకుండా ఉంటే మంచి మార్కులు ఖాయం. ఇదే విషయాన్ని చెప్పాం. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో భయాన్ని దూరం చేస్తున్నాం. చాలామంది మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యే వాతావరణమే ఈసారి కని్పస్తోంది. – డాక్టర్ అనుపమ (ఇంటర్ బోర్డ్ ఏర్పాటు చేసిన సైకియాట్రిస్ట్) -
జూలైలో తెలంగాణ ఇంటర్ పరీక్షలు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటరీ్మడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలు రాసే విద్యార్థులకు రెండు అవకాశాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పరీక్షలను రెండుసార్లు నిర్వహించనుంది. మొదటి పరీక్షలను జూలైలో నిర్వహించి ఆగస్టులో ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయించినట్లు కేంద్రానికి తెలిపింది. ఇటీవల కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ అన్ని రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులు, కార్యదర్శులతో పరీక్షల నిర్వహణపై వర్చువల్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాల అభిప్రాయాలను రాతపూర్వకంగా తెలియజేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యా శాఖ సంయుక్త కార్యదర్శి ఎల్ఎస్ చాంగ్సన్‌కు రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా కేంద్రానికి లేఖ రాశారు. పరీక్షలను జూలై మధ్యలో నిర్వహిస్తామని అందులో పేర్కొన్నారు. ప్రశ్నపత్రాలు ఇప్పటికే ముద్రించినందున పరీక్ష విధానంలో ఎలాంటి మార్పులు చేయడం లేదని వెల్లడించారు. అయితే ప్రశ్నపత్రంలో ఇచి్చన మొత్తం ప్రశ్నల్లో 50 శాతం ప్రశ్నలకే సమాధానాలు రాసేలా విద్యార్థులకు అవకాశం ఇస్తామన్నారు. ఆ మార్కులను రెట్టింపు చేసి 100 శాతంగా పరిగణనలోకి తీసుకుని ఫలితాలు వెల్లడిస్తామని వివరించారు. పరీక్ష సమయాన్ని 3 గంటల నుంచి 90 నిమిషాలకు కుదిస్తున్నట్లు వెల్లడించారు. రెండు వేరు వేరు సెట్ల ప్రశ్నపత్రాలతో ఉదయం, సాయంత్రం రెండు బ్యాచ్‌లుగా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు కరోనా, ఇతరత్రా కారణాలతో ఈ పరీక్షలకు హాజరు కాలేని విద్యార్థులకు మూడో సెట్ ప్రశ్నపత్రంతో తర్వాత పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వీలైనంత మేర భౌతిక దూరాన్ని పాటిస్తూ పరీక్షల నిర్వహణకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. కాగా, ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలు జూలైలో నిర్వహిస్తారని.. పరీక్షల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయని ‘సాక్షి’గురువారం కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా.. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించి ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈనెల 29 నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు నిర్వహించాల్సిన ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. కరోనా నేపథ్యంలో ఇంటర్ ద్వితీయ సంవత్సర, ఒకేషనల్ ప్రథమ సంవత్సర పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. వీటిపై జూన్ మొదటి వారంలో సమీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణ తేదీలను కనీసం 15 రోజుల ముందు చెబుతామని వివరించారు. చదవండి: డబుల్ హ్యాపీ.. కళాకారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చదవండి: తక్షణమే ‘కోవిడ్’ కారుణ్య నియామకాలు -
ఇంటర్ బోర్డుకు భంగపాటు
లక్షలాదిమంది విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉండే వార్షిక పరీక్షల నిర్వహణను తేలిగ్గా తీసుకుంటే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో ఇంటర్మీడియెట్ బోర్డుకు కనీసం ఇప్పటికైనా అర్ధమై ఉండాలి. ఫలితాల విషయంలో వస్తున్న ఫిర్యాదులపై నిజాయితీగా ఆలోచించి, తగిన చర్యలు తీసుకోవడానికి స్వచ్ఛందంగా సిద్ధపడినట్టయితే మంగళవారం తెలంగాణ హైకోర్టులో బోర్డుకు భంగపాటు ఎదురయ్యేది కాదు. కానీ బోర్డు వ్యవహారశైలి ఆదినుంచీ అందుకు భిన్నంగా ఉంది. ఫెయిలైన 3 లక్షలమంది విద్యార్థుల పరీక్ష పత్రాలను తిరిగి మూల్యాంకనం చేసే విష యంలో మీ నిర్ణయమేమిటో చెప్పాలని ధర్మాసనం ఆదేశించడం ఎందరో తల్లిదండ్రులకు ఊరటనిస్తుంది. ఫలితాలు వెల్లడైనప్పటినుంచి తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థిలోకం అట్టుడుకు తోంది. తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. కానీ బోర్డు తన నిర్వాకాన్ని సరిదిద్దుకోవడానికి ముందుకు రాలేదు సరిగదా వింత తర్కాలకూ, విచిత్ర వాదనలకూ దిగింది. ఒకపక్క తాము ఫెయి లయ్యామన్న ఆవేదనతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 18మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు. ఎంతో బాగా రాసినా ఫెయిలయ్యామని కొందరు, అనుకున్నవిధంగా మార్కులు రాలేదని మరి కొందరు మనస్తాపం చెంది కన్నీరుమున్నీరవుతున్నారు. నిద్రాహారాలకు దూరమయ్యారు. వారి నెలా సముదాయించాలో, ఎలా సర్దిచెప్పాలో తెలియక... వారి భవిష్యత్తు ఏమవుతుందో తోచక తల్లిదండ్రులు ఆందోళనపడుతున్నారు. బోర్డు సారథులు మాత్రం ఇదంతా సాధారణమేనని మాట్లాడుతున్నారు. ఇంతకన్నా అన్యాయం మరేమైనా ఉంటుందా?! సోమవారం విలేకరులతో మాట్లాడిన బోర్డు కార్యదర్శి అశోక్ వివరణనిచ్చిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. మూల్యాంకనం పారదర్శకంగా, ప్రామాణికంగా జరిగిందని... ఫలితాలు కూడా సక్ర మంగానే ఉన్నాయని ఆయన చెప్పిన మాటలు తల్లిదండ్రుల ఆందోళనను మరింత పెంచాయి. మార్కులు సరిగా రాలేదని భావించినవారు ఎప్పటిలాగే పునఃపరిశీలనకూ లేదా లెక్కింపునకూ దరఖాస్తు చేసుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. ఈ దరఖాస్తులకు ఎలాంటి రుసుమూ వసూలు చేయదల్చుకోకపోతే వేరు. ఒక్కో సబ్జెక్టుకు పునఃపరిశీలనకైతే రూ. 600, తిరిగి లెక్కించడానికైతే రూ. 100 చొప్పున విద్యార్థి చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫెయిలైనట్టు ఫలితం వచ్చిన 3 లక్షలమంది విద్యార్థుల్లో ఎందరు ఈ స్థాయి ఫీజుల్ని భరించగలరు? ఒక్కో పేపర్‌కు రూ. 600 చొప్పున చెల్లించాలంటే ఎన్ని వేల రూపాయలు అవసరమవుతాయో బోర్డు సారథులు ఆలోచిం చారా? సాధారణ పరిస్థితుల్లో అయితే ఈ నిబంధనలను ఎవరూ తప్పుబట్టరు. కానీ ఈసారి జరిగింది వేరు. సాఫ్ట్వేర్ కారణంగానో, మూల్యాంకనం సక్రమంగా లేకపోవడం వల్లనో, ఇతర అవకతవకల కారణంగానో ఫలితాల్లో తప్పిదాలు దొర్లాయని, అందువల్ల లక్షలమంది విద్యార్థుల ఫలితాలు తారుమారయ్యాయని ఆరోపణలొచ్చాయి. అందులో వాస్తవం ఉన్నదని భావించడానికి అనేక ఉదాహరణలు కనబడుతున్నాయి. అరబిక్ సబ్జెక్టులు రాసిన ఒకరికి ఉర్దూ సబ్జెక్టుల్లో సున్నా మార్కులొచ్చాయి. తెలుగులో సున్నా మార్కులొచ్చిన ఒక విద్యార్థినికి రీవాల్యుయేషన్ తర్వాత 99 మార్కులొచ్చాయి. 810 మార్కులొచ్చిన ఒక విద్యార్థికి గణితంలో కేవలం 17 మార్కులే వచ్చినట్టు చూపడం, కొందరు విద్యార్థులైతే పరీక్షకు గైర్హాజరైనట్టు చూపడం వంటివి ఎన్నో ఉన్నాయి. మీడియా దృష్టికి ఇంకా రాని అవకతవకలు మరెన్ని ఉన్నాయో ఊహించలేం. ఇలాంటి పరిస్థితుల్లో బోర్డు జరిగిన లోపాలను నిజాయితీగా అంగీకరించి ఫెయిలైనవారి పరీక్ష పత్రాలు మళ్లీ దిద్దించ డానికి స్వచ్ఛందంగా ముందుకొస్తే విద్యార్థుల ఆందోళన సద్దుమణిగేది. అది లేకపోబట్టే ఉన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. బోర్డుకు సాంకేతిక సేవలు అందించడానికి ఒప్పందం కుదుర్చుకున్న గ్లోబరీనా సంస్థకు ఈ విషయంలో కనీస స్థాయి అనుభవమైనా లేదని వస్తున్న ఆరోపణలు ఆందోళన కలిగిస్తాయి. అడ్మి షన్లు మొదలుకొని పరీక్షా ఫలితాలు ఇచ్చేవరకూ అన్ని దశల్లోనూ అవసరమైన సాంకేతికతను సమ కూర్చవలసిన సంస్థ ప్రారంభంలోనే సమస్యల్లో కూరుకుపోయి అయోమయానికి లోనైందని చెబు తున్నారు. ఫలితంగా అడ్మిషన్ల ప్రక్రియలో జాప్యం చోటుచేసుకోవడంవల్ల ఎన్నో ఇబ్బందులు తలె త్తాయి. ఆ తర్వాత విద్యార్థులు ఎంపిక చేసుకున్న సబ్జెక్టులకు సంబంధించి కూడా గందరగోళం తప్పలేదు. మొదట్లోనే బోర్డు అధికారులు మేల్కొని ఆ సంస్థను పక్కనపెట్టకపోవడం పర్యవసా నంగా పరీక్షల సమయానికి, చివరకు ఫలితాల ప్రకటనలో సమస్యలు తలెత్తాయి. లక్షలాదిమంది విద్యార్థుల బంగారు భవిష్యత్తుతో ముడిపడి ఉండే అత్యంత కీలకమైన ప్రక్రియను ప్రైవేటు సంస్థ లకు కట్టబెట్టడం ఎన్ని ప్రమాదాలకు దారితీస్తుందో గుర్తించలేకపోవడం బోర్డు సారథుల తప్పిదం. ఏడాదిక్రితం తొలి దశలో గందరగోళం తలెత్తినప్పుడే దాన్ని పక్కనబెడితే బాగుండేది. ఆందోళనలు తలెత్తినప్పుడు అవి కట్టుదాటకుండా చూడటం పోలీసుల బాధ్యత. కానీ ఇంటర్ బోర్డు ముందు జరిగిన ఆందోళనల విషయంలో వారి తీరు సమర్థనీయం కాదు. తమకు అన్యాయం జరిగిందని అక్కడికి చేరుకున్న పిల్లలు, వారి తల్లిదండ్రుల విషయంలో పోలీసులు అమానుషంగా వ్యవహరించారు. ఏబీవీపీ నాయకుడు అయ్యప్పకు సంకెళ్లు వేశారు. ఆఖరికి మీడియాతో కూడా వాగ్వివాదానికి దిగారు. అసలు మూడురోజులుగా బోర్డు కార్యాలయానికి వస్తున్న విద్యార్థులకూ, వారి తల్లిదండ్రులకూ తగిన జవాబిచ్చి సముదాయించమని ప్రభుత్వం సలహా ఇచ్చి ఉంటే వివాదం ఇంతగా ముదిరేది కాదు. ఇప్పుడు న్యాయస్థానం జోక్యంతోనైనా పరి స్థితులు చక్కబడతాయని ఆశించాలి. ఎటూ సమస్య వచ్చింది కనుక మొత్తంగా ఇంటర్మీడియెట్ విద్యావ్యవస్థను ప్రక్షాళన చేసి, విద్యార్థులకు భవిష్యత్తులో ఏ సమస్యా ఎదురుకాని విధంగా, బోర్డు ప్రతిష్ట పెరిగేవిధంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం పూనుకోవాలి. -
సీఎం రమేష్ మేనల్లుడు ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మేనల్లుడు ధర్మారామ్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నారాయణ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న ధర్మారామ్ ఒక సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయ్యాడు. పరీక్షల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపం చెందిన అతడు శుక్రవారం రాత్రి తాను నివాసం ఉంటున్న శ్రీనగర్ కాలనీలోని వాసవి భువన అపార్ట్ మెంట్ ఏడో అంతస్తుపై నుంచి కిందకు దూకేశాడు. తీవ్రంగా గాయపడిన అతడిని కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే కేసు నమోదు చేసిన పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. మరోవైపు ధర్మారామ్ మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా తెలంగాణలో ఇంటర్ బోర్డు తప్పిదాల వల్ల ఇప్పటికే పలువురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అధికారుల తప్పిదాలకు తమ బిడ్డల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఇవాళ ఇంటర్ బోర్డు ఎదుట ఆందోళనకు దిగారు. అంతేకాకుండా తప్పిదాలపై ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు భగ్గుమంటున్నారు. పరీక్షకు హాజరు కాని విద్యార్థిని పాస్ చేసిన ఇంటర్ బోర్డు అధికారులను ఏం చేయాలంటూ .... విద్యాశాఖ ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 50వేల మంది విద్యార్థులు ఒక్క లెక్కల పరీక్షలోనే ఎందుకు ఫెయిల్ అవుతారని ప్రశ్నిస్తున్నారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి లెక్కలేనితనానికి విద్యార్థలు బాధితులు కావాలా అని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఏపీ మెమోలు ఎలా ఇస్తారు?
ఇంటర్ బోర్డును వివరణ కోరిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియెట్ విద్యార్థులకు ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డు పేరుతో మార్కుల జాబితా జారీ చేయడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ‘టీ విద్యార్థులకు ఏపీ బోర్డు మెమోలు’ శీర్షికన ఈనెల 27న సాక్షి పత్రికలో ప్రచురితమైన కథనంపై ప్రభుత్వం పూర్తి స్థాయి నివేదిక కోరింది. తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు నుంచి పరీక్ష రాసిన వారికి ఏపీ ఇంటర్మీడియెట్ పేరుతో మెమోలు ఇవ్వడమేంటని, ఇందుకు గల బాధ్యులు, కారణాలపై నివేదిక అందజేయాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆదేశించినట్లు తెలిసింది. రెండు రాష్ట్రాలకు కలిపి ఒక్కటే కంప్యూటర్ ల్యాబ్ ఉండటం, రెండు రాష్ట్రాల విద్యార్థుల మెమోల ముద్రణకు సంబంధించిన ముందస్తు పనులన్నీ ఒకే ల్యాబ్‌లో జరగడం వల్ల పొరపాటు జరిగిందని అధికారులు అంచనాకు వచ్చారు. ఇదే అంశాన్ని ప్రభుత్వానికి నివేదిక రూపంలో పంపించేందుకు సిద్ధమైనట్లు తెలి సింది. ఏదేమైనా ఈ అంశం విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్నం దున ఇలాంటి పొరపాట్లు మరోసారి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు.