సాక్షి, హైదరాబాద్ : టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మేనల్లుడు ధర‍్మారామ్ ఆత‍్మహత్యకు పాల్పడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నారాయణ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న ధర్మారామ్ ఒక సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయ్యాడు. పరీక్షల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపం చెందిన అతడు శుక్రవారం రాత్రి తాను నివాసం ఉంటున్న శ్రీనగర్ కాలనీలోని వాసవి భువన అపార్ట్ మెంట్ ఏడో అంతస్తుపై నుంచి కిందకు దూకేశాడు. తీవ్రంగా గాయపడిన అతడిని కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే కేసు నమోదు చేసిన పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. మరోవైపు ధర్మారామ్ మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
కాగా తెలంగాణలో ఇంటర్ బోర్డు తప్పిదాల వల్ల ఇప్పటికే పలువురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అధికారుల తప్పిదాలకు తమ బిడ్డల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఇవాళ ఇంటర్ బోర్డు ఎదుట ఆందోళనకు దిగారు. అంతేకాకుండా తప్పిదాలపై ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు భగ్గుమంటున్నారు. పరీక్షకు హాజరు కాని విద్యార్థిని పాస్ చేసిన ఇంటర్ బోర్డు అధికారులను ఏం చేయాలంటూ .... విద్యాశాఖ ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 50వేల మంది విద్యార్థులు ఒక్క లెక్కల పరీక్షలోనే ఎందుకు ఫెయిల్ అవుతారని ప్రశ్నిస్తున్నారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి లెక్కలేనితనానికి విద్యార్థలు బాధితులు కావాలా అని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment