లక్షలాదిమంది విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉండే వార్షిక పరీక్షల నిర్వహణను తేలిగ్గా తీసుకుంటే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో ఇంటర్మీడియెట్ బోర్డుకు కనీసం ఇప్పటికైనా అర్ధమై ఉండాలి. ఫలితాల విషయంలో వస్తున్న ఫిర్యాదులపై నిజాయితీగా ఆలోచించి, తగిన చర్యలు తీసుకోవడానికి స్వచ్ఛందంగా సిద్ధపడినట్టయితే మంగళవారం తెలంగాణ హైకోర్టులో బోర్డుకు భంగపాటు ఎదురయ్యేది కాదు. కానీ బోర్డు వ్యవహారశైలి ఆదినుంచీ అందుకు భిన్నంగా ఉంది. ఫెయిలైన 3 లక్షలమంది విద్యార్థుల పరీక్ష పత్రాలను తిరిగి మూల్యాంకనం చేసే విష యంలో మీ నిర్ణయమేమిటో చెప్పాలని ధర్మాసనం ఆదేశించడం ఎందరో తల్లిదండ్రులకు ఊరటనిస్తుంది. ఫలితాలు వెల్లడైనప్పటినుంచి తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థిలోకం అట్టుడుకు తోంది. తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. కానీ బోర్డు తన నిర్వాకాన్ని సరిదిద్దుకోవడానికి ముందుకు రాలేదు సరిగదా వింత తర్కాలకూ, విచిత్ర వాదనలకూ దిగింది. ఒకపక్క తాము ఫెయి లయ్యామన్న ఆవేదనతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 18మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు. ఎంతో బాగా రాసినా ఫెయిలయ్యామని కొందరు, అనుకున్నవిధంగా మార్కులు రాలేదని మరి కొందరు మనస్తాపం చెంది కన్నీరుమున్నీరవుతున్నారు. నిద్రాహారాలకు దూరమయ్యారు. వారి నెలా సముదాయించాలో, ఎలా సర్దిచెప్పాలో తెలియక... వారి భవిష్యత్తు ఏమవుతుందో తోచక తల్లిదండ్రులు ఆందోళనపడుతున్నారు. బోర్డు సారథులు మాత్రం ఇదంతా సాధారణమేనని మాట్లాడుతున్నారు. ఇంతకన్నా అన్యాయం మరేమైనా ఉంటుందా?!
సోమవారం విలేకరులతో మాట్లాడిన బోర్డు కార్యదర్శి అశోక్ వివరణనిచ్చిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. మూల్యాంకనం పారదర్శకంగా, ప్రామాణికంగా జరిగిందని... ఫలితాలు కూడా సక్ర మంగానే ఉన్నాయని ఆయన చెప్పిన మాటలు తల్లిదండ్రుల ఆందోళనను మరింత పెంచాయి. మార్కులు సరిగా రాలేదని భావించినవారు ఎప్పటిలాగే పునఃపరిశీలనకూ లేదా లెక్కింపునకూ దరఖాస్తు చేసుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. ఈ దరఖాస్తులకు ఎలాంటి రుసుమూ వసూలు చేయదల్చుకోకపోతే వేరు. ఒక్కో సబ్జెక్టుకు పునఃపరిశీలనకైతే రూ. 600, తిరిగి లెక్కించడానికైతే రూ. 100 చొప్పున విద్యార్థి చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫెయిలైనట్టు ఫలితం వచ్చిన 3 లక్షలమంది విద్యార్థుల్లో ఎందరు ఈ స్థాయి ఫీజుల్ని భరించగలరు? ఒక్కో పేపర్‌కు రూ. 600 చొప్పున చెల్లించాలంటే ఎన్ని వేల రూపాయలు అవసరమవుతాయో బోర్డు సారథులు ఆలోచిం చారా? సాధారణ పరిస్థితుల్లో అయితే ఈ నిబంధనలను ఎవరూ తప్పుబట్టరు. కానీ ఈసారి జరిగింది వేరు. సాఫ్ట్‌వేర్ కారణంగానో, మూల్యాంకనం సక్రమంగా లేకపోవడం వల్లనో, ఇతర అవకతవకల కారణంగానో ఫలితాల్లో తప్పిదాలు దొర్లాయని, అందువల్ల లక్షలమంది విద్యార్థుల ఫలితాలు తారుమారయ్యాయని ఆరోపణలొచ్చాయి. అందులో వాస్తవం ఉన్నదని భావించడానికి అనేక ఉదాహరణలు కనబడుతున్నాయి. అరబిక్ సబ్జెక్టులు రాసిన ఒకరికి ఉర్దూ సబ్జెక్టుల్లో సున్నా మార్కులొచ్చాయి. తెలుగులో సున్నా మార్కులొచ్చిన ఒక విద్యార్థినికి రీవాల్యుయేషన్ తర్వాత 99 మార్కులొచ్చాయి. 810 మార్కులొచ్చిన ఒక విద్యార్థికి గణితంలో కేవలం 17 మార్కులే వచ్చినట్టు చూపడం, కొందరు విద్యార్థులైతే పరీక్షకు గైర్హాజరైనట్టు చూపడం వంటివి ఎన్నో ఉన్నాయి. మీడియా దృష్టికి ఇంకా రాని అవకతవకలు మరెన్ని ఉన్నాయో ఊహించలేం. ఇలాంటి పరిస్థితుల్లో బోర్డు జరిగిన లోపాలను నిజాయితీగా అంగీకరించి ఫెయిలైనవారి పరీక్ష పత్రాలు మళ్లీ దిద్దించ డానికి స్వచ్ఛందంగా ముందుకొస్తే విద్యార్థుల ఆందోళన సద్దుమణిగేది. అది లేకపోబట్టే ఉన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
బోర్డుకు సాంకేతిక సేవలు అందించడానికి ఒప్పందం కుదుర్చుకున్న గ్లోబరీనా సంస్థకు ఈ విషయంలో కనీస స్థాయి అనుభవమైనా లేదని వస్తున్న ఆరోపణలు ఆందోళన కలిగిస్తాయి. అడ్మి షన్లు మొదలుకొని పరీక్షా ఫలితాలు ఇచ్చేవరకూ అన్ని దశల్లోనూ అవసరమైన సాంకేతికతను సమ కూర్చవలసిన సంస్థ ప్రారంభంలోనే సమస్యల్లో కూరుకుపోయి అయోమయానికి లోనైందని చెబు తున్నారు. ఫలితంగా అడ్మిషన్ల ప్రక్రియలో జాప్యం చోటుచేసుకోవడంవల్ల ఎన్నో ఇబ్బందులు తలె త్తాయి. ఆ తర్వాత విద్యార్థులు ఎంపిక చేసుకున్న సబ్జెక్టులకు సంబంధించి కూడా గందరగోళం తప్పలేదు. మొదట్లోనే బోర్డు అధికారులు మేల్కొని ఆ సంస్థను పక్కనపెట్టకపోవడం పర్యవసా నంగా పరీక్షల సమయానికి, చివరకు ఫలితాల ప్రకటనలో సమస్యలు తలెత్తాయి. లక్షలాదిమంది విద్యార్థుల బంగారు భవిష్యత్తుతో ముడిపడి ఉండే అత్యంత కీలకమైన ప్రక్రియను ప్రైవేటు సంస్థ లకు కట్టబెట్టడం ఎన్ని ప్రమాదాలకు దారితీస్తుందో గుర్తించలేకపోవడం బోర్డు సారథుల తప్పిదం. ఏడాదిక్రితం తొలి దశలో గందరగోళం తలెత్తినప్పుడే దాన్ని పక్కనబెడితే బాగుండేది.
ఆందోళనలు తలెత్తినప్పుడు అవి కట్టుదాటకుండా చూడటం పోలీసుల బాధ్యత. కానీ ఇంటర్ బోర్డు ముందు జరిగిన ఆందోళనల విషయంలో వారి తీరు సమర్థనీయం కాదు. తమకు అన్యాయం జరిగిందని అక్కడికి చేరుకున్న పిల్లలు, వారి తల్లిదండ్రుల విషయంలో పోలీసులు అమానుషంగా వ్యవహరించారు. ఏబీవీపీ నాయకుడు అయ్యప్పకు సంకెళ్లు వేశారు. ఆఖరికి మీడియాతో కూడా వాగ్వివాదానికి దిగారు. అసలు మూడురోజులుగా బోర్డు కార్యాలయానికి వస్తున్న విద్యార్థులకూ, వారి తల్లిదండ్రులకూ తగిన జవాబిచ్చి సముదాయించమని ప్రభుత్వం సలహా ఇచ్చి ఉంటే వివాదం ఇంతగా ముదిరేది కాదు. ఇప్పుడు న్యాయస్థానం జోక్యంతోనైనా పరి స్థితులు చక్కబడతాయని ఆశించాలి. ఎటూ సమస్య వచ్చింది కనుక మొత్తంగా ఇంటర్మీడియెట్ విద్యావ్యవస్థను ప్రక్షాళన చేసి, విద్యార్థులకు భవిష్యత్తులో ఏ సమస్యా ఎదురుకాని విధంగా, బోర్డు ప్రతిష్ట పెరిగేవిధంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం పూనుకోవాలి.
ఇంటర్ బోర్డుకు భంగపాటు
Published Wed, Apr 24 2019 12:21 AM | Last Updated on Wed, Apr 24 2019 12:21 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment