‘విభజన’ హామీలు నెరవేరతాయి: గవర్నర్
తిరుమల: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన అన్ని హామీలనూ కేంద్ర ప్రభుత్వం తప్పక నెరవేరుస్తుందని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ నొక్కిచెప్పారు. ఆంధప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, ఉమ్మడి పరీక్షల విధానం ఇలా అన్నీ అమలవుతాయని, ఎలాంటి సందేహమూ అవసరం లేదని అన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం, ఆలయం వెలుపల విలేకరులతో మాట్లాడారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటై 14 రోజులు పూర్తయిందని, హైదరాబాద్‌లో నివసించే తెలుగువారితోపాటు తమిళం, బెంగాలి, మార్వాడీలు ఇలా అన్ని ప్రాంతాల వారికీ పూర్తి రక్షణ ఇస్తున్నారని తెలిపారు. దీనిపై తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో, ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తున్నారని కితాబిచ్చారు. దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఏడుకొండల వేంకటేశ్వరుడిని ప్రార్థించినట్టు చెప్పారు. రెండు రాష్ట్రాల గవర్నర్ పదవి ఎలా ఉందన్న ప్రశ్నకు ‘ఆ వేంకటేశ్వరుడినే అడగండి’ అంటూ నవ్వుతూ బదులిచ్చారు.