ప్రతి అడుగులోనూ మోసం: వైఎస్‌ జగన్‌ | YS Jagan with YSRCP representatives of local bodies of the joint Visakha district | Sakshi
Sakshi News home page

ప్రతి అడుగులోనూ మోసం: వైఎస్‌ జగన్‌

Published Wed, Aug 14 2024 5:22 AM | Last Updated on Wed, Aug 14 2024 9:43 AM

YS Jagan with YSRCP representatives of local bodies of the joint Visakha district

చంద్రబాబు హామీలు అమలు చేయకుండా సాకులు చెబుతున్నారు

రెండున్నర నెలల్లోనే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది

విత్తనాల కోసం రైతులు క్యూలో నిలబడాల్సి వస్తోంది 

ఈ–క్రాప్, ఉచిత పంటల బీమా ఎత్తేశారు.. 

పూర్తిగా క్షీణించిన శాంతి భద్రతలు.. గ్రామాల్లో కక్షలు, కార్పణ్యాలు పెంచుతున్నారు

ఏదీ శాశ్వతం కాదు.. చీకటి తర్వాత వెలుతురు తప్పదు

మనం తప్పకుండా అధికారంలోకి వస్తాం.. మీరూ నేనూ కలిసి సేవ చేస్తాం

ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులతో వైఎస్‌ జగన్‌

మళ్లీ మన పార్టీ ఘన విజయం సాధిస్తుంది. ఎందుకంటే మనం ఎవరినీ మోసం చేయలేదు. ఎలాంటి అబద్ధాలు చెప్పలేదు. రెండు నెలల్లోనే ఈ ప్రభుత్వంపై ప్రజల్లో ఎంతో వ్యతిరేకత వచ్చింది. ఈ ఐదేళ్లలో వేధింపులకు గురి చేస్తారు. కష్టాలు కూడా ఉంటాయి. నా పరిస్థితులే దీనికి ఉదాహరణ. నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు. అటువంటి కష్టాలు నేను చూశాను. 

కానీ కష్టాలు ఎల్లకాలం ఉండవు. చీకటి తర్వాత వెలుతురు కచ్చితంగా వస్తుంది. రాత్రి తర్వాత పగలు వస్తుంది. ఇది çసృష్టి సహజం. అలాగే ఈ ఐదేళ్లు కూడా ముగుస్తాయి. మనం మళ్లీ అధికారంలోకి వస్తాం. మన ప్రభుత్వంలో మళ్లీ మీరు, నేను ప్రజలకు సేవ చేసే గొప్ప పరిస్థితుల్లో ఉంటాం. ఇది కచ్చితంగా అందరూ గుర్తు పెట్టుకోండి. 
– వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌


సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబునాయుడి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రతి అడుగులోనూ మోసమే కన్పిస్తోందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో గెలుపు కోసం ఎన్నెన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు వాటిలో ఏవీ అమలు చేయకుండా, ఏవేవో కారణాలు చెబుతూ సాకులు చూపుతున్నారని ఎత్తి చూపారు. అది చంద్రబాబు నైజమని, మోసం చేయడం ఆయనకు ఎప్పుడూ అలవాటేనని గుర్తు చేశారు. 

మోసాలకు, అబద్ధాలకు చంద్రబాబు, టీడీపీ అలవాటు పడ్డారని.. అదే మనం విలువలు, విశ్వసనీయత మీదే రాజకీయాలు చేస్తున్నామని.. అందుకే మనకు తప్పక మంచి రోజులు వస్తాయని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు ఉద్భోదించారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో తొలుత మాడుగుల, ఆ తర్వాత అనకాపల్లి, చోడవరం నియోజకవర్గాలకు చెందిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన ప్రభుత్వ హయాంలో ఆర్థిక సంక్షోభం ఎంతగా ఉన్నప్పటికీ సాకులు చూపలేదన్నారు. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లా భావించి, మాట తప్పకుండా అమలు చేశామని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట కోసం కట్టుబడి పని చేశామన్నారు.

‘కోవిడ్‌ మహమ్మారి రెండేళ్లు రాష్ట్రాన్ని పీడించినా, పథకాలు దాటేయాలని ఆలోచించలేదు. క్యాలెండర్‌ ప్రకటించి అన్నీ అమలు చేశాం. అలా అన్నీ చేశాం కాబట్టే.. ఇవాళ్టికి కూడా మన పార్టీలో ప్రతి నాయకుడు, కార్యకర్త తలెత్తుకుని ధైర్యంగా ప్రతి గ్రామానికీ పోగలుగుతాడు. మనం చేసిన మంచి ప్రతి ఇంట్లో ఉంది. ఆ ధైర్యం చంద్రబాబులో, ఆయన పార్టీలో కనిపించదు. ఎందుకంటే, ఓట్లు అడిగేటప్పుడు నీకు రూ.15 వేలు, నీకు రూ.18 వేలు సంతోషమా? అంటూ ప్రచారం చేశారు. యువకులు కనిపిస్తే.. నీకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అన్నారు. ఇలా ఎవరు కనిపిస్తే వారికి వాగ్దానాలు చేశారు’ అని చెప్పారు. వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

ఇప్పటికే ప్రభుత్వంపై వ్యతిరేకత 
జగన్‌ బాగానే చూసుకున్నాడు. జగన్‌ కన్నా చంద్రబాబు వయసులో పెద్దవాడు కదా.. జగన్‌ పలావు పెట్టాడంటే చంద్రబాబు బిర్యానీ పెడతాడేమో అని ప్రజలందరూ కాస్తో కూస్తో మోసపోయి అటు వైపు వెళ్లారు. కేవలం రెండున్నర నెలల్లోనే ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత కనిపిస్తోంది. ఇంటికే వచ్చే పెన్షన్‌ విధానం పోయింది. ఇంటికే వచ్చే రేషన్‌ విధానం పోయింది. మళ్లీ జన్మభూమి కమిటీలు వచ్చాయి. 

విత్తనాల కోసం రైతులు క్యూలో నిల­బడాల్సి వస్తోంది. ఈ–క్రాప్, ఉచిత పంటల బీమా పోయింది. శాంతి భద్రతలు నీరుగారిపోయాయి. గ్రామాల్లో కక్షలు, కార్పణ్యాలు పెంచుతున్నారు. చేసిన మంచి ఎక్కడికీ పోదు. మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి ఈ మంచే మనకు శ్రీరామ రక్ష. చంద్రబాబు చేస్తున్న మోసాలు ప్రజల ఆగ్రహానికి దారి తీస్తాయి. ఎందుకంటే ప్రజలకు ఇప్పుడు పలావు లేదు. బిర్యానీ లేదు. పస్తులుండాల్సిన పరిస్థితి.



జగన్‌ ఉండి ఉంటే..

ఇప్పుడు అదే జగన్‌ ఉండి ఉంటే.. ఈ పాటికి రైతు భరోసా అందేది. ఆ డబ్బులతో రైతులందరూ చక్కగా వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉండేవారు. స్కూళ్లకు వెళ్తున్న పిల్లల తల్లులకు అమ్మ ఒడి అందేది. అక్కచెల్లెమ్మల ముఖంలో చిరునవ్వు కనిపించేది. వారికి సున్నా వడ్డీ ప్రయోజనం అంది ఉండేది. విద్యాదీవెన కింద ప్రతి పిల్లాడికి మూడు నెలలకోసారి ఆర్థిక సాయం అందేది. వసతి దీవెన వచ్చేది. 

మత్స్యకార భరోసా, వాహన మిత్ర కూడా వచ్చి ఉండేవి. చేనేతలకు నేతన్న నేస్తం కూడా ఇప్పటికే జమ అయి ఉండేది. ఇంకా రైతులకు ఉచిత పంటల బీమా అమలై ఉండేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ ప్రీమియం కట్టడం లేదు. గతంలో ఏప్రిల్, మేలో ప్రీమియం కట్టేవాళ్లం. జూన్‌లో వ్యవసాయ పనులు మొదలయ్యేసరికి ఇన్సూ్యరెన్స్‌ డబ్బులు, రైతు భరోసా డబ్బులు ఇచ్చేవాళ్లం. పెట్టుబడులకు రైతులకు సహాయంగా ఉండేది. 

ఇప్పుడు అదీ పోయింది. అవేవీ ఇవ్వకుండా చంద్రబాబు ఇప్పుడు మోసం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ప్రతి అడుగులో మోసం కనిపిస్తోంది. జన్మభూమి కమిటీల చుట్టూ, టీడీపీ నాయకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవన్నీ రెండు నెలల్లోనే కనిపిస్తున్నాయి.

విద్యా వ్యవస్థ దారుణం 
ప్రభుత్వ బడుల్లో టోఫెల్‌ పీరియడ్‌ తీసేశారు. పిల్లలందరూ గొప్పగా ఇంగ్లిష్‌ చదువుకుని ఏకంగా ప్రపంచంతో పోటీ పడేలా చదువుకుంటున్న పరిస్థితులను.. కూటమి ప్రభుత్వం రాగానే నిర్వీర్యం చేస్తున్నారు. ఇంగ్లిష్‌ మీడియం చదువులు అటకెక్కే పరిస్థితి ఉంది. విద్యాకానుక పంపిణీ కూడా అస్తవ్యస్తం. ట్యాబ్‌లు ఇస్తారన్న నమ్మకం లేదు. గోరుముద్ద (మధ్యాహ్న భోజనం) మెనూ కూడా అస్తవ్యస్తంగా మారింది. ఆరోగ్యశ్రీ కింద ఒక్క పైసా ఇవ్వడం లేదు. ఇప్పటికే రూ.1600 కోట్ల బకాయిలు ఉన్నాయి. 

మార్చిలో ఎన్నికల కోడ్‌ రావడంతో.. బిల్లులు ఆపాల్సి వచ్చింది. కానీ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరోగ్యశ్రీకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, పరిపాలన, ఇంటికే అందే డెలివరీ మెకాని­జమ్‌తో పాటు, రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఏకంగా రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలవుతోంది. కక్షలు తీర్చు­కునే వారిని ప్రోత్సహించేలా చంద్రబాబు తీరు ఉంది. ఈ మోసాలు చూస్తున్న ప్రజల్లో ఆగ్రహం మొదలవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement