మంత్రులతో పాటు ప్రభుత్వ ఖర్చుతో ఓఎస్‌డీ, పీఎస్, పీఏలకూ విమాన ప్రయాణం
సాక్షి, అమరావతి : ఎన్నికల సమయంలో ప్రజలకు హామీలిచ్చిన సూపర్ సిక్స్ పథకాల అమలుకు ఖజానా ఖాళీ అంటున్న కూటమి ప్రభుత్వం.. తమ కార్యకర్తలకు జేబులు నింపడానికి అడ్డగోలుగా ప్రత్యేక జీవోలే ఇస్తోంది. ప్రజల సొమ్ముతో కార్యకర్తలు జల్సా చేసేలా ఒకే రోజు మూడు జీవోల్ని విడుదల చేసింది. మంత్రులతో పాటు వారి ఓఎస్‌డీలు, పీఏలు, వ్యక్తిగత సిబ్బంది కూడా విమానాల్లో ప్రయాణించడానికి అనుమతించింది.
ఈమేరకు ప్రభుత్వ కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ ఒక జీవో జారీ చేశారు. మంత్రి ఓఎస్‌డీ, పీఎస్, అడిషనల్ పీఎస్, పీఏలు రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాలకు మంత్రితో పాటు ప్రయాణించడానికి అనుమతించారు. జీతభత్యాలతో సంబంధం లేకుండా మంత్రి కార్యాలయ సిబ్బంది ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించవచ్చని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అదే విధంగా మంత్రులు బయటి వ్యక్తులను ప్రైవేటు కార్యదర్శులుగా, వ్యక్తిగత సహాయకులుగా నియమించుకోవడానికి అనుమతించడమే కాకుండా, వారి వేతనాలను రెట్టింపు చేస్తూ మరో జీవో జారీ చేశారు. మంత్రి వ్యక్తిగత సహాయకుడి వేతనం రూ.18 వేల నుంచి రూ.36 వేలకు, ప్రైవేటు కార్యదర్శి వేతనం రూ.25 వేల నుంచి రూ.50 వేలకు పెంచుతున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మంత్రులకు 96 మంది ప్రైవేటు సిబ్బంది
ప్రతి మంత్రికి నలుగురు చొప్పున మొత్తం 24 మంత్రులకు 96 మంది ప్రైవేటు సిబ్బందిని నియమించుకోవడానికి అనుమతిస్తూ సురేష్ కుమార్ మరో జీవో ఇచ్చారు. ప్రతి మంత్రి ఒక ప్రజా సంబంధాల అధికారి (పీఆర్‌వో)తో పాటు స్వర్ణాంధ్ర విజన్ నిర్వహణకు ఒక ఎంబీఏ గ్రాడ్యుయేట్‌ను నియమించుకోవచ్చు.
సోషల్ మీడియా నిర్వహణకు ఒక సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్, ఒక సోషల్ మీడియా అసిస్టెంట్‌ను నియమించుకోవచ్చు. ఈ విధంగా కూటమి కార్యకర్తల కోసం ప్రత్యేకంగా ఉద్యోగాలను సృష్టించి, ప్రభుత్వ సొమ్మును దుబారా చేయడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment