
సాక్షి, తాడేపల్లి: హామీల పేరుతో ప్రజలను మోసం చేయడమే చంద్రబాబు నైజమని చెప్పారు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్. సూపర్ సిక్స్ ఇస్తామని ఒక్క హామీని కూడా నెరవేర్చని వ్యక్తి చంద్రబాబు. చిన్న పథకం మహిళలకు ఉచిత బస్సు కూడా అమలు చేయడం లేదని తెలిపారు.
వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘ఉచిత బస్సు కోసం మహిళలంతా ఎదురు చూస్తున్నారు. ఉచిత ప్రయాణాలు ఎప్పుడెప్పుడు చేస్తామా? అని ఆశగా చూస్తున్నారు. రాయలసీమ ఆడబిడ్డలంతా విశాఖ పోదామని అనుకుంటున్నారు. ప్రకాశం, విజయనగరం, శ్రీకాకుళం ఆడబిడ్డలంతా అమరావతి ఎలా కడుతున్నారు? ఎలా ఉందని చూడాలనుకుంటున్నారు. ఎప్పటి నుంచి ఉచిత బస్సు అమలు చేస్తారు. ఇది చిన్న పథకం. అది ఇవ్వడానికి కూడా సాకులు చెబుతున్నారు. ఉచిత బస్సు రూపేణ రూ.7వేల కోట్లు ఎగరగొట్టారు. ఇంతకంటే దారుణం ఉంటుందా? అని ప్రశ్నించారు.
అలాగే, రాష్ట్రంలో 18 నుంచి 60 ఏళ్ల మహిళకు సంవత్సరానికి రూ.18 వేలు ఆడబిడ్డ నిధి అన్నారు. దానికి ఎగనామం పెట్టారు. మహిళల సంక్షేమం పేరిట ఈ హామీతో రూ.7 వేల కోట్లు ఎగ్గొట్టారు. స్కూల్‌కి వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15 వేల సాయం అన్నారు. ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తామని అన్నారు. తల్లికి వందనం కోసం మొదటి బడ్జెట్‌లో రూ. 5,386 కోట్లు కేటాయింపులు చేశారు. ఈసారి నెంబర్ మోసంతో ప్రజలను మభ్య పెడుతున్నారు. ఎలాగూ మోసం చేసేది కదా అని ఇలా చేస్తున్నారు. చివరికి చిన్న పిల్లాడికి కూడా బకాయిలు పెడుతూ.. ఎగనామం పెడుతున్నారు’ అని అన్నారు.

Comments
Please login to add a commentAdd a comment