సూపర్‌ సిక్స్‌ ఇవ్వలేమనడం మోసమే..: వైఎస్‌ జగన్‌ | YS Jagan Fires On Chandrababu Naidu Over Super Six Schemes | Sakshi
Sakshi News home page

సూపర్‌ సిక్స్‌ ఇవ్వలేమనడం మోసమే..: వైఎస్‌ జగన్‌

Published Wed, Feb 5 2025 5:15 AM | Last Updated on Wed, Feb 5 2025 12:46 PM

YS Jagan Fires On Chandrababu Naidu Over Super Six Schemes

వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులతో మాట్లాడుతున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సీఎం చంద్రబాబుపై మండిపడిన వైఎస్‌ జగన్‌ 

ఈ మోసాలను ఎండగట్టాలని వైఎస్సార్‌సీపీ నేతలకు పిలుపు

ఇచ్చిన హామీలు అమలు చేయలేకే దుష్ప్రచారం 

ఐదేళ్లలో అదనంగా 75 వేల మెడికల్‌ సీట్లు ఇస్తామన్న కేంద్రం 

కానీ తమకు కొత్తగా మెడికల్‌ సీట్లే వద్దంటున్న రాష్ట్రం 

ఆ మేరకు ఏకంగా కేంద్రానికి చంద్రబాబు లేఖ 

కొత్త మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు చర్యలు 

తద్వారా పేద విద్యార్థులకు తీరని నష్టం  

ఈ అంశాలన్నీ ఫీజు పోరులో భాగం కావాలి 

పేదల పట్ల చంద్రబాబు కక్షను బట్టబయలు చేయాలి  

సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు చంద్రబాబు ఆర్భాటంగా ప్రచారం చేసిన సూపర్‌ సిక్స్‌ హామీలను ఇప్పుడు అమలు చేయలేమని ప్రకటించడం ప్రజలను మోసం చేయడమేనని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఈ ప్రకటన చంద్రబాబు వైఖరిని మరోసారి తేటతెల్లం చేసిందని ఎత్తి చూపారు. సూపర్‌సిక్స్‌ హామీల అమలుపై చేతులెత్తేయడమే కాకుండా, అందుకు ఏవేవో సాకులు చెబుతూ.. వాటిని ప్రజలు నమ్మేలా దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ పెద్దమనిషి ఒక వైపు హామీలన్నింటినీ తుంగలో తొక్కి.. మరోవైపు విద్యుత్‌ చార్జీల మోతతో భారం మోపుతుండటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.

సంపద సృష్టించడం తనకు తెలుసంటూ ప్రచారం చేసుకున్న చంద్రబాబు.. కేవలం అప్పులతోనే కాలం వెళ్లదీయడం వంటి అంశాలను కూడా ప్రజల్లో ఎండగట్టాలని నిర్దేశించారు. చంద్రబాబు దారుణ మోసాలను మరింత లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అందు కోసం రోజూ ప్రజల్లో ఉండాలని, వారితో మరింతగా మమేకం కావాలని సూచించారు.  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం  తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉన్న పార్టీ సీనియర్‌ నేతలతో భేటీ అయ్యారు.

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలతోపాటు ఇటీవల సీఎం చంద్రబాబు ప్రకటనలు, రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల కోత, నిలిచి పోయిన పథకాలు, ఆరోగ్యశ్రీ ఆగిపోవడం తదితర అంశాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి. తొమ్మిది నెలల కూటమి పాలన ప్రజలకు వ్యతిరేకంగా సాగిందని, దీనివల్ల పేదలు, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ... క్షేత్ర స్థాయి అంశాలను నేతలు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు.  

అంతటా అరాచకాలే..
రాష్ట్రంలో మున్సిపల్‌ ఉప ఎన్నికల్లో కూటమి పార్టీల దారుణాల గురించి నేతలు వైఎస్‌ జగన్‌తో చర్చించారు. ఇలాంటి అరాచకాలు ఎక్కడా చూడలేదని, మెజారిటీ లేని.. అసలు సభ్యులే లేని చోట కూడా గెలవడానికి ఎన్నో దారుణాలు చేశారన్నారు. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారని, తగిన సమయంలో కచ్చితంగా బుద్ధి చెబుతారని ఈ సందర్భంగా పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. ఫీజు పోరుపై ఎన్నికల సంఘం (ఈసీ) అనుమతి పెండింగ్‌లో ఉండడంతో వాయిదా వేసిన అంశం సమావేశంలో చర్చకు వచ్చింది.

రాష్ట్రంలో కొత్త మెడికల్‌ కాలేజీలను ప్రైవేటు­పరం చేస్తూ, పేద విద్యార్థులను దారుణంగా దెబ్బ తీస్తున్నారని వైఎస్‌ జగన్‌ అన్నారు. వచ్చే ఐదేళ్లలో కేంద్రం 75 వేల మెడికల్‌ సీట్లు అదనంగా పెంచబోతోందని.. కానీ, చంద్ర­బాబు మాత్రం తమకు కొత్తగా మెడికల్‌ సీట్లు వద్దంటూ కేంద్రానికి లేఖ రాయ­డం అత్యంత దారుణమని మండిపడ్డారు. పేద విద్యార్థుల పక్షాన ఈ అంశాన్ని ఫీజు పోరులో భాగం చేయాలని వైఎస్‌ జగన్‌ పార్టీ నాయకు­లను ఆదేశించారు.రాష్ట్రంలో మెడికల్‌ సీట్ల కుదింపు, కొత్త మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ 

అంశాన్ని కూడా ఫీజు పోరులో భాగం చేసి, పేద విద్యా­ర్థుల పట్ల చంద్రబాబుకు ఉన్న కక్షను ప్రజల్లో బట్టబయలు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో పార్టీ కో–ఆర్డినే­టర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రులు బొత్స సత్యనారా­యణ, బూడి ముత్యాల­నాయుడు, జోగి రమేష్, కురసాల కన్నబాబు, కారుమూరి నాగేశ్వర­రావు, మేరుగు నాగార్జున, విడదల రజని, పార్టీ సీనియర్‌ నేతలు కోన రఘుపతి, ముదునూరు ప్రసాదరాజు, ఆలూరు ఎమ్మెల్యే బూసినె విరూ­పాక్షి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పి­రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు టీజేఆర్‌ సుధాకర్‌బాబు, కొరుముట్ల శ్రీనివా­సులు, అదీప్‌రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement