♦ ఆంధ్రాకు రూ.770కోట్ల నుంచి రూ.1,510 కోట్లకు...
♦ తెలంగాణకు రూ.550కోట్ల నుంచి రూ.1,080కోట్లకు పెంపు
♦ వీటితోపాటు అన్ని రాష్ట్రాలకూ పెంచిన ఆర్‌బీఐ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చేబదులు (వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్) ఆర్‌బీఐ రెట్టింపు చేసింది. దీంతో ఈ రాష్ట్రాలకు రోజువారీ ఖర్చులు, చెల్లింపులకు మరింత వెసులుబాటు వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు మిగతా అన్ని రాష్ట్రాలకు కూడా ఈ పరిమితిని పెంచుతూ ఆర్‌బీఐ సోమవారం ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రాల ఆదాయ వనరులు, వ్యయం పెరగడంతో పాటు ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిపుష్టి ఆధారంగా ఈ పరిమితిని పెంచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ పరిమితి 1,320 కోట్ల రూపాయలుండేది. రాష్ట్ర విభజన తరువాత ఇది ఏపీకి రూ.770 కోట్లు, తెలంగాణకు రూ.550 కోట్లు అయింది.
ఇప్పుడు దీన్ని ఏపీకి రూ.1,510కోట్లకు, తెలంగాణకు రూ.1,080కోట్లకు పెంచిన ఆర్‌బీఐ.. ఇది సోమవారం నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. ఏపీ ప్రభుత్వం గతేడాది కాలంలో తరచూ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్‌ను వాడుకుంటున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ఖజానాలో నగదు నిల్వలు లేనప్పటికీ ఆర్‌బీఐ నుంచి చేబదులుగా ఏపీ ప్రభుత్వం రూ.1,510 కోట్ల వరకు వాడుకోవచ్చు. దీనికి మూడు నెలల వరకు 6.75శాతం వడ్డీ మాత్రమే చెల్లించాలి. ఆ తరువాత కూడా అడ్వాన్స్ కొనసాగితే అదనంగా ఒక శాతం వడ్డీ చెల్లించాలి. చేబదులు పరిమితిని దాటి ఆర్‌బీఐ నుంచి నిధులను వాడుకుంటే ఓవర్‌డ్రాఫ్ట్‌కు వెళ్లినట్లు అవుతుంది. ఓడీలో 14 పనిదినాల పాటు ఉండవచ్చు. ఒకవేళ ఈ గడువు కూడా దాటితే ఆర్‌బీఐ ఆ రాష్ట్ర చెల్లింపులన్నింటినీ నిలిపేస్తుంది. ఆర్థిక సంవత్సరంలో తొలిసారి వేస్ అండ్ మీన్స్ పరిమితికి నూరు శాతంలోపు మాత్రమే ఓవర్‌డ్రాఫ్ట్‌కు వెళితే ఆ మొత్తానికి సాధారణ వడ్డీకి అదనంగా రెండు శాతం వడ్డీని వసూలు చేస్తుంది. వేస్ అండ్ మీన్స్ పరిమితికి నూరు శాతం దాటిపోయి ఓవర్‌డ్రాఫ్ట్‌కు వెళితే ఆ మొత్తానికి సాధారణ వడ్డీకి అదనంగా ఐదు శాతం వడ్డీ వసూలు చేస్తారు.
తెలుగు రాష్ట్రాలకు చేబదులు పరిమితి రెట్టింపు
Published Tue, Feb 2 2016 1:10 AM | Last Updated on Sat, Aug 18 2018 8:05 PM
Advertisement
Advertisement