డబ్బుల్లేవ్
సాక్షి, కాకినాడ :ఏదైనా బిల్లు పట్టుకెళ్తే చాలు...బడ్జెట్ లేదు చెల్లింపులు మా వల్ల కాదు అనే సమాధానం ట్రెజరీ అధికారుల నుంచి వస్తోంది. శాఖల వారీగా ఆదాయం జమ అవుతున్నప్పటికీ బడ్జెట్ కేటాయింపుల్లేకపోవడంతో చెల్లింపులు మాత్రం జరగడం లేదు. ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక పరిస్థితిని చూస్తుంటే ‘విభజన’ కష్టాలు అప్పుడే మొదలయ్యాయనే ఆందోళన సర్వత్రా విన్పిస్తోంది.రాష్ర్ట విభజన నేపథ్యంలో గత నెల 25వ తేదీ నుంచి వారం రోజుల పాటు జిల్లావ్యాప్తంగా ట్రెజరీ కార్యకలాపాలు నిలిపివేశారు. జూన్ 2వ తేదీ(అపాయింటెడ్ డే)నుంచి వివిధ శాఖల హెడ్‌ఆఫ్ ది డిపార్ట్‌మెంట్స్‌కు పాత అకౌంట్స్ రద్దయి కొత్తవి ప్రారంభమయ్యాయి. శాఖల వారీగా రోజూ వచ్చే ఆదాయం సంబంధిత అకౌంట్స్‌లో జమ అవుతోంది కానీ చెల్లింపులు మాత్రం జరగడం లేదు.
రెండ్రోజుల క్రితం ట్రెజరీ అధికారులకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. జూన్ 1వ తేదీకి ముందుకు సంబంధించిన ఏ బిల్లులను జూన్ 2వ తేదీ తర్వాత చెల్లించడానికి వీల్లేదని మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. జూన్ 1వ తేదీకి ముందు జారీయిన చెక్కులను జూన్ 2వ తేదీ తర్వాత చెల్లించడానికి వీల్లేదని తేల్చారు. సంబంధిత శాఖలో బడ్జెట్ అలకేషన్ ఉండి ఉంటే జూన్ 2వ తేదీ తర్వాత తేదీతో జారీ అయ్యే చెక్‌లకు చెల్లింపులు జరపాలని సూచించారు. బడ్జెట్ ఐటమ్స్‌గా పేర్కొన్న చెల్లింపులను బడ్జెట్ ఉన్న మేరకు మాత్రమే సాధ్యమైనంత తక్కువ మొత్తంలోనే జరపాలని పేర్కొన్నారు. ఇక వివిధ శాఖల హెడ్స్ పేరిట ఉండే వ్యక్తిగత డిపాజిట్ (పీడీ) అకౌంట్స్‌ను జూన్ 1వ తేదీతో క్లోజ్ చేసి ఆ క్లోజింగ్ బ్యాలెన్స్‌ను జూన్ 2వ తేదీతో ప్రారంభించే అకౌంట్స్‌లో ఓపెనింగ్ బ్యాలెన్స్‌గా చూపించి ఆ తర్వాత చెల్లింపులు జరపాలని సూచించారు.
రోజువారీ ఖర్చులకే చెల్లింపులు
ఆర్థిక సంవత్సరం ముగియడంతో ఏప్రిల్ - మే నెలలకు సంబంధించి ప్రత్యేక బడ్జెట్ విడుదల చేశారు. ఈ బడ్జెట్‌కు సంబంధించి విడుదలైన నిధుల్లో 85 శాతానికి పైగా ఆయా శాఖలు వినియోగించుకున్నాయి. ఇక మిగిలిన నిధులు జూన్-1వ తేదీతోనే మురిగిపోయాయి. జూన్-2వ తేదీ తర్వాత జరిపే చెల్లింపులకు సంబంధించి ఇప్పటి వరకు బడ్జెట్ అలకేషన్ లేదు. కొత్త సర్కార్ ఇంకా కొలువు దీరకపోవడం.. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ర్ట బడ్జెట్ ప్రవేశ పెట్టకపోవడం ఇందుకు ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు. ప్రతిరోజు వివిధ శాఖల ద్వారా జిల్లా ఖజానాకు రూ.6కోట్ల మేర ఆదాయం జమవుతుంది. ప్రతిరోజు చెల్లింపులు రూ.13 కోట్ల వరకు జరుగుతుంటాయి. కానీ ప్రస్తుతం ఆయా శాఖలకు రోజువారీ నిర్వహణ ఖర్చులు మినహా టీఏలు, డీఏలు, మెడికల్ రీయింబర్సుమెంట్ తదితర బిల్లుల చెల్లింపులేమీ జరగడం లేదు.
పదవీ విరమణ వయస్సు పెంచడంతో తగ్గిన భారం
పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచడంతో ఈనెలలో గరిష్టంగా రిటైర్ కావాల్సిన జిల్లాలోని సుమారు 450 ఉద్యోగుల పదవీ విరమణ గడువు మరో రెండేళ్లు పెరిగింది. దీంతో ఆ మేరకు వీరికి చెల్లించాల్సిన గ్రాట్యూటీ, పీఎఫ్, ఇతర చెల్లింపులు జరపాల్సిన అవసరం లేకపోవడంతో ఆ మేరకు ప్రభుత్వంపై భారం తగ్గినట్టయింది. రాష్ట్రం విడిపోవడంతో శాఖల వారీగా వేర్వేరు అకౌంట్లు ప్రారంభించినప్పటికీ బడ్జెట్ కేటాయింపుల్లేకపోవడంతో బిల్లుల చెల్లింపులు జరపలేకపోతున్నామని మార్గదర్శకాల మేరకే తాము పనిచేస్తున్నామని జిల్లా ట్రెజరీస్ డీడీ లలిత పేర్కొన్నారు.