Apayinted Day
-
డబ్బుల్లేవ్
సాక్షి, కాకినాడ :ఏదైనా బిల్లు పట్టుకెళ్తే చాలు...బడ్జెట్ లేదు చెల్లింపులు మా వల్ల కాదు అనే సమాధానం ట్రెజరీ అధికారుల నుంచి వస్తోంది. శాఖల వారీగా ఆదాయం జమ అవుతున్నప్పటికీ బడ్జెట్ కేటాయింపుల్లేకపోవడంతో చెల్లింపులు మాత్రం జరగడం లేదు. ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక పరిస్థితిని చూస్తుంటే ‘విభజన’ కష్టాలు అప్పుడే మొదలయ్యాయనే ఆందోళన సర్వత్రా విన్పిస్తోంది.రాష్ర్ట విభజన నేపథ్యంలో గత నెల 25వ తేదీ నుంచి వారం రోజుల పాటు జిల్లావ్యాప్తంగా ట్రెజరీ కార్యకలాపాలు నిలిపివేశారు. జూన్ 2వ తేదీ(అపాయింటెడ్ డే)నుంచి వివిధ శాఖల హెడ్ఆఫ్ ది డిపార్ట్‌మెంట్స్‌కు పాత అకౌంట్స్ రద్దయి కొత్తవి ప్రారంభమయ్యాయి. శాఖల వారీగా రోజూ వచ్చే ఆదాయం సంబంధిత అకౌంట్స్‌లో జమ అవుతోంది కానీ చెల్లింపులు మాత్రం జరగడం లేదు. రెండ్రోజుల క్రితం ట్రెజరీ అధికారులకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. జూన్ 1వ తేదీకి ముందుకు సంబంధించిన ఏ బిల్లులను జూన్ 2వ తేదీ తర్వాత చెల్లించడానికి వీల్లేదని మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. జూన్ 1వ తేదీకి ముందు జారీయిన చెక్కులను జూన్ 2వ తేదీ తర్వాత చెల్లించడానికి వీల్లేదని తేల్చారు. సంబంధిత శాఖలో బడ్జెట్ అలకేషన్ ఉండి ఉంటే జూన్ 2వ తేదీ తర్వాత తేదీతో జారీ అయ్యే చెక్‌లకు చెల్లింపులు జరపాలని సూచించారు. బడ్జెట్ ఐటమ్స్‌గా పేర్కొన్న చెల్లింపులను బడ్జెట్ ఉన్న మేరకు మాత్రమే సాధ్యమైనంత తక్కువ మొత్తంలోనే జరపాలని పేర్కొన్నారు. ఇక వివిధ శాఖల హెడ్స్ పేరిట ఉండే వ్యక్తిగత డిపాజిట్ (పీడీ) అకౌంట్స్‌ను జూన్ 1వ తేదీతో క్లోజ్ చేసి ఆ క్లోజింగ్ బ్యాలెన్స్‌ను జూన్ 2వ తేదీతో ప్రారంభించే అకౌంట్స్‌లో ఓపెనింగ్ బ్యాలెన్స్‌గా చూపించి ఆ తర్వాత చెల్లింపులు జరపాలని సూచించారు. రోజువారీ ఖర్చులకే చెల్లింపులు ఆర్థిక సంవత్సరం ముగియడంతో ఏప్రిల్ - మే నెలలకు సంబంధించి ప్రత్యేక బడ్జెట్ విడుదల చేశారు. ఈ బడ్జెట్‌కు సంబంధించి విడుదలైన నిధుల్లో 85 శాతానికి పైగా ఆయా శాఖలు వినియోగించుకున్నాయి. ఇక మిగిలిన నిధులు జూన్-1వ తేదీతోనే మురిగిపోయాయి. జూన్-2వ తేదీ తర్వాత జరిపే చెల్లింపులకు సంబంధించి ఇప్పటి వరకు బడ్జెట్ అలకేషన్ లేదు. కొత్త సర్కార్ ఇంకా కొలువు దీరకపోవడం.. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ర్ట బడ్జెట్ ప్రవేశ పెట్టకపోవడం ఇందుకు ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు. ప్రతిరోజు వివిధ శాఖల ద్వారా జిల్లా ఖజానాకు రూ.6కోట్ల మేర ఆదాయం జమవుతుంది. ప్రతిరోజు చెల్లింపులు రూ.13 కోట్ల వరకు జరుగుతుంటాయి. కానీ ప్రస్తుతం ఆయా శాఖలకు రోజువారీ నిర్వహణ ఖర్చులు మినహా టీఏలు, డీఏలు, మెడికల్ రీయింబర్సుమెంట్ తదితర బిల్లుల చెల్లింపులేమీ జరగడం లేదు. పదవీ విరమణ వయస్సు పెంచడంతో తగ్గిన భారం పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచడంతో ఈనెలలో గరిష్టంగా రిటైర్ కావాల్సిన జిల్లాలోని సుమారు 450 ఉద్యోగుల పదవీ విరమణ గడువు మరో రెండేళ్లు పెరిగింది. దీంతో ఆ మేరకు వీరికి చెల్లించాల్సిన గ్రాట్యూటీ, పీఎఫ్, ఇతర చెల్లింపులు జరపాల్సిన అవసరం లేకపోవడంతో ఆ మేరకు ప్రభుత్వంపై భారం తగ్గినట్టయింది. రాష్ట్రం విడిపోవడంతో శాఖల వారీగా వేర్వేరు అకౌంట్లు ప్రారంభించినప్పటికీ బడ్జెట్ కేటాయింపుల్లేకపోవడంతో బిల్లుల చెల్లింపులు జరపలేకపోతున్నామని మార్గదర్శకాల మేరకే తాము పనిచేస్తున్నామని జిల్లా ట్రెజరీస్ డీడీ లలిత పేర్కొన్నారు. -
రెండు రాష్ట్రాలకూ ప్రస్తుత చట్టాలే
కొత్త ప్రభుత్వాలు మార్పులు చేసుకునే వరకు వర్తింపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏర్పాటయ్యే అపాయింటెడ్ డే కు ముందు రోజు వరకు ఉన్న చట్టాలే ఇరు రాష్ట్రాలకు వర్తిస్తాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. విభజనకు పూర్వం చేసిన చట్టాలను రెండు రాష్ట్రాలు.. తమతమ చట్టసభల్లో ఏవైనా సవరణలు చేసుకోవడం లేదా వాటిని పూర్తిగా రద్దుచేయడం వంటివి చేసేవరకు ఇవే కొనసాగుతాయని పేర్కొన్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 2(ఎఫ్)లో పేర్కొన్న విధంగా చట్టాలు, ఆర్డినెన్స్‌లు, నియంత్రణ, ఆదేశాలు, బైలా, నిబంధనలు, పథకం, నోటిఫికేషన్ తదితరమైనవి ఇరు రాష్ట్రాల్లో కొనసాగుతాయని స్పష్టంచేశారు. ఆంధ్రప్రదేశ్ భూ సంస్కరణల చట్టం 1973కు సంబంధించి రాష్ట్రాల సరిహద్దులు మారుస్తూ.. రాష్ట్రాల అసెంబ్లీలు తీర్మానాలు చేసేవరకు అదే చట్టం అమలవుతుందన్నారు. ప్రస్తుత చట్టాలకు కాలపరిమితి ఉన్నప్పుడు, ఆ కాలపరిమితి ముగియడానికి రెండేళ్ల ముందు వాటిని మార్చడం లేదా కొనసాగించే నిర్ణయం తీసుకోవచ్చని వివరించారు. కోర్టులు, ట్రిబ్యునల్స్, అథారిటీలకు సంబంధించిన చట్టాల్లో మార్పు చేసే సమయంలో స్థూల విషయం దెబ్బతినకుండా.. మార్పు చేయవచ్చన్నారు. చట్టాల మార్పుతో పాలన స్తంభించకుండా చూడాల్సిన బాధ్యత ఉందని గతంలో సుప్రీంకోర్టు రెండు కేసుల్లో స్పష్టంచేసిన అంశాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అపాయింటెడ్ డేకు ముందు ఉన్న చట్టాలు ఒకవేళ కాలం చెల్లినవైన పక్షంలో వాటిని మార్చుకోవడం, అవసరమైతే రద్దు చేసుకునే అధికారం కొత్తగా ఏర్పాటయ్యే శాసనసభలకు ఉంటుందని వివరించారు. -
తెలంగాణ సీఎం నిర్ణయమే కీలకం
*ఉమ్మడి రాజధాని అయినా.. కమిషనర్లను ఎంపిక చేసేది ఆయనే *సీమాంధ్ర ముఖ్యమంత్రి పాత్ర పూర్తిగా శూన్యం *స్పష్టం చేస్తున్న రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు సాక్షి, హైదరాబాద్ : పదిరోజుల్లో రానున్న అపాయింటెడ్ డేతో అధికారికంగా రెండు రాష్ట్రాల పరిపాలన ప్రారంభం కావడంతోపాటు హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా మారనుంది. వీలున్నంత కాలం రెండు రాష్ట్రాల పరిపాలనా ఇక్కడి నుంచే సాగనుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో శాంతిభద్రతల అంశం ఉమ్మడి గవర్నర్ చేతికి వెళ్లనుంది. అయినప్పటికీ హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ల ఎంపిక మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి, ఇక్కడి క్యాబినెట్ నిర్ణయం మేరకే జరగనున్నాయి. ఈ విషయంలో సీమాంధ్ర సీఎం, ఇతర ప్రజాప్రతినిధుల పాత్ర ఏమాత్రం లేదు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ఈ అంశాన్ని స్పష్టం చేస్తోంది. తెలంగాణ మంత్రిమండలే కీలకం గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ప్రాంతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకూ గరిష్టంగా పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. రెండు రాష్ట్రాలకూ కలిపి ఒకే గవర్నర్ ఉంటారు. ఉమ్మడి రాజధానిలో నివసించే వారి జీవన భద్రత, ప్రజల స్వేచ్ఛ, ఆస్తుల భద్రత తదితరాలు గవర్నర్‌కు ఉండే ప్రత్యేక బాధ్యతలు. శాంతిభద్రతలు, అంతర్గత భద్రతపై కూడా గవర్నర్ చర్యలు తీసుకోవలసి ఉంటుంది. ఈ క్రమంలో తెలంగాణ మంత్రిమండలితో గవర్నర్ సంప్రదించిన తరువాతే సొంతగా నిర్ణయం తీసుకోవాలి. ఈ విషయంలో ఏ అంశమైనా గవర్నర్ నిర్ణయమే తుది నిర్ణయం. గవర్నర్‌కు సూచనలు, సలహాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇద్దరు సలహాదారుల్ని నియమిస్తుంది. ఉమ్మడి రాజధాని అయినప్పటికీ భౌగోళికంగా హైదరాబాద్, సైబరాబాద్‌లు తెలంగాణ రాష్ట్రంలో అంతర్భాగం కావడంతో ఇక్కడ పోలీసు కమిషనర్ల నియామకం మాత్రం ప్రత్యక్షంగా తెలంగాణ మంత్రిమండలి, పరోక్షంగా ముఖ్యమంత్రి నిర్ణయం మేరకే జరగనున్నాయి. విపత్కర పరిస్థితుల్లోనే గవర్నర్ జోక్యం శాంతిభద్రత అంశం ఉమ్మడి గవర్నర్ చేతిలో ఉన్నప్పటికీ ప్రతి అంశంలోనూ ఆయన జోక్యం ఉండదు. ఉమ్మడి రాజధానిలో నివసించే సీమాంధ్రుల భద్రత విషయాన్ని నేరుగా ‘ప్రత్యేక బిల్లు’లో ఎక్కడా ప్రస్తావించలేదు. జనం ధన, మాన, ప్రాణాల భద్రత, ప్రజల స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ఎక్కడ నివసించినా రాజ్యాంగబద్ధంగా అక్కడి ప్రభుత్వమే చూడాల్సి ఉంటు ంది. ఈ నేపథ్యంలోనే ఈ బాధ్యతలు తెలంగాణ ప్రభుత్వం పైనే ఉంటాయి. ఉమ్మడి రాజధానిలో ప్రజల భద్రతపై తెలంగాణ మంత్రిమండలితో చర్చించి గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని బిల్లులో స్పష్టం చేశారు. విపత్కర పరిస్థితులు, తీవ్ర సంక్షోభాలు తలెత్తినప్పుడు మాత్రమే గవర్నర్ నేరుగా తన విచక్షణాధికారా ల్ని వినియోగిస్తారు. అలాంటప్పుడు కేంద్రం నియమించే ఇద్దరు సలహాదారులు ఉమ్మడి రాజధానిలో భద్రత వ్యవహారాలకు సంబంధించి గవర్నర్‌కు సూచనలు, సలహాలు అందిస్తారు. అవసరమైతే వినియోగించేందుకు ఐదేళ్ల పాటు ప్రత్యేక రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్)ను హైదరాబాద్‌లో మోహరించి ఉంచుతారు. చండీగఢ్‌లో ఉమ్మడి అంగీకారంతో... చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతం కాకముందు హర్యానా, పంజాబ్‌లకు ఉమ్మడి రాజధానిగా ఉండగా అక్కడో ప్రత్యేక విధానాన్ని అవలంభించారు. ఆ నగర పోలీసు కమిషనర్‌ను రెండు రాష్ట్రాల సీఎం అంగీకారంతో నియమించేవారు. నగరంలో శాంతిభద్రతలకు సంబంధించి పోలీసు కమిషనర్ పోస్టు ఎంతో కీలకమైంది. చండీగఢ్ ఉమ్మడి రాజధాని కావడంతో రెండు ప్రభుత్వాల కార్యాలయాలు, కార్యకలాపాలు, పరిపాలన ఆ నగరం కేంద్రంగానే సాగాయి. దీంతో ఇరు ప్రభుత్వాల అంగీకారాన్నీ పరిగణనలోకి తీసుకునేవారు. ఇక్కడ వివాదం రేగితే దాన్ని పరిష్కరించడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసేవారు. రెండు ప్రభుత్వాలు సూచిస్తున్న వ్యక్తుల అనుభవం, పూర్వ చరిత్ర తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ కమిటీ తుది నిర్ణయం తీసుకునేది. హైదరాబాద్, సైబరాబాద్‌ల విషయంలో ఈ విధానం అమలు చేయడం సాధ్యం కాదన్నది మాజీ పోలీసు బాస్‌ల మాట. -
విభజన లెక్కల్లో తర్జనభర్జన
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ‘అపాయింటెడ్ డే’ గడువు ముంచుకొస్తున్న నేపథ్యంలో జిల్లా అధికారవర్గాల్లో హడావుడి వేగవంతమైంది. గత వారం వరకు ఎన్నికల బిజీగా ఉన్న అధికారగణం.. తాజాగా రాష్ట్ర విభజన తాలూకు అంశాలపై దృష్టి కేంద్రీకరించారు. జూన్ 2ను రాష్ట్ర అపాయింటెడ్ డేగా ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో అన్నిరకాల సర్దుబాట్లు పూర్తి చేయాల్సి ఉంది. సిబ్బంది, వేతనాల పంపిణీ అంశానికి ఈనెల 24 నాటితో తెరపడనుంది. దీంతో చర్యలు వేగిరం చేసిన అధికారులు ఇప్పటికే శాఖల వారీగా అన్ని జిల్లాల నుంచి రాష్ట్ర కార్యాలయాలు వివరాలు సేకరించాయి. స్థానికులు.. స్థానికేతరులు.. ప్రభుత్వ, ఎయిడెడ్ ఉద్యోగుల నియామకాలు, బదిలీలు, పదోన్నతులు తదితర కచ్చితమైన వివరాలు జిల్లా శాఖల వద్దే ఉంటాయి. ఈనేపథ్యంలో ఇటీవల అన్ని రాష్ట్ర కార్యాలయాలు జిల్లా శాఖలకు నిర్దిష్ట నమూనాలో వివరాలు పంపాలని ఆదేశాలు జారీ చేశాయి. దీంతో ఆయా ప్రొఫార్మాలలో వివరాలను నిక్షిప్తం చేసిన అధికారులు రెండ్రోజుల క్రితం రాష్ట్ర శాఖలకు నివేదికలు సమర్పించారు. అదేవిధంగా సాఫ్ట్ కాపీలను సైతం ఇంటర్నెట్ ద్వారా చేరవేశారు. జిల్లాలో దాదాపు 64 ప్రభుత్వ, ఎయిడెడ్ సంస్థల్లో పనిచేస్తున్న 30వేల మంది సిబ్బందిలో స్థానిక ఉద్యోగులు ఎంత మంది, స్థానికేతరులు ఎంతమంది అనే లెక్కలు తేల్చి అందజేసినట్లు తెలిసింది. దీంతో పాటు జిల్లాస్థాయి, డివిజన్ స్థాయిలో పనిచేసే వారిపై కొంత ప్రభావం పడనుంది. రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులు, విద్యాశాఖలో ఉపవిద్యాధికారి, సహాయక సంచాలకులతో పాటు ఇతర శాఖల్లోని జిల్లా, డివిజన్ స్థాయి ఉద్యోగుల సమగ్ర సమాచారాన్ని రాష్ట్ర కార్యాలయాలకు సమర్పించారు. హైదరాబాద్‌కు చేరువలో జిల్లా ఉండడంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన అధికారులు ఇక్కడ పనిచేస్తున్నారు. దీంతో స్థానికేతరులుగా గుర్తించబడిన ఉద్యోగులను వారి స్వస్థలాలకు పంపించే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. 25 నాటికే మే నెల వేతనాలు సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు నెల మొదటి వారంలో వేతనాలు అందుతాయి. తాజాగా రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉమ్మడిగా ఉన్న ఆర్థిక శాఖ ఖాతాను మూసివేయాల్సి ఉంటుంది. ఈనేపథ్యంలో అపాయింటెడ్ డేకు ముందే ఉద్యోగులకు వేతనాలు సర్దుబాటు చేయాల్సి ఉంది. దీంతో ఆయా శాఖల అధికారులు వేతన బిల్లుల తయారీలో నిమగ్నమయ్యారు. ఈనెల 15లోగా వేతన బిల్లులు సమర్పించిన వారికే ఖజానా అధికారులు నిధులు విడుదల చేయనున్నారు. ఈనెల మొదటివారంలో ఏప్రిల్ నెలకు సంబంధించిన వేతనాలు అందుకున్న ప్రభుత్వ ఉద్యోగులు.. తాజాగా ఈనెల 25నాటికే మేనెల వేతనాలు కూడా అందుకోనున్నారు. అంతేకాకుండా ఇతరత్రా రుణాలకు సంబంధించి కూడా ఈనెల 24లోపే తుదిగడువు ఉండడంతో అందుకు సంబంధించిన చెల్లింపులు ఇప్పటికే మొదలయ్యాయి. మొత్తమ్మీద ఈనెల 24తర్వాత ఖజానా శాఖ ఖాతా ముగియనుండడంతో ఆ తర్వాత ఎలాంటి లావాదేవీలు జరిగే అవకాశం లేదు. దీంతో అన్ని శాఖల్లో పెండింగ్ బిల్లులకు సంబంధించి హడావుడి నెలకొంది.