విభజన లెక్కల్లో తర్జనభర్జన
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ‘అపాయింటెడ్ డే’ గడువు ముంచుకొస్తున్న నేపథ్యంలో జిల్లా అధికారవర్గాల్లో హడావుడి వేగవంతమైంది. గత వారం వరకు ఎన్నికల బిజీగా ఉన్న అధికారగణం.. తాజాగా రాష్ట్ర విభజన తాలూకు అంశాలపై దృష్టి కేంద్రీకరించారు. జూన్ 2ను రాష్ట్ర అపాయింటెడ్ డేగా ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో అన్నిరకాల సర్దుబాట్లు పూర్తి చేయాల్సి ఉంది. సిబ్బంది, వేతనాల పంపిణీ అంశానికి ఈనెల 24 నాటితో తెరపడనుంది. దీంతో చర్యలు వేగిరం చేసిన అధికారులు ఇప్పటికే శాఖల వారీగా అన్ని జిల్లాల నుంచి రాష్ట్ర కార్యాలయాలు వివరాలు సేకరించాయి.
స్థానికులు.. స్థానికేతరులు..
ప్రభుత్వ, ఎయిడెడ్ ఉద్యోగుల నియామకాలు, బదిలీలు, పదోన్నతులు తదితర కచ్చితమైన వివరాలు జిల్లా శాఖల వద్దే ఉంటాయి. ఈనేపథ్యంలో ఇటీవల అన్ని రాష్ట్ర కార్యాలయాలు జిల్లా శాఖలకు నిర్దిష్ట నమూనాలో వివరాలు పంపాలని ఆదేశాలు జారీ చేశాయి. దీంతో ఆయా ప్రొఫార్మాలలో వివరాలను నిక్షిప్తం చేసిన అధికారులు రెండ్రోజుల క్రితం రాష్ట్ర శాఖలకు నివేదికలు సమర్పించారు. అదేవిధంగా సాఫ్ట్ కాపీలను సైతం ఇంటర్నెట్ ద్వారా చేరవేశారు. జిల్లాలో దాదాపు 64 ప్రభుత్వ, ఎయిడెడ్ సంస్థల్లో పనిచేస్తున్న 30వేల మంది సిబ్బందిలో స్థానిక ఉద్యోగులు ఎంత మంది, స్థానికేతరులు ఎంతమంది అనే లెక్కలు తేల్చి అందజేసినట్లు తెలిసింది. దీంతో పాటు జిల్లాస్థాయి, డివిజన్ స్థాయిలో పనిచేసే వారిపై కొంత ప్రభావం పడనుంది. రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులు, విద్యాశాఖలో ఉపవిద్యాధికారి, సహాయక సంచాలకులతో పాటు ఇతర శాఖల్లోని జిల్లా, డివిజన్ స్థాయి ఉద్యోగుల సమగ్ర సమాచారాన్ని రాష్ట్ర కార్యాలయాలకు సమర్పించారు. హైదరాబాద్‌కు చేరువలో జిల్లా ఉండడంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన అధికారులు ఇక్కడ పనిచేస్తున్నారు. దీంతో స్థానికేతరులుగా గుర్తించబడిన ఉద్యోగులను వారి స్వస్థలాలకు పంపించే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి.
25 నాటికే మే నెల వేతనాలు
సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు నెల మొదటి వారంలో వేతనాలు అందుతాయి. తాజాగా రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉమ్మడిగా ఉన్న ఆర్థిక శాఖ ఖాతాను మూసివేయాల్సి ఉంటుంది. ఈనేపథ్యంలో అపాయింటెడ్ డేకు ముందే ఉద్యోగులకు వేతనాలు సర్దుబాటు చేయాల్సి ఉంది. దీంతో ఆయా శాఖల అధికారులు వేతన బిల్లుల తయారీలో నిమగ్నమయ్యారు. ఈనెల 15లోగా వేతన బిల్లులు సమర్పించిన వారికే ఖజానా అధికారులు నిధులు విడుదల చేయనున్నారు. ఈనెల మొదటివారంలో ఏప్రిల్ నెలకు సంబంధించిన వేతనాలు అందుకున్న ప్రభుత్వ ఉద్యోగులు.. తాజాగా ఈనెల 25నాటికే మేనెల వేతనాలు కూడా అందుకోనున్నారు. అంతేకాకుండా ఇతరత్రా రుణాలకు సంబంధించి కూడా ఈనెల 24లోపే తుదిగడువు ఉండడంతో అందుకు సంబంధించిన చెల్లింపులు ఇప్పటికే మొదలయ్యాయి. మొత్తమ్మీద ఈనెల 24తర్వాత ఖజానా శాఖ ఖాతా ముగియనుండడంతో ఆ తర్వాత ఎలాంటి లావాదేవీలు జరిగే అవకాశం లేదు. దీంతో అన్ని శాఖల్లో పెండింగ్ బిల్లులకు సంబంధించి హడావుడి నెలకొంది.