సీఎంల భేటీ శుభ పరిణామం: వెంకయ్య
సమస్యల పరిష్కారంలో ఇది ముందడుగు
రెండు రాష్ట్రాల మధ్య ఎప్పటికీ స్నేహభావం కొనసాగాలి..
అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నేపథ్యంలో వచ్చిన సమస్యల పరిష్కారానికి ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు భేటీ కావడం శుభ పరి ణామమని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘నాటి కేంద్ర ప్రభుత్వం కసరత్తు, దూరదృష్టి, విజ్ఞత లేకుండా చేసిన విభజన వల్లే ఈ సమస్యలు ఉత్పన్నమయ్యాయి. రెండు రాష్ట్రాల మధ్య అవసరమైనవి, అనవసరమైనవి అనేక వివాదాలు వచ్చి ప్రజ లను ఆందోళనకు గురిచేశాయి.
న్యాయం జరుగుతోందని ఒక రాష్ట్రం, రాష్ట్రం ఏర్పడినా న్యాయం జరగడంలేదని మరొక రాష్ట్రం బాధ పడేపరిస్థితిని ఆనాటి పాల కులు తెచ్చారు. వారి వ్యవహారం వల్ల తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యులు ఆంధ్రప్రదేశ్‌కు, ఆ రాష్ట్రానికి చెం దిన వారు తెలంగాణకు ప్రాతినిథ్యం వహిం చాల్సి వస్తోంది. ఆ ఎంపీల మానసిక క్షోభ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అలాగే శాసన మం డలి సభ్యుల సంఖ్య 20 ఉండాల్సిన చోట ఆమేరకు కేటాయించలేదు. పోలవరం విషయంలో ఆర్డినెన్స్ తేవాల్సిన పరిస్థితి కల్పిం చారు.
ఉద్యోగుల కేటాయింపునకు కమిటీలను ముందే వేసి, మార్గదర్శకాలను ఆనాడే రూ పొందించి పార్లమెంటు విశ్వాసాన్ని పొంది ఉంటే సరిపోయేది. కానీ దాన్ని జఠిలం చేశారు. సివిల్ సర్వీసెస్ అధికారుల్లో కూడా అనిశ్చితి. కిందిస్థాయి ఉద్యోగులదీ అదే పరిస్థితి. విభాగాలు, సంస్థల కేటాయింపు వంటి అంశాలను ముందే చూడాల్సిం ది. ఎవరినో నిందించాలని ఇలా అనడంలేదు. ఇప్పుడు రెండు రాష్ట్ర ప్రభుత్వాలను తప్పుబట్టడానికి లేదు. ఇద్దరు సీఎం లు, స్పీకర్లు, సీఎస్‌లు చర్చలు జరపడం సమస్యల పరిష్కారంలో ఒక ముందడుగు.
వివాదాల వల్ల అభివృద్ధి కుంటుపడుతుంది. రెండు రాష్ట్రాలూ చర్చలు కొనసాగించాలి. అర్థవంతమై న రీతిలో చర్చలు జరగాలి. జఠిల సమస్యలపై విస్తృతంగా, లోతుగా మాట్లాడుకోవాలి. శాశ్వత, దీర్ఘకాలిక పరిష్కారాలను కనుక్కోవాలి. అవసరం వస్తే సాయం చేయడానికి కేంద్రం ఉంది. రెండు రాష్ట్రాల మధ్య ఎప్పటికీ స్నేహభావం కొనసాగాలి. కేంద్రం అనవసరంగా జోక్యం చేసుకోదు. వాళ్లు అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలి. విభజన చట్టంలో ఉన్న హామీలన్నీ నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని చెప్పారు. ‘హిందూ’ అనే పదం ఒక జీవన విధానమని, దానిలో మతపర సంకుచితత్వం లేదని తెలిపారు.