'మనమంతా టీమ్ ఇండియాలా పని చేద్దాం'
హైదరాబాద్: ఓ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం అత్యంత అవసరమని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. అలా సాగితేనే రాష్ట్రాల అభివృద్ది వేగవంతమవుతుందని ఆయన అన్నారు. శనివారం హైదరాబాద్లో ఆంధ్ర, తెలంగాణ ముఖ్యమంత్రులతో వేర్వేరుగా వెంకయ్యనాయుడు భేటీ అయ్యారు. అనంతరం ఇరు రాష్ట్రాల సీఎంలతో చర్చించిన విషయాలను వెంకయ్య విలేకర్లకు వివరించారు. విభజన చట్టంలోని అంశాలను ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవించాలని సూచించినట్లు చెప్పారు.
ఏమైనా సమస్యలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలని కోరినట్లు తెలిపారు. కేంద్ర నిధులతో ఇరు రాష్ట్రాలలో అమలవుతున్న కార్యక్రమాల తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణకు మధ్య ఎటువంటి గ్యాప్ లేదని విలేకరి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
రాజకీయ వివక్ష లేకుండా అందరికి సహకరిస్తామని అన్నారు. ఆంధ్ర, తెలంగాణ విడిపోయినా మనమంతా భారతీయులం అన్న సంగతి గుర్తుంచుకోవాలని వెంకయ్య అన్నారు. రాజకీయాలతో నిమిత్తం లేకుండా అభివృద్ధి కోసం మనమంతా టీమ్ ఇండియాలాగా కలసి పని చేద్దామని వారికి సూచించినట్లు వెంకయ్య నాయుడు చెప్పారు.