బ్యాక్డోర్ ద్వారా రాజకీయాల్లోకి రాలేదు: కేటీఆర్
తాను, తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు, నిజామాబాద్ ఎంపీ కవితలు బ్యాక్ డోర్ ద్వారా రాజకీయాల్లోకి రాలేదని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన ఉద్యమంలో తాము ముందున్నామని... అందువల్లే తమను ప్రజలు ఎన్నికలలో ఎన్నుకున్నారని ఆయన చెప్పారు. తమను విమర్శిస్తున్న వారందరికి మా పనితీరుతోనే సమాధానం చెబుతామని అన్నారు. బుధవారం హైదరాబాద్లో సాక్షి టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడారు.
తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవి చేపట్టడంపై పలువురు విమర్శలు చేస్తున్నారు.... అయితే అలా చేయడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడులతో తలపడాలంటే ఒక్క కేసీఆర్ వల్లే సాథ్యమని కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ సారథ్యంలో ప్రస్తుతం ఉన్న కేబినెట్ పూర్తి స్థాయిది కాదని తెలిపారు. త్వరలోను మరోసారి కేసీఆర్ కేబినెట్ విస్తరణ ఉంటుందని... ఆ విస్తరణలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉంటుందని వెల్లడించారు. రానున్న ఇదేళ్లలో లాభాపేక్షలేని పారదర్శక పాలన అందిస్తామని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధిపై అపోహలు అనవసరమన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడుకోవడం ద్వారా తెలంగాణ ప్రతిభను నిలబెడతామని కేటీఆర్ తెలిపారు.